పుణె సక్సెస్ కు కారణం ఇదే..
హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-10 సీజన్ లో ఏమాత్రం అంచనాలు లేకుండా బరిలోకి దిగిన జట్టు రైజింగ్ పుణె సూపర్ జెయింట్. అయితే ఆ జట్టు తుది సమరానికి సిద్ధమై మేటి జట్లను సైతం ఔరా అనిపించింది. ఇదిలా ఉంచితే, ఐపీఎల్ ఆరంభానికి ముందు పుణె జట్టు సాహసోపేత నిర్ణయం తీసుకుంది. ఐపీఎల్లో మోస్ట్ సక్సెస్ ఫుల్ కెప్టెన్ గా ఉన్న మహేంద్ర సింగ్ ధోనిని తప్పించి ఆ బాధ్యతల్ని స్టీవ్ స్మిత్ కు అప్పగించింది. దీనిపై అప్పట్లో దుమారం చెలరేగినప్పటికీ, ఆ తరువాత అంతా సర్దుకుంది. ఇక్కడ ధోని కూడా తనను కెప్టెన్సీ నుంచి తప్పించారనే విషయాన్ని పట్టించుకోకుండా మిస్టర్ కూల్ తరహాలో అప్పచెప్పిన పనిని సమర్ధవంతంగా చేసుకుపోవడంతో జట్టులో ఎటువంటి విభేదాలు చోటు చేసుకోలేదు.
దీన్ని కాసేపు పక్కకు ఉంచితే, ఈ సీజన్ లో పుణె జట్టు స్వల్ప మార్పుతో బరిలోకి దిగింది. గత సీజన్ పుణె సూపర్ జెయింట్స్ గా వచ్చి నిరాశపరిచిన పుణె.. ఈసారి పుణె సూపర్ జెయింట్ గా పోరుకు సిద్ధమైంది. కేవలం జట్టు పేరులో 'ఎస్' అనే చివరి అక్షరాన్ని తొలగించి తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి సిద్ధమైంది. ఇలా పేరు మార్చడానికి న్యూమరాలజీ(సంఖ్యా శాస్త్రం)నే కారణమంటున్నాడు పుణె యజమాని సంజీవ్ గోయంకా. తనకు సంఖ్యాశాస్త్రంపై పెద్దగా నమ్మకం లేకపోయినప్పటికీ, పేరు మార్చి చూస్తే ఏంపోతుంది అనే ఉద్దేశంతోనే అలా చేసినట్లు పేర్కొన్నాడు. ఇది పుణె జట్టును ఫైనల్ వరకూ చేర్చడంలో సహకరించిందంటూ తెగ ఆనందపడిపోతున్నాడు.