మొబైల్, ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
శ్రీనగర్: భద్రత కారణాల రీత్యా కశ్మీర్లో బుధవారం మొబైల్, ఇంటర్ నెట్ సర్వీసులను నిలిపివేశారు. ఈ సేవలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నామని, సాధారణ పరిస్థితి నెలకొన్న తర్వాత సర్వీసులను పునరుద్దరిస్తామని స్థానిక అధికారులు తెలిపారు. హంద్వారా ఘటనలో అలజడి కొనసాగుతున్న నేపథ్యంలో కశ్మీర్లోని కుపార్వా, బారాముల్లా, బందీపూర, గండేర్ బల్ జిల్లాల్లో ఇవాళ మొబైల్ ఇంటర్నెట్ సర్వీసులను నిలిపివేశారు.
ఆర్మీ జవాన్ల కాల్పుల్లో నలుగురు మృతి చెందటం ఉద్రిక్తతకు దారి తీసింది. దీంతో సోషల్ మీడియాలో దుష్ర్పచారం, వదంతులు చెలరేగే అవకాశముండటంతో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. కాగా ఉత్తర కశ్మీర్లో గతంలో మిలిటెన్సీ ప్రభావం తీవ్రంగా ఉన్న సమయంలో కశ్మీర్ లోయలో ఇంటర్నెట్ సర్వీసులను నిలిపివేసిన సంగతి తెలిసిందే.