Handwara
-
అనుమతి ఇస్తే ఆర్మీలో చేరతా..
జైపూర్: భారత్ కోసం రక్తం చిందించి భరతమాతకు వీరతిలకం దిద్దిన సైనికుడు కల్నల్ అశుతోష్ శర్మ. ఆదివారం జమ్మూ కశ్మీర్‌లోని హంద్వారాలో భారత సైన్యం నిర్వహించిన ఆపరేషన్‌లో ఇద్దరు ఉగ్రవాదులు హతమవ్వగా, ఉగ్రమూకలు దొంగదెబ్బ తీయడంతో కల్నల్ సహా ఇద్దరు మేజర్ స్థాయి అధికారులు, ఇద్దరు జవాన్లతోపాటు ఒక పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ నేలకొరిగిన విషయం తెలిసిందే. మంగళవారం జైపూర్‌లోని మిలిటరీ స్టేషన్లో కల్నల్ ఆశుతోష్ శర్మ అంత్యక్రియలు సైనిక వందనంతో ముగిశాయి. ఈ సందర్భంగా కల్నల్ భార్య పల్లవి శర్మ మాట్లాడుతూ.. తన భర్త పోరాటం గర్వకారణమని, కన్నీళ్లు రాల్చబోమని పేర్కొన్నారు. అంతేకాకుండా తాను సైతం భారతావనిని రక్షించేందుకు పాటుపడతానంటున్నారు. (కల్నల్ సహా ఐదుగురు జవాన్ల వీరమరణం) "నేను ఆర్మీలో చేరాలనుకున్నాను, కానీ అది కుదరలేదు. ఇప్పుడు నా వయస్సు అనుకూలిస్తే, మంత్రిత్వ శాఖ అనుమతి ఇస్తే యూనిఫాం ధరించాలనుకుంటున్నాను" అని పల్లవి శర్మ తన మనసులోని మాటను బయటపెట్టారు. అటు ఆమె పదకొండేళ్ల కూతురు తమన్నా కూడా పెద్దయ్యాక సైన్యంలో చేరాలనుకుంటోందని చెప్పుకొచ్చారు. రెండు రోజులుగా తన కళ్ల ముందు జరుగుతున్నన వాటిని నిశితంగా పరిశీలిస్తున్న కూతురుకు ఇప్పుడిప్పుడే సైన్యంలో చేరాలన్న కోరిక బలపడుతోందన్నారు. ఆమె కోరికకు తాను అడ్డు చెప్పనని స్పష్టం చేశారు. అయితే ముందు తను బాధ్యతాయుత పౌరురాలిగా ఎదగడం ముఖ్యమని ఆమె అభిప్రాయపడ్డారు. (13సార్లు ప్రయత్నించి సైన్యంలో చేరిన ఆయన...) -
వీర సైనికా నీకు వందనం
జైపూర్: ఆరున్నర సంవత్సరాలు కష్టపడి 13 సార్లు ప్రయత్నించి ఆర్మీలో చేరారు ఆయన. దేశం కోసం పోరాడాలి అన్న ఆలోచన తప్ప మరే ఆలోచన లేని ఆయన ఎట్టకేలకు ఎంతో కష్టపడి భారత సైన్యంలో చేరారు. భారత సైన్యం నిర్వహించిన ఎన్నో ఆపరేషన్లలో పాల్గొన్నారు. ఆర్మీలో చేరిన తరువాత వెనుదిరిగి చూసుకోవలసిన అవసరం లేకుండా అంచెలంచెలుగా ఎదిగి కల్నల్‌స్థాయికి చేరారు. ఆయన మరెవరో కాదు ఆదివారం జమ్మూ కశ్మీర్‌లోని హంద్వారా జరిగిన ఉగ్రదాడిలో అమరులైన కల్నల్ ఆశుతోష్ శర్మ. ఆయన మృతదేహాన్నిస్వగ్రామమైన జైపూర్‌కు తీసుకురానున్నారు. సోమవారం సాయంత్రం కల్లా ఆయన శరీరాన్ని జైపూర్‌లో ఉంటున్న ఆయన తల్లిదండ్రులకు అందించనున్నారు. మంగళవారం ఆయన అంత్యక్రియలు సైనికవందనంతో జరగనున్నాయి. (కల్నల్ సహా ఐదుగురు జవాన్ల వీరమరణం) కల్నల్ శర్మ భార్య పల్లవి, కూతురు తమన్నాతో కలిసి ఉంటున్నారు. ఆయన భార్య పల్లవి మాట్లాడుతూ తన భర్త ఒక గొప్ప కారణంతో ప్రాణాలు త్యాగం చేశారని, అశుతోష్‌ని చూసి గర్వపడుతున్నానని తెలిపారు. ఆయనని చూసి ఏడవనని తెలిపారు. చివరిగా కల్నల్‌తో మే 1 న మాట్లాడానని చెప్పారు. ఆయన కూతురు తమన్నా మాట్లాడుతూ ఆపరేషన్ ముగియగానే ఇంటికి తిరిగి వస్తానని చెప్పిన నాన్నకి ఇలా జరిగిందని కన్నీటి పర్యంతం అయ్యింది. అశుతోష్ తల్లి దండ్రులు మాట్లాడుతూ తమ కొడుకుని చూస్తుంటే గర్వంగా ఉందన్నారు. (హంద్వారా అమరులకు మహేష్ నివాళి) ఆయన సోదరుడు పీయూష్ శర్మ మాట్లాడుతూ ‘మా సోదరుడు చాలా ధైర్యవంతుడు, దేశభక్తి కలవాడు. నా సోదరుడి లాగానే నా కొడుకు కూడా ఆర్మీలో జాయిన్ అవ్వాలనుకుంటున్నాడు. ఆయన మా అందరికి ఆదర్శం’ అని తెలిపారు. కల్నల్ అశుతోష్ శర్మ స్వగ్రామం ఉత్తరప్రదేశ్‌లోని బులందర్‌షహర్ కాగా ఆయన అంత్యక్రియలు మాత్రం జైపూర్‌లో జరగనున్నట్లు ఆయన సోదరుడు తెలిపారు. ఆదివారం కశ్మీర్‌లోని హాంద్వారా ప్రాంతంలో భారత సైన్యం నిర్వహించిన ఆపరేషన్‌లో ఇద్దరు ఉగ్రవాదులు హతమవ్వగా, ఉగ్రమూకలు దొంగదెబ్బ తీయడంతో ఒక కల్నల్, ఒక మేయర్, ఇద్దరు జవాన్లతో పాటు జమ్మూకశ్మీర్ పోలీసు ఒకరు మరణించిన సంగతి తెలిసిందే. -
హంద్వారా అమరులకు మహేష్ నివాళి
దేశమంతటా లాక్డౌన్ కొనసాగుతున్న వేళ జమ్మూకశ్మీర్‌లో భీకర ఎన్కౌంటర్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఎదురుకాల్పుల్లో ఒక కల్నల్, ఒక మేజర్ స్థాయి అధికారి, ఇద్దరు జవాన్లతోపాటు పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ ఒకరు నేలకొరిగారు. పౌరుల ప్రాణాలు కాపాడి వీరమరణం పొందిన జవాన్ల కుటుంబానికి పలువురు ప్రముఖులు నివాళుర్పిస్తున్నారు. తాజాగా ప్రముఖ హీరో మహేష్ బాబు సోషల్ మీడియా వేదికగా నివాళులర్పించారు. (చదవండి : కల్నల్ సహా ఐదుగురు జవాన్ల వీరమరణం) ‘హంద్వారా దాడి.. మన దేశాన్ని దిగ్బ్రాంతికి గురిచేసింది. దేశాన్ని కాపాడటానికి మన సైనికులకు ఉన్న ధైర్యం, సంకల్పం చాలా ధ్రుడమైనవి. అది ఎప్పటికీ సజీవంగానే ఉంటుంది. విధి నిర్వహణలో మరణించిన సైనికులకుజజ నిల్చుని మౌనం పాటించి నివాళులర్పిస్తున్నాను. ఎదురుకాల్పుల్లో మరణించినవారి కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. ఈ సమయంలో వారికి ధైర్యం, బలం ప్రసాదించాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. జై హింద్’ అని మహేష్ బాబుపేర్కొన్నారు. కాగా, మహేష్ బాబు ఇటీవల నటించిన సరిలేరు నీకెవ్వరు చిత్రంలో ఆర్మీ మేజర్ పాత్రలో కనిపించిన సంగతి తెలిసిందే. -
కల్నల్ సహా ఐదుగురు జవాన్ల వీరమరణం
శ్రీనగర్: దేశమంతటా లాక్డౌన్ అమలవుతున్న వేళ..కశ్మీర్లో సైన్యానికి భారీ నష్టం వాటిల్లింది. ఇక్కడ జరిగిన ఎదురు కాల్పుల్లో కల్నల్, మేజర్ స్థాయి అధికారులు, ఇద్దరు జవాన్లతోపాటు పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ ఒకరు నేలకొరిగారు. శనివారం సాయంత్రం నుంచి ఆదివారం వేకువజాము వరకు కొనసాగిన ఈ కాల్పుల ఘటనలో ఇద్దరు ముష్కరులు కూడా హతమయ్యారు. కశ్మీర్‌లోని కుప్వారా జిల్లా హంద్వారా ప్రాంతంలో శనివారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. చంగీముల్లా గ్రామానికి చెందిన మహిళలు, చిన్నారులు సహా సుమారు 11 మందిని ఉగ్రవాదులు ఓ ఇంట్లో బందీలుగా ఉంచుకున్నట్లు సైన్యానికి సమాచారం అందింది. దీంతో కల్నల్ శర్మ, పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ ఖాజీ నేతృత్వంలో సైన్యం, పోలీసులు సంయుక్త ఆపరేషన్ చేపట్టారు. ఆ ఇంటిని దిగ్బంధించారు. ఈ సందర్భంగా రెండు వర్గాల మధ్య భారీగా ఎదురు కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ క్రమంలోనే జవాన్లు ప్రాణాలకు తెగించి బందీలను, గ్రామస్తులను సురక్షితంగా వెలుపలికి తీసుకువచ్చారు. అనంతరం కల్నల్ శర్మ నేతృత్వంలోని బృందం లోపలికి చొచ్చుకెళ్లింది. కానీ, లోపలే పొంచి ఉన్న ఉగ్రవాదులు విచక్షణారహితంగా కాల్పులు జరపడంతో వారు అక్కడికక్కడే నేలకొరిగారు. వెలుపల వేచి చూస్తున్న బలగాలకు కల్నల్ శర్మ బృందం నుంచి ఎలాంటి స్పందనా రాలేదు. వారికి చేసిన ఫోన్ కాల్స్‌కు ఉగ్రవాదులు సమాధానం ఇవ్వడంతో ప్రమాదాన్ని శంకించారు. ఆ వెంటనే లోపలికి వెళ్లిన పారాట్రూపర్లు ఇద్దరు ఉగ్రవాదులను మట్టికరిపించారు. నేలకొరిగిన కల్నల్ అశుతోష్ శర్మ, మేజర్ అనూజ్ సూద్, నాయక్ రాజేశ్, లాన్స్ నాయక్ దినేశ్‌లు 21 రాష్ట్రీయ రైఫిల్స్‌లోని గార్డ్స్ రెజిమెంట్‌కు చెందిన వారు. వీరితోపాటు లోపలికి వెళ్లిన జమ్మూకశ్మీర్ పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ షకీల్ కాజీ కూడా బలయ్యారు. ఉగ్రహతుల్లో ఒకరిని లష్కరే తోయిబా కమాండర్, పాక్‌కు చెందిన హైదర్ కాగా, గుర్తు తెలియని మరో వ్యక్తి ఉన్నాడు. కాల్పులు జరుగుతుండగా మరో ఇద్దరు లేదా ముగ్గురు ఉగ్రవాదులు అటవీ ప్రాంతంలోకి పరారైనట్లు బలగాలు అనుమానిస్తున్నాయి. వీరంతా పాక్ ఆక్రమిత కశ్మీర్ నుంచి సరిహద్దులు దాటి అక్రమంగా చొరబడే ఉగ్రవాదుల కోసం అక్కడ వేచి ఉన్నట్లు అనుమానిస్తున్నామని సైన్యం తెలిపింది. ఇదే ఉగ్రవాదుల ముఠాతో గురువారం సాయంత్రం కూడా ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయనీ, అనంతరం వీరంతా అటవీ ప్రాంతంలోకి పారిపోయారని తెలిపింది. అప్పటి నుంచి ఇక్కడ గాలింపు కొనసాగిస్తున్నట్లు పేర్కొంది. నేలకొరిగిన జవాన్ల అంత్యక్రియలు సోమవారం వారివారి స్వస్థలాల్లో జరగనున్నాయని పేర్కొంది. కల్నల్ అశుతోష్ శర్మ భౌతిక కాయాన్ని సొంతూరు జైపూర్‌కు, మేజర్ అనూజ్ సూద్ భౌతిక కాయాన్ని పుణేకు అధికారులు తరలించారు. కాగా, కశ్మీర్‌లోయలో కల్నల్ స్థాయి అధికారి ప్రాణాలు కోల్పోవడం 2015 తర్వాత ఇదే ప్రథమం. ఈ ఘటనపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వీరమరణం పొందిన జవాన్ల కుటుంబాలకు ప్రధాని మోదీ ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. భద్రతాబలగాల త్యాగాలు జాతి మరువలేనివని ఆయన ట్విట్టర్లో పేర్కొన్నారు. నాయక్ రాజేశ్, లాన్స్ నాయక్ దినేశ్, సబ్ ఇన్స్పెక్టర్ ఎస్.ఎ.ఖాజీ (ఫైల్ ఫొటోలు, ఎడమ నుంచి కుడికి) -
భీకరపోరు: ఐదుగురు జవాన్ల వీర మరణం
శ్రీనగర్ : జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదుల మరోసారి రక్తపాతం సృష్టించారు. భారత జవాన్లను లక్ష్యంగా చేసుకుని భీకర కాల్పులకు దిగారు. ఆదివారం ఉదయం హంద్వారా సమీపంలో దాదాపు 8 గంటల పాటు జరిగిన ఎన్కౌంటర్లో ఐదురుగు జవాన్లు వీర మరణం పొందారు. వీరిలో సీనియర్ కల్నల్ స్థాయి అధికారితో పాటు ఓ మేజర్ కూడా ఉన్నారు. అయితే ఉగ్రవాదుల కాల్పులను వెంటనే తిప్పి కొట్టిన భద్రతా సిబ్బంది ఎదురు కాల్పులు జరిపి ఇద్దరు ఉగ్రవాదులను హతమార్చారు. కాగా గత 15 రోజులకుగా కశ్మీర్ సెక్టార్లో ఉగ్రవాదులు కాల్పులకు దిగుతున్న విషయం తెలిసిందే. తాజా ఎన్‌కౌంటర్‌తో భద్రతా బలగాలు మరింత అప్రమత్తం అయ్యాయి. -
అలా అయితే అమ్మాయిలు హీరోల్లా చూస్తారని!
న్యూఢిల్లీ: హిజ్బుల్ ముజాహిద్దీన్ ఉగ్రవాది సబ్జార్ భట్ అంత్యక్రియల్లో హల్చల్ చేసిన అనుమానిత ఉగ్రవాది డానిష్ అహ్మద్ పోలీసుల ఎదుట లొంగిపోయాడు. త్రాల్లో జరిగిన సబ్జార్ అంత్యక్రియల ఫొటేజీతో డానిష్ అహ్మద్ వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. విచారణలో భాగంగా పోలీసుల వద్ద డానిష్ అహ్మద్ వెల్లడించిన విషయాలు విస్తుగొల్పుతున్నాయి. హంద్వారాలోని కులంగావ్ ప్రాంతానికి చెందిన డానిష్.. డూన్ పీజీ కాలేజీలో అగ్రికల్చర్ సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగంలో మూడో సంవత్సరం చదువుతున్నాడు. 2016లో హంద్వారా ప్రాంతంలో సైన్యంపై జరిగిన రాళ్లదాడుల్లో అతడు పాల్గొన్నట్లు వెల్లడైంది. ఉగ్రవాదం వైపు మళ్లిన చాలా మంది యువత అసంతృప్తితో ఉన్నారని, అయితే స్థానిక కమాండర్ల నుంచి ప్రాణహాని ఉండటం వల్ల వారు లొంగిపోవడానికి భయపడతారని డానిష్ తెలిపాడు. అలాగే.. ఉగ్రవాదులతో చేతులు కలిపినవారిని లోకల్ అమ్మాయిలు హీరోలుగా చూస్తారన్న భావనతో.. వారితో ఫ్రెండ్షిప్ చేసేందుకు కొంత మంది యువత ఉగ్రవాదం వైపు వెళ్తున్నారని డానిష్ వెల్లడించాడు. స్థానికంగా తగాదాలను పరిష్కరించడంతో పాటు.. ధనవంతుల నుంచి ఉగ్రవాదులు ’ప్రొటెక్షన్ మనీ’ వసూలు చేస్తారని విచారణలో డానిష్ అహ్మద్ తెలిపాడు. -
'పోలీసుల ఒత్తిడి వల్లే అలా మాట్లాడా'
హంద్వారా: వీడియోలో తప్పుడు స్టేట్మెంట్ ఇవ్వాలంటూ దూషిస్తూ, తనపై పోలీసులు ఒత్తిడి చేశారని కశ్మీర్‌లోని హంద్వారాలో ఏప్రిల్‌లో జరిగిన ఆందోళనలకు కేంద్రబిందువైన 16 ఏళ్ల బాలిక సోమవారం వెల్లడించింది. రక్షణా పరమైన చర్యల్లో భాగంగా 27 రోజులు పోలీసుల అదుపులో ఉన్న ఆమెను కోర్టు జోక్యం తర్వాత పోలీసులు విడుదల చేశారు. పోలీసులు ఒత్తిడి చేసి తనను అలా మాట్లాడించారని, దాన్ని వీడియోలో రికార్డు చేసి విడుదల చేశారని ఆమె తెలిపింది. తనకు ఇష్టం లేకుండానే పోలీస్ స్టేషన్లో బంధించి, తెల్లని కాగితాల మీద సంతకాలు కూడా చేపించారని ఆమె తెలిపింది. పోలీసులు బాలికను బెదిరించి తప్పుడు స్టేట్ మెంట్ ఇప్పించారని ఆమె తల్లిదండ్రులు ఆరోపించారు. బాలికను జవాను వేధించాడని పుకార్లు రావడంతో ఏప్రిల్‌లో అల్లర్లు ప్రారంభమయిన విషయం తెలిసిందే. భద్రతా బలగాల కాల్పుల్లో ఐదుగురు మృతిచెందడంతో ఈ ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపింది. అయితే సదరు బాలిక తనపై వేధింపులకు పాల్పడింది జవాను కాదని స్థానికుడే అని వివరణ ఇచ్చిన వీడియోను అధికారులు తర్వాత విడుదల చేశారు. ఆ వీడియోను పోలీసు స్టేషన్లోనే తీయగా, మాట్లాడాలంటూ విజ్ఞప్తి చేస్తున్న ఒక పురుషుని గొంతు వినిపించింది. తదనంతరం జరుగుతున్న పరిణామాలతో పోలీసుల తీరుపై సర్వత్రా విమర్శలు వచ్చాయి. -
జమ్ముకశ్మీర్ లో ఉద్రిక్తత
శ్రీనగర్: జమ్ముకశ్మీర్ లోని హంద్వారాలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. శుక్రవారం ఆందోళన కారులు చేపట్టిన నిరసన హింసాత్మకంగా మారింది. పరిస్థితి అదుపుతప్పడంతో ఆందోళన కారులపై భద్రతా దళాలు కాల్పులు జరిపాయి. కాల్పుల్లో ఒక విద్యార్థి మృతి చెందాడు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. -
మూడు రోజులుగా పోలీస్ స్టేషన్లోనే ఆ బాలిక
శ్రీనగర్: కశ్మీర్‌లోని హంద్వారాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా ఆందోళనలకు కేంద్రబిందువు అయిన బాలికను మూడు రోజులుగా పోలీసులు ఇంటికి పంపించడంలేదు. దీంతో ఆ బాలికను ఇంటికి పంపించాలంటూ పోలీసు స్టేషన్‌కు వెళ్లిన బాలిక తండ్రిని కూడా గురువారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బాలికను జవాను వేధించాడని పుకార్లు రావడంతో మంగళవారం అల్లర్లు ప్రారంభమయిన విషయం తెలిసిందే. అయితే సదరు బాలిక తనపై వేధింపులకు పాల్పడింది జవాను కాదని స్థానికుడే అని వివరణ ఇచ్చిన వీడియోను ఆర్మీ అధికారులు తర్వాత విడుదల చేశారు. ఆ వీడియోను పోలీసు స్టేషన్లోనే తీయగా, మాట్లాడాలంటూ విజ్ఞప్తి చేస్తున్న ఒక పురుషుని గొంతు వినిపించింది. తదనంతరం జరుగుతున్న పరిణామాలతో పోలీసుల తీరుపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. బాలిక, ఆమె తండ్రిని భద్రతా కారణాల దృష్ట్యా వారి కోరిక మేరకే తమ సంరక్షణలో ఉంచామని పోలీసులు తెలిపారు. పోలీసులు బాలిక ఇంట్లోనే రక్షణ కల్పించాలి, కానీ పోలీసు స్టేషన్లో కాదని జమ్ము-కశ్మీర్‌కు చెందిన సమాజిక కార్యకర్త ఖుర్రం పర్వేజ్ అన్నారు. బాలిక సంరక్షకులు పక్కన లేకుండానే వీడియోను చిత్రీకరించడం చట్టవిరుద్ధమని ఖుర్రం పర్వేజ్ తెలిపారు. -
మొబైల్, ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
శ్రీనగర్: భద్రత కారణాల రీత్యా కశ్మీర్లో బుధవారం మొబైల్, ఇంటర్ నెట్ సర్వీసులను నిలిపివేశారు. ఈ సేవలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నామని, సాధారణ పరిస్థితి నెలకొన్న తర్వాత సర్వీసులను పునరుద్దరిస్తామని స్థానిక అధికారులు తెలిపారు. హంద్వారా ఘటనలో అలజడి కొనసాగుతున్న నేపథ్యంలో కశ్మీర్‌లోని కుపార్వా, బారాముల్లా, బందీపూర, గండేర్ బల్ జిల్లాల్లో ఇవాళ మొబైల్ ఇంటర్నెట్ సర్వీసులను నిలిపివేశారు. ఆర్మీ జవాన్ల కాల్పుల్లో నలుగురు మృతి చెందటం ఉద్రిక్తతకు దారి తీసింది. దీంతో సోషల్ మీడియాలో దుష్ర్పచారం, వదంతులు చెలరేగే అవకాశముండటంతో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. కాగా ఉత్తర కశ్మీర్లో గతంలో మిలిటెన్సీ ప్రభావం తీవ్రంగా ఉన్న సమయంలో కశ్మీర్ లోయలో ఇంటర్నెట్ సర్వీసులను నిలిపివేసిన సంగతి తెలిసిందే. -
వేధించింది జవాను కాదు..
శ్రీనగర్: ఉత్తర కశ్మీర్లో భద్రతా బలగాల కాల్పుల్లో ముగ్గురు మృతిచెందిన ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపింది. అయితే ఆందోళనలకు కేంద్రబిందువు అయిన కళాశాల బాలిక వేధింపు ఘటనలో కొత్త ట్విస్ట్ వెలుగు చూసింది. తనపై వేధింపులకు పాల్పడింది జవాను కాదని స్థానిక వ్యక్తే అని విద్యార్థిని తెలిపింది. ఈ మేరకు సదరు బాలిక మాట్లాడిన ఓ వీడియోను ఆర్మీ అధికారులు విడుదల చేశారు. కళాశాల నుంచి ఇంటికి తిరిగి వస్తున్న ఓ విద్యార్థిని పట్ల జవాన్లు అసభ్యంగా ప్రవర్తించారంటూ మంగళవారం పుకార్లు రావడంతోస్థానికులు పెద్ద ఎత్తున గుమిగూడి నిరసనలు తెలిపారు. ఆందోళనకారులు ముందుగా రాళ్లు రువ్వడంతో జవాన్లు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో.. ఘటనా స్థలంలోనే ఒకరు మృతి చెందగా, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరో ఇద్దరు చనిపోయారు. మృతిచెందిన వారిలో హంద్వారా గవర్నమెంట్ కళాశాలకు చెందిన నయీం అనే వర్ధమాన క్రికెటర్ కూడా ఉన్న విషయం తెలిసిందే. -
ముగ్గురు జవాన్లు మృతి.. ఉగ్రవాది కూడా
హంద్వారా: జమ్మూకశ్మీర్ ఎన్కౌంటర్ చోటుచేసుకుని ముగ్గురు జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. ఒక ఉగ్రవాది హతమయ్యాడు. హంద్వారాలో ఆదివారం అర్థరాత్రి ఈ ఎదురుకాల్పులు ప్రారంభమయ్యాయి. తొలుత ఒక ఉగ్రవాదే చినపోయినట్లు వార్తలు వచ్చినా అనంతరం ముగ్గురు ఆర్మీ జవాన్లు కూడా ప్రాణాలు కోల్పోయినట్లు భద్రతాధికారులు ధృవీకరించారు. ఎన్ కౌంటర్ ఇంకా కొనసాగుతోంది. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.