ఇన్నాళ్లు ఒకెత్తు.. ఇప్పుడు ఎన్నికల పైఎత్తు!! గ్రామీణ రంగస్థలంపై ప్రేక్షకుడిని ఆకట్టుకోవడమే లక్ష్యంగా మోదీ సర్కారు ఈ సారి బడ్జెట్‌పై పెద్ద కసరత్తే చేసింది. ఇటీవలి రాష్ట్రాల ఎన్నికల్లో తగిలిన ఎదురుదెబ్బలను దృష్టిలో ఉంచుకొని పల్లెల్లో ఓటర్‌ను ఆకర్షించేవిధంగా ‘ఫ్లాగ్‌షిప్’ ప్రణాళికను ప్రకటించారు. పేరుకు మధ్యంతర బడ్జెటైనా, పూర్తిస్థాయి బడ్జెట్‌ను తలపింపజేశారు. ఉపాధిహామీకి మరింత ధీమా, మారుమూల పల్లెల్లో కూడా అందరికీ విద్యుత్ సౌకర్యం, గ్రామీణ రోడ్లకు మెరుగులు దిద్దేందుకు నిధులను కుమ్మరించారు. మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట వేశారు. గ్రామపంచాయతీలకు డిజిటల్ సొబగులు, ప్రతిఒక్కరికి గృహవసతి కల్పన లాంటి తాయిలాలు ప్రకటించారు. ప్రధాని మోదీ ప్రత్యేక శ్రద్ధతో కొనసాగుతున్న స్వచ్ఛ భారత్ లక్ష్యానికి ఆమడదూరంలో భారత్ నిలిచింది.
ఉపాధి హామీకి మరింత ఊతం
- మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి ఈ దఫా బడ్జెట్లో రూ. 60వేల కోట్లు కేటాయింపు.
- గతేడాది కన్నా ఈ మొత్తం రూ. 5వేల కోట్లు లేదా 11 శాతం అధికం.
- అవసరమైతే ఈ కేటాయింపులు మరింత పెంచుతారు.
- దేశంలో ఏ ఒక్కరూ ఆకలితో ఉండకుండా ఉండేందుకు, అర్బన్– రూరల్ విభజనను తగ్గించేందుకు కృషి.
- 2005లో ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు.
- ఏడాదిలో వందరోజుల పాటు కనీస ఉపాధి హామీని ఇవ్వడమే ఈ పథకం ప్రధానోద్దేశం.
దీన్‌దయాళ్ ఉపాధ్యాయ గ్రామ్‌జ్యోతి యోజన
- 2017లో ఆరంభించిన సౌభాగ్య పథకం కింద ఇప్పటిదాకా 2,48,19,168 కుటుంబాలకు విద్యుత్ కనెక్షన్ ఏర్పాటు చేశారు. మొత్తం లక్ష్యం 2.5 కోట్ల కుటుంబాలు.
- ఇంటిగ్రేటెడ్ పవర్ డెవలప్‌మెంట్ స్కీమ్‌కు కేటాయింపులు రూ. 3970 కోట్ల నుంచి రూ. 5280 కోట్లకు పెంచారు.
- దీనికోసం ఇప్పటివరకూ రూ. 16320 కోట్ల వెచ్చింపు.
- పేద, మధ్యతరహా కుటుంబాలకు 143 కోట్ల ఎల్‌ఈడీ బల్బుల అందజేత.
- ఎల్‌ఈడీ బల్బులతో రూ.50వేల కోట్ల విద్యుత్ బిల్లుల ఆదా.
మూడు రెట్లు పెరిగిన గ్రామీణ రోడ్ల నిర్మాణం
- 2022కు బదులు 2019 మార్చికే అన్ని ఆవాసాలకు రహదారులు
- ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన కింద గ్రామాల్లో రోడ్ల నిర్మాణాలు 3 రెట్లు పెరిగాయి.
- మొత్తం 17.84 లక్షల ఆవాసాల్లో 15.8 లక్షల ఆవాసాలకు పక్కా రోడ్లు వచ్చాయి. ఫేజ్–3 కింద ఆవాసాలను ఆస్పత్రులు, పాఠశాలలు, మార్కెట్లతో కలిపేందుకు లింక్ రోడ్ల నిర్మాణాలు.
- హైవేల నిర్మాణంలో ప్రపంచంలోనే ముందంజ. రోజుకు 27 కి.మీ. హైవేల నిర్మాణం
స్వచ్ఛ భారత్ సాకారం...
- 2014–15 నుంచి ఇప్పటివరకు దాదాపు 9 కోట్ల మరుగుదొడ్ల నిర్మాణం పూర్తి. బహిరంగ మలవిసర్జన అలవాటు దాదాపు కనుమరుగైంది.
- ఓడీఎఫ్(బహిరంగ మలవిసర్జన రహిత) గ్రామాల సంఖ్య 5.45 లక్షలకు చేరింది.
- గ్రామీణ ప్రాంతాల్లో దాదాపు 98 శాతం శానిటేషన్ కవరేజ్ కల్పన.
గ్రామీణ టెలిఫోనీ
- భారత్ నెట్ ఫేజ్1 కింద 1, 21, 652 గ్రామ పంచాయతీలకు హైస్పీడ్ ఆప్టికల్ ఫైబర్ నెట్‌వర్క్ కనెక్టివిటీ పూర్తి.
- 1.16లక్షల పంచాయతీల్లో సర్వీసులు అందుబాటులోకి వచ్చాయి.
- దీంతో 2.5 లక్షల గ్రామాల్లోని దాదాపు 20 కోట్ల మంది గ్రామీణవాసులకు బ్రాడ్‌బ్యాంక్ యాక్సెస్ లభించింది.
- 39, 359 పంచాయతీల్లో వైఫై హాట్‌స్పాట్స్ ఇన్‌స్టలేషన్ పూర్తి.
- ఐదు కోట్లమంది గ్రామీణులకు లబ్ది చేకూరేలా 5 లక్షల వైఫై స్పాట్స్ ఏర్పాటు లక్ష్యం.
జాతీయ గ్రామీణ తాగునీటి పథకం
- ఈ ‘భారత్ నిర్మాణ్’ పథకానికి నిధులు జోరుగానే అందుతున్నాయి.
- దేశంలో తాగునీటి సౌకర్యం లేని(అన్‌కవర్డ్) అన్ని మారుమూల గ్రామీణప్రాంతాలకూ సురక్షితమైన, తగినంత తాగునీటిని అందించాలనేది ఈ పథకం ప్రధానోద్దేశం.
- దీన్ని ఇప్పుడు విజన్ 2030లో భాగంగా చేర్చారు.
- నాలుగేళ్లలో 28,000 ఆర్సినిక్, ఫ్లోరైడ్ ప్రభావిత ప్రాంతాలకు సురక్షితమైన తాగునీటిని అందించాలనేది కూడా ఈ పథకంలో భాగంగా మోదీ సర్కారు లక్ష్యంగా పెట్టుకుంది.
ప్రధాన మంత్రి ఆవాస్ యోజన
- 2019–20 కేటాయింపులు 25,853కోట్లు
- 2018–19 సవరించినది 26,405 కోట్లు
- ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇప్పటి వరకు 1.53 కోట్ల ఇళ్ల నిర్మాణం(గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాలు కలిపి)
- నేషనల్ హౌసింగ్ బ్యాంక్‌లో రూ. 10వేల కోట్ల కార్పస్‌తో కొత్తగా హౌసింగ్ ఫండ్(ఏహెచ్‌ఎఫ్) ఏర్పాటు.
- ఇళ్ల నిర్మాణాలు ఇందిరా ఆవాస్ యోజన కన్నా ఈ పథకం కింద ఐదు రెట్లు అధికం. 2022 నాటికి అందరికీ గృహవసతి లక్ష్యం.
ఊరటనిచ్చేదే!
‘బడ్జెట్ ప్రజలకు కొంత ఊరట కలిగించేదే. ముఖ్యంగా ఆదాయపు పన్ను పరిమితిని రూ.5 లక్షలకు పెంచడం మధ్యతరగతి వర్గాలకు మేలు చేస్తుంది. తెలంగాణ ప్రభుత్వం రైతుల కోసం ప్రవేశపెట్టిన తరహాలో కేంద్ర స్థాయిలో నగదు బదిలీని పెట్టడం హర్షించదగిన పరిణామం’
–డాక్టర్ చిట్టెడి కృష్ణారెడ్డి, ఆర్థిక శాస్త్ర ప్రొఫెసర్, యూనివర్శిటీ ఆఫ్ హైదరాబాద్.
ఊరికి మరిన్ని మెరుపులు...
పదిహేనేళ్లుగా నిరాటంకంగా కొనసాగుతున్న ఉపాధి హామీకి నిధుల హామీ దొరికింది. మునుపటికన్నా మరీ ఎక్కువ కాకున్నా... ఒక మోస్తరుగా కేటాయింపులు పెరిగాయి. ఇక గ్రామ్‌జ్యోతి యోజనంటూ ఏటా విద్యుత్ కనెక్షన్లిచ్చిన కుటుంబాల సంఖ్య పెరుగుతున్నందుకు ఆనందించాలో... అసలింకా కరెంటుకు నోచుకోని ఇళ్లున్న దౌర్భాగ్యానికి సిగ్గుపడాలో తెలియని పరిస్థితి. గ్రామీణ రోడ్ల నిర్మాణం మాత్రం జోరుగానే సాగుతోంది. స్వచ్ఛ భారత్ ఆశయంలో ఉన్నంత ఉదాత్తత ఆచరణలో ఇంకా కనిపించాల్సి ఉందన్నది కాదనలేని నిజం. కాకపోతే దీనికి ప్రభుత్వం కన్నా ప్రజలే ఎక్కువ చేయాల్సిందన్నది వాస్తవం.
ఏడాదిలో కనీస ఉపాధి రోజులు: 100
Comments
Please login to add a commentAdd a comment