మొబైల్ ఓపెన్ చేస్తే చాలు.. ఫేస్‌బుక్, వాట్సాప్, యూట్యూబ్ ఇంకా ఎన్నో యాప్స్.. ఎన్నో పనులు.. ప్రతిదానికీ డేటా అవసరమే. డబ్బులు చెల్లించి డేటాను రీచార్జి చేసుకోవాల్సిందే. మన దగ్గర కొన్నేళ్లుగా డేటా ధరలు బాగా తగ్గిపోయాయిగానీ.. ప్రపంచవ్యాప్తంగా ఇంకా రేట్లు చుక్కలను తాకుతూనే ఉన్నాయి. మరి ఏ దేశంలో సగటున ఒక్కో గిగాబైట్ (జీబీ) డేటాకు ఎంత ఖర్చవుతుందో తెలుసా? దీనిపై బ్రిటన్‌కు చెందిన కేబుల్ అనే వెబ్‌సైట్ విస్తృతమైన సర్వే చేసి లెక్కలు తేల్చింది. ఆ వివరాలు తెలుసుకుందామా?
230 దేశాల్లో పరిశీలించి.. అమెరికాకు చెందిన గూగుల్, న్యూఅమెరికాస్ ఓపెన్ టెక్నాలజీ ఇనిస్టిట్యూట్‌ల ఉమ్మడి సంస్థ ఎం–ల్యాబ్, ప్రిన్స్‌టన్ యూనివర్సిటీకి చెందిన ప్లానెట్ ల్యాబ్ తదితర సంస్థల సహకారంతో కేబుల్ డాట్ యూకే వెబ్‌సైట్ ప్రతినిధులు ప్రపంచవ్యాప్తంగా మొబైల్ డేటా ప్లాన్లు, ధరలపై సర్వే చేశారు.
230 దేశాల్లో 6000 మొబైల్ డేటా ప్లాన్ల వివరాలను సేకరించి విశ్లేషించారు. ఈ ఏడాది జనవరి, ఫిబ్రవరి నెలల్లో ఆయా దేశాల్లోని ప్రధాన టెలికాం సంస్థల డేటా ప్యాకేజీలను పరిగణనలోకి తీసుకున్నారు. ఇందులో గుర్తించిన వివరాలతో తాజాగా ఒక నివేదికను విడుదల చేశారు.
►ప్రపంచవ్యాప్తంగా అమెరికా, ఆఫ్రికా ఖండాల పరిధిలోని దీవుల్లో డేటా ధరలు ఎక్కువగా ఉన్నాయి.
►టెలికాం కంపెనీల మధ్య విపరీతమైన పోటీ ఉన్న దేశాల్లో ధరలు తక్కువగా ఉన్నట్టు సర్వే గుర్తించింది.
►ప్రపంచ సగటు డేటా ధరల కంటే అగ్రరాజ్యమైన అమెరికా, దాని పరిసర దేశాల్లో డేటా ధరలు ఎక్కువగా ఉండటం గమనార్హం. అమెరికా (154వ ర్యాంకు), జపాన్ (156వ ర్యాంకు) తదితర దేశాల్లో సగటున ఒక జీబీ రేటు రూ.250కిపైనే ఉంది.
►యూరప్ దేశాల్లో ఫ్రాన్స్ మినహా మిగతా దేశాల్లో డేటా ధరలు చాలా ఎక్కువ.
►పొరుగున ఉన్న చైనా, పాకిస్తాన్, నేపాల్, శ్రీలంక, బంగ్లాదేశ్ దేశాల్లో ఇండియా కంటే తక్కువ ధరలకు మొబైల్ డేటా అందుబాటులో ఉందని సర్వే పేర్కొంది.
►ఇప్పటికీ 2జీ, 3జీ మొబైల్ నెట్‌వర్క్‌లను వినియోగిస్తున్న దేశాల్లో.. తక్కువ మొత్తంలో డేటాకు ఎక్కువగా చార్జి చేస్తున్నారు. దీనితో మొత్తంగా ఒక్కో జీబీ డేటాకు రేటు వేల రూపాయల్లోకి వెళుతోంది.
Comments
Please login to add a commentAdd a comment