![Ranji Trophy Semi Finals: Mumbai And Madhya Pradesh In Driving Seat Vs Tamil Nadu And Vidarbha - Sakshi](/styles/webp/s3/article_images/2024/03/3/Untitled-6_0.jpg.webp?itok=wk7836M_)
రంజీ ట్రోఫీ 2024 సెమీఫైనల్స్‌లో ముంబై, మధ్యప్రదేశ్ జట్లు పైచేయి సాధించాయి. రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఈ రెండు జట్లు.. తమతమ ప్రత్యర్దుల కంటే మెరుగైన స్థితిలో ఉన్నాయి. ముంబై తమిళనాడుపై.. మధ్యప్రదేశ్ విదర్భపై ఆధిక్యతను ప్రదర్శిస్తున్నాయి.
హిమాన్షు సూపర్ సెంచరీ..
నాగ్‌పూర్‌లో జరుగుతున్న తొలి సెమీఫైనల్లో విదర్భ రెండో రోజు ఆట ముగిసే సమయానికి సెకెండ్ ఇన్నింగ్స్‌లో వికెట్ నష్టానికి 13 పరుగులు చేసింది. ఈ జట్టు మధ్యప్రదేశ్ తొలి ఇన్నింగ్స్ స్కోర్‌కు ఇంకా 69 పరుగులు వెనుకపడి ఉంది. అథర్వ తైడే (2) ఔట్ కాగా.. దృవ్ షోరే (10), అక్షయ్ వాఖరే (1) క్రీజ్‌లో ఉన్నారు.
అంతకుముందు హిమాన్షు మంత్రి (126) సూపర్ సెంచరీతో కదంతొక్కడంతో మధ్యప్రదేశ్ తొలి ఇన్నింగ్స్‌లో 252 పరుగులు చేసింది. హిమాన్షు మినహా మధ్యప్రదేశ్ ఇన్నింగ్స్‌లో ఎవరూ రాణించలేకపోయారు.
ఉమేశ్ యాదవ్ (3/40), యశ్ ఠాకూర్ (3/51), వాఖరే (2/68), సర్వటే (1/48) మధ్యప్రదేశ్ పతనాన్ని శాశించారు. దీనికి ముందు ఆవేశ్ ఖాన్ (4/49) విజృంభించడంతో విదర్భ తొలి ఇన్నింగ్స్‌లో 170 పరుగులకే ఆలౌటైంది. కరుణ్ నాయర్ (63) టాప్ స్కోరర్‌గా నిలిచాడు.
శతక్కొట్టిన శార్దూల్..
ముంబై వేదికగా తమిళనాడుతో జరుగుతున్న రెండో సెమీఫైనల్లో ముంబై ఆధిక్యత ప్రదర్శిస్తుంది. తొమ్మిదో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన శార్దూల్ (109) మెరుపు శతకంతో విరుచుకుపడటంతో ముంబై తొలి ఇన్నింగ్స్‌లో 9 వికెట్ల నష్టానికి 353 పరుగులు చేసి ఇన్నింగ్స్‌ను కొనసాగిస్తుంది. 10, 11 స్థానాల్లో వచ్చి సెంచరీలతో (క్వార్టర్ ఫైనల్స్‌లో) సంచలనం సృష్టించిన తనుశ్ కోటీయన్ (74), తుషార్ దేశ్ పాండే (17) క్రీజ్‌లో ఉన్నారు. ప్రస్తుతం ముంబై 207 పరుగుల లీడ్‌లో కొనసాగుతుంది. సాయికిషోర్ ఆరేసి (6/97) ముంబైను దెబ్బకొట్టాడు.
అంతకుముందు తమిళనాడు తొలి ఇన్నింగ్స్‌లో 146 పరుగులకే కుప్పకూలింది. ముంబై బౌలర్లు సంయుక్తంగా రాణించడంతో తమిళనాడు ఇన్నింగ్స్ పేకమేడలా కూలింది. తుషార్ దేశ్ పాండే 3, ముషీర్ ఖాన్, శార్దూల్ ఠాకూర్, తనుశ్ కోటియన్ తలో 2 వికెట్లు, మోహిత్ అవస్థి ఓ వికెట్ పడగొట్టారు. తమిళనాడు ఇన్నింగ్స్‌లో విజయ్ శంకర్ (44), వాషింగ్టన్ సుందర్ (43) కాస్త పర్వాలేదనిపించగా.. మిగతా వాళ్లంతా దారుణంగా విఫలమయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment