స్టీవ్ స్మిత్.. భావోద్వేగ సందేశం
హైదరాబాద్: ఐపీఎల్లో రైజింగ్ పుణె సూపర్ జెయింట్ జట్టుకు కెప్టెన్ గా వ్యవహరిస్తున్న స్టీవ్ స్మిత్.. ఆదివారం ఉప్పల్ స్టేడియంలో జరిగే ఫైనల్ కు కొద్ది గంటల ముందు భావోద్వేగ సందేశాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దాదాపు నాలుగు నెలల భారత్ పర్యటనలో ఉన్న తనకు ఇక్కడ ప్రజలు చూపించిన ప్రేమాభిమానులు మరవలేనివిగా పేర్కొన్నాడు.
' నా సుదీర్ఘ జర్నీ నిజంగా అద్భుతంగా ఉంది. ఇక్కడ చాలా ఎత్తు పల్లాలు చవిచూడటమే కాకుండా ఎన్నో విషయాలు నేర్చుకున్నాను. కొంతమంది ప్రజల్ని కూడా కలిశాను. ఈ క్రమంలోనే కొంతమంది కొత్త ఫ్రెండ్స్ ఏర్పడ్డారు. ఐపీఎల్ ఆడటం అనేది అదొ గొప్ప అనుభవంగా భావిస్తున్నా. ఐపీఎల్ ఫైనల్ తరువాత కేవలం ఇక్కడ ఒక రాత్రి మాత్రమే ఉంటా. భారత్ లో ఉన్న ప్రజలందరికీ ధన్యవాదాలు. మా జట్టుకు మద్దతు తెలిపిన అభిమానులకు సైతం కృతజ్ఞతులు. ఈ పర్యటన ఎప్పటికీ నాకు గొప్ప జ్ఞాపకంగా గుర్తుండి పోతుంది'అని స్టీవ్ స్మిత్ తన ఇన్స్టా గ్రాం అకౌంట్ లో పోస్ట్ చేశాడు.
ఆదివారం రాత్రి ఉప్పల్ లోని రాజీవ్ గాంధీ స్టేడియంలో రైజింగ్ పుణె-ముంబై ఇండియన్స్ జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే రెండు సార్లు టైటిల్ సాధించిన ముంబై ఇండియన్స్ తో తొలిసారి పుణె తలపడతుంది. ఈ మ్యాచ్ లో ఎవరు గెలిచినా కొత్త చరిత్రను లిఖిస్తారు. మరి టైటిల్ పోరులో విజేత ఎవరో మరి కొన్ని గంటల్లో తేలిపోనుంది.