
ఇంటర్నెట్ యూజర్లు@ 35 కోట్లు
న్యూఢిల్లీ : భారత్‌లో ఇంటర్నెట్ వినియోగదారుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. ఇది జూన్ నెల చివరకు 35.2 కోట్లుగా ఉంది. ఈ ఏడాది తొలి ఆరు మాసాల్లో ఇంటర్నెట్ వినియోగదారుల సంఖ్య కొత్తగా 5.2 కోట్లు పెరిగినట్లు ఇంటర్నెట్ అండ్ మొబైల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఐఏఎంఏఐ) పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా మొబైల్ హ్యాండ్‌సెట్స్ ద్వారా ఇంటర్నెట్‌ను వినియోగిస్తున్న వారు 21.3 కోట్లుగా ఉన్నారు. గతేడాది అక్టోబర్‌లో 27.8 కోట్లుగా ఉన్న ఇంటర్నెట్ వినియోగదారుల సంఖ్య ఈ ఏడాది జూన్ చివరకు 26 శాతం వృద్ధితో 35.2 కోట్లకు చేరింది.
ఇదే సమయంలో మొబైల్ ఇంటర్నెట్ వినియోగదారుల సంఖ్యలో 40 శాతం వృద్ధి నమోదైంది. దేశంలో ఇంటర్నెట్ వినియోగదారుల సంఖ్య కోటి నుంచి 10 కోట్లకు చేరడానికి దశాబ్ద కాలం.. 10 కోట్ల నుంచి 20 కోట్లకు రావడానికి మూడే ళ్ల సమయం.. 20 కోట్ల నుంచి 30 కోట్లకు పెరగడానికి ఏడాది కాలం పట్టింది.