సబ్జార్ భట్ అంత్యక్రియల్లో డానిష్ అహ్మద్
న్యూఢిల్లీ: హిజ్బుల్ ముజాహిద్దీన్ ఉగ్రవాది సబ్జార్ భట్ అంత్యక్రియల్లో హల్‌చల్ చేసిన అనుమానిత ఉగ్రవాది డానిష్ అహ్మద్ పోలీసుల ఎదుట లొంగిపోయాడు. త్రాల్‌లో జరిగిన సబ్జార్ అంత్యక్రియల ఫొటేజీతో డానిష్ అహ్మద్ వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే.
విచారణలో భాగంగా పోలీసుల వద్ద డానిష్ అహ్మద్ వెల్లడించిన విషయాలు విస్తుగొల్పుతున్నాయి. హంద్వారాలోని కులంగావ్ ప్రాంతానికి చెందిన డానిష్.. డూన్ పీజీ కాలేజీలో అగ్రికల్చర్ సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగంలో మూడో సంవత్సరం చదువుతున్నాడు. 2016లో హంద్వారా ప్రాంతంలో సైన్యంపై జరిగిన రాళ్లదాడుల్లో అతడు పాల్గొన్నట్లు వెల్లడైంది. ఉగ్రవాదం వైపు మళ్లిన చాలా మంది యువత అసంతృప్తితో ఉన్నారని, అయితే స్థానిక కమాండర్‌ల నుంచి ప్రాణహాని ఉండటం వల్ల వారు లొంగిపోవడానికి భయపడతారని డానిష్ తెలిపాడు.
అలాగే.. ఉగ్రవాదులతో చేతులు కలిపినవారిని లోకల్ అమ్మాయిలు హీరోలుగా చూస్తారన‍్న భావనతో.. వారితో ఫ్రెండ్‌షిప్ చేసేందుకు కొంత మంది యువత ఉగ్రవాదం వైపు వెళ్తున్నారని డానిష్ వెల్లడించాడు. స్థానికంగా తగాదాలను పరిష‍్కరించడంతో పాటు.. ధనవంతుల నుంచి ఉగ్రవాదులు ’ప్రొటెక్షన్ మనీ’ వసూలు చేస్తారని విచారణలో డానిష్ అహ్మద్ తెలిపాడు.