వేధించింది జవాను కాదు..
శ్రీనగర్: ఉత్తర కశ్మీర్లో భద్రతా బలగాల కాల్పుల్లో ముగ్గురు మృతిచెందిన ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపింది. అయితే ఆందోళనలకు కేంద్రబిందువు అయిన కళాశాల బాలిక వేధింపు ఘటనలో కొత్త ట్విస్ట్ వెలుగు చూసింది. తనపై వేధింపులకు పాల్పడింది జవాను కాదని స్థానిక వ్యక్తే అని విద్యార్థిని తెలిపింది. ఈ మేరకు సదరు బాలిక మాట్లాడిన ఓ వీడియోను ఆర్మీ అధికారులు విడుదల చేశారు.
కళాశాల నుంచి ఇంటికి తిరిగి వస్తున్న ఓ విద్యార్థిని పట్ల జవాన్లు అసభ్యంగా ప్రవర్తించారంటూ మంగళవారం పుకార్లు రావడంతోస్థానికులు పెద్ద ఎత్తున గుమిగూడి నిరసనలు తెలిపారు. ఆందోళనకారులు ముందుగా రాళ్లు రువ్వడంతో జవాన్లు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో.. ఘటనా స్థలంలోనే ఒకరు మృతి చెందగా, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరో ఇద్దరు చనిపోయారు. మృతిచెందిన వారిలో హంద్వారా గవర్నమెంట్ కళాశాలకు చెందిన నయీం అనే వర్ధమాన క్రికెటర్ కూడా ఉన్న విషయం తెలిసిందే.