నాడు గ్రనేడ్‌తో అరిచి నేడు లొంగిపోయాడు
శ్రీనగర్: నెల రోజుల కిందట చేతిలో గ్రనేడ్ పట్టుకొని ప్రభుత్వ, సైనిక వ్యతిరేక నినాదాలు చేసిన దానిష్ అహ్మద్ అనే కశ్మీర్ యువకుడిని పోలీసులు అరెస్టు చేశారు. గత కొద్ది రోజులుగా తప్పించుకొని తిరుగుతున్న అతడికి ఎలాంటి హానీ చేయబోమని తల్లిదండ్రులకు మాట ఇవ్వడంతో బుధవారం ఉదయం లొంగిపోగా అతడిని పోలీసులు అరెస్టు చేశారు.
‘కొద్ది రోజుల కిందట ఓ వీడియో క్లిప్‌లో గుర్తు తెలియని ఓ ఉగ్రవాది చేతిలో గ్రనేడ్ పట్టుకొని నినాదాలు చేస్తూ కనిపించాడు. ఆ వీడియో క్లిప్ ట్రాల్ ప్రాంతంలో హిజ్బుల్ ముజాహిదీన్ టెర్రిరిస్టు కమాండర్ జబ్జార్ భట్ అంతిమయాత్ర కార్యక్రమం జరుగుతున్న సమయంలో ఓ స్థానిక మీడియా ప్రతినిధి రికార్డు చేశాడు. తర్వాత ఆ వీడియోను పరిశీలించగా అందులో ఉగ్రవాదిగా కనిపించిన ఆ వ్యక్తి ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్ ప్రాంతంలోగల డూన్ పీజీ కాలేజీలో అగ్రికల్చర్ సైన్స్ అండ్ టెక్నాలజీలో చదువుతున్న దానిష్ అహ్మద్ అని గుర్తించాం. అనంతరం అతడి తల్లిదండ్రులను సంప్రదించి వివరాలు తెలుసుకోగా వారు తమ నుంచి హామీ తీసుకున్నారు. ఈ నేపథ్యంలోనే అతడు బుధవారం కశ్మీర్‌లోని హంద్వారాలో లొంగిపోయాడు’ అని ఓ పోలీసు అధికార ప్రతినిధి చెప్పారు.
దక్షిణ కశ్మీర్‌లోని ఉగ్రవాదులతో తాను సోషల్ మీడియా ద్వారా టచ్‌లో ఉన్నానని దానిష్ చెప్పినట్లు వారు తెలిపారు. గతంలో కూడా అతడిపై రాళ్లు విసిరిన ఘటనలో అరెస్టు చేసినా అతడి కెరీర్‌కు ఎలాంటి ఇబ్బంది రాకూడదనే ఎలాంటి చర్యలు తీసుకోకుండానే వదిలిపెట్టారు.