ముంబై ఇండియన్స్ బెస్ట్.. సన్ రైజర్స్ లాస్ట్!
హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్-2017 చాంపియన్ ముంబై ఇండియన్స్ ఈ సీజన్లో అత్యధిక సిక్సర్లు బాదిన జట్టుగానూ రికార్డు నెలకొల్పింది. ఫైనల్లో రైజింగ్ పుణే సూపర్ జెయింట్‌ను స్వల్ప స్కోరుకే కట్టడిచేసి విజయం సాధించిన ముంబై ఇండియన్స్ ఈ సీజన్లో 117 సిక్సర్లు నమోదు చేసి అగ్రస్థానం ఆక్రమించగా, సన్ రైజర్స్ అట్టడుగున నిలిచింది. ఓవరాల్‌గా అన్ని జట్లు కలిపి 705 సిక్సర్లు సాధించాయి. గతేడాది (638) కంటే 67 సిక్సర్లను ఆటగాళ్లు ఈ సీజన్లో రాబట్టారు.
ముంబై తర్వాత 92 సిక్సర్లతో గుజరాత్ లయన్స్, 89 సిక్సర్లతో రైజింగ్ పుణె సూపర్ జెయింట్ రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి. కింగ్స్ ఎలెవన్ పంజాబ్ 88 సిక్సర్లు, ఢిల్లీ డేర్ డెవిల్స్ 87 సిక్సర్లు, కోల్‌కతా నైట్ రైడర్స్ 87 సిక్సర్లు, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు75 సిక్సర్లు, సన్‌రైజర్స్ హైదరాబాద్ 70 సిక్సర్లతో ఆ తర్వాతి స్థానాల్లో నిలిచాయి.
సన్‌రైజర్స్ కెప్టెన్ డేవిడ్ వార్నర్, మ్యాక్స్‌వెల్‌లు అత్యధికంగా 26 సిక్సర్లతో సంయుక్తంగా తొలిస్థానం దక్కించుకోగా.. యువ సంచలనం రిషబ్ పంత్ 24 సిక్సర్లు, కీరన్ పోలార్డ్ 22 సిక్సర్లు, రాబిన్ ఉతప్ప 21 సిక్సర్లతో ఆ తర్వాతి స్థానాల్లో నిలిచారు.