జింఖానాలో టికెట్ కౌంటర్ వద్ద సందడి
హైదరాబాద్: ముంబై ఇండియన్స్- రైజింగ్ పుణె సూపర్ జెయింట్ జట్ల మధ్య ఆదివారం రాత్రి జరిగే ఐపీఎల్–10 ఫైనల్ సందర్భంగా కనీవినీ ఎరుగని రీతిలో ఉప్పల్ స్టేడియం చుట్టూ, లోపల పోలీసులు పటిష్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. శుక్రవారం నుంచి రాచకొండ పోలీసులు స్టేడియాన్ని తమ ఆధీనంలోకి తీసుకుని విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్నారు. శనివారం ఉదయం నుంచి బాంబ్, డాగ్ స్క్వాడ్‌లతో స్టేడియం లోపల, బయట అణువణువూ చెక్ చేశారు.
స్టేడియం బయట అనుమానితులపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. గత మ్యాచ్‌లతో పోలిస్తే ఈ మ్యాచ్‌కు గతంలో ఎన్నడూ లేని విధంగా పోలీసులు పటిష్ట బందోబస్తును కల్పించారు. 1,800 మంది పోలీస్ సిబ్బందితో భద్రతను కట్టుదిట్టం చేశారు. 870 మంది లా అండ్ ఆర్డర్ పోలీసులు, 250 సెక్యూరిటీ వింగ్, 270 ట్రాఫిక్ సిబ్బంది, 88 సీసీ కెమెరాలతో బందోబస్తు నిర్వహించారు.