పుణె ఫీల్డింగ్ అదుర్స్... | mumbai indians set target of 130 runs against mumbai | Sakshi
Sakshi News home page

పుణె ఫీల్డింగ్ అదుర్స్...

Published Sun, May 21 2017 9:44 PM | Last Updated on Tue, Sep 5 2017 11:40 AM

mumbai indians set target of 130 runs against mumbai

హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-10 టైటిల్ పోరులో భాగంగా ఆదివారం రాత్రి ఇక్కడ రైజింగ్ పుణె సూపర్ జెయింట్ తో జరుగుతున్న మ్యాచ్ లో ముంబై ఇండియన్స్  130 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్ లో టాపార్డర్ విఫలం కావడంతో ఆ జట్టు సాధారణ స్కోరుకే పరిమితమైంది. ముంబై ఆటగాళ్లలో కృనాల్ పాండ్యా(47), రోహిత్ శర్మ(24) లు మినహా మిగిలిన వారంతా ఘోరంగా విఫలమయ్యారు.

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ముంబై ఇండియన్స్ కు ఆదిలోనే గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్లు పార్ధీవ్ పటేల్(4), సిమన్స్(3) లు తీవ్రంగా నిరాశపరిచారు. వీరిద్దరూ జట్టు స్కోరు ఎనిమిది పరుగుల వద్ద నిష్ర్కమించడంతో ముంబైకు షాక్ కు గురైంది. ఆపై అంబటి రాయుడు-రోహిత్ శర్మలు ఇన్నింగ్స్ చక్కదిద్దేందుకు యత్నించారు. అయితే వీరిద్దరూ 33 పరుగుల్ని జత చేసిన తరువాత రాయుడు(12) రనౌట్ గా అవుటయ్యాడు. ఆ తరువాత స్వల్ప వ్యవధిలో రోహిత్ శర్మ కూడా అవుట్ కావడంతో ముంబై తేరుకోలేకపోయింది. ఓ దశలో వంద పరుగుల్ని కూడా చేరడం కూడా కష్టంగా అనిపించిన తరుణంలో కృనాల్ పాండ్యా ఆదుకున్నాడు. సమయోచిత బ్యాటింగ్ తో 38 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 47 పరుగులు చేయడంతో ముంబై నిర్ణీత ఓవర్లలో ఎనిమిది వికెట్లు కోల్పోయి 129 పరుగులు చేసింది.


ఫీల్డింగ్ అదుర్స్..

అమీతుమీ తేల్చుకోవాల్సిన మ్యాచ్ లో పుణె ఫీల్డింగ్ లో అదుర్స్ అనిపించింది. ముంబై ఇండియన్స్ ఇచ్చిన ఏ ఒక్క అవకాశాన్ని పుణె ఫీల్డర్లు వదల్లేదు. ముంబై ఇండియన్స్ ఓపెనర్ సిమన్స్ ను రిటర్న్ క్యాచ్ రూపంలో ఉనద్కత్ అద్భుతంగా అందుకున్నతీరు అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది. బంతి కింది పడబోయే సమయంలో ఉనద్కత్ మెరుపు వేగంతో ఒడిసి పట్టుకుని శభాష్ అనిపించాడు. ఆ తరువాత అంబటి రాయుడ్ని స్టీవ్ స్మిత్ రనౌట్ చేసిన తీరు అమోఘం.

ఈ రెండు ఒక ఎత్తయితే ఆడమ్ జంపా బౌలింగ్ లో రోహిత్ శర్మ ఇచ్చిన క్యాచ్ ను బౌండరీ లైన్ వద్ద శార్దూల్ ఠాకూర్ అందుకున్న వైనం మ్యాచ్ కే హైలెట్. ఆపై కరణ్ శర్మను శార్దూల్ ఠాకూర్ రనౌట్ చేసిన తీరు ఆకట్టుకుంది. ఇక్కడ కరణ్ శర్మ ఇచ్చిన స్లిప్ క్యాచ్ ను ముందు క్రిస్టియన్ వదిలేశాడు. కాగా, అప్పటికే కరణ్ శర్మ క్రీజ్ ను వదిలేసి ముందుకు వెళ్లి పోయాడు. ఆ సమయంలో సమయ స్ఫూర్తితో వ్యవహరించిన బౌలర్ శార్దూల్ ఠాకూర్.. క్రిస్టియన్ విసిరిన బంతిని చాకచక్యంగా అందుకుని రనౌట్ చేశాడు. ఒకవైపు మైమరించే క్యాచ్లు, మరొకవైపు అద్భుతమైన రనౌట్లతో ప్రేక్షకుల్ని మంత్ర ముగ్ధుల్ని చేశారు పుణె ఆటగాళ్లు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement