churchgate station
-
‘చర్చిగేట్ బాంబు బెదిరింపు’ నిందితుడి పట్టివేత
సాక్షి, ముంబై: నగరంలో రద్దీ రైల్వే స్టేషన్లలో ఒకటైన చర్చిగేట్‌ను బాంబులతో పేలుస్తామని బెదిరింపు ఫోన్ చేసిన ఆగంతకున్ని రైల్వే పోలీసులు అరెస్టు చేశారు. నిందితున్ని బాబు ఖేంచంద్ చౌహాన్ (55)గా గుర్తించారు. రైల్వే పోలీసుల కథనం ప్రకారం..ఈ నెల 13వ తేదీన ఉదయం 10.44 నిమిషాలకు గుర్తు తెలియని వ్యక్తి నుంచి రైల్వే హెల్ప్ లైన్ 182 నంబరు ఫోన్ వచ్చింది. చర్చిగేట్ రైల్వే స్టేషన్‌ను బాంబులతో పేల్చివేస్తామని చెప్పడంతో వెంటనే రైల్వే పోలీసులు అప్రమత్తమయ్యారు. రంగంలోకి దిగిన పోలీసులు జాగీలాలతో, బాంబు స్కాడ్‌తో చర్చిగేట్‌లో ఉన్న ప్లాట్‌ఫారాలు, టికెట్ బుకింగ్ కౌంటర్లు, కార్యాలయాలు, పరిసరాలు అణవణువు గాలించారు. కానీ ఎక్కడ బాంబు దొరక్కపోవడంతో ఫేక్ కాల్‌గా భావించిన పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. కానీ గాలింపు పూర్తయిన తరువాత గుర్తు తెలియని వ్యక్తికి వ్యతిరేకంగా పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ బెదిరింపు ఫోన్ ఎక్కడి నుంచి వచ్చిందో ఆరా తీయడం ప్రారంభించారు. ఆ ఫోన్ మాహింలోని ఓ పబ్లిక్ టెలిఫోన్ బూత్ నుంచి వచ్చినట్లు గుర్తించారు. ఈ నెల 13వ తేదీన ఉదయం 10.44 గంటలకు పబ్లిక్ టెలిఫోన్ బూత్ నుంచి ఎవరెవరు ఫోన్ చేశారో సీసీ టీవీ కెమరాల ఫుటేజ్‌లను పరిశీలించారు. అందులో బాబు చౌహాన్ ఒక్కడే ఆ సమయంలో ఫోన్ చేసినట్లు గుర్తించారు. ఎట్టకేలకు 20 రోజుల తరువాత అతన్ని వలపన్ని పట్టుకుని పోలీసులు తమదైన శైలిలో విచారించగా ఆ రోజు ఫోన్ చేసిన విషయాన్ని అంగీకరించాడు. ఆహ్మదాబాద్‌కు చెందిన బాబు కూలి పని కోసం కొద్ది నెలల కిందట ముంబై వచ్చాడు. దొరికిన పనిచేసుకుంటూ పుట్‌పాత్‌పై నిద్రపోయేవాడని పోలీసులు తెలిపారు. నిందితున్ని కోర్టులో హాజరు పర్చగా జ్యుడిషియల్ కస్టడీ విధించింది. -
సీఎస్టీకి ‘హెరిటేజ్’ హంగులు
సాక్షి, ముంబై: చారిత్రాత్మక కట్టడాల (హెరిటేజ్) జాబితాలోకి వస్తున్న ప్రముఖ ఛత్రపతి శివాజీ టెర్మినస్ (సీఎస్టీ), చర్చిగేట్ స్టేషన్లతోపాటు మరో కీలకమైన స్టేషన్ రూపురేఖలను నగర పాలక సంస్థ (బీఎంసీ) మార్చివేయనుంది. ఈ మేరకు ఒక్కో కట్టడం కోసం బీఎంసీ రూ.200 కోట్ల చొప్పన ఖర్చు చేయనుంది. ‘హెరిటేజ్ హోదాలోకి వస్తున్న సీఎస్టీ, చర్చిగేట్ స్టేషన్ల పరిస్థితి రోజురోజుకు దయనీయంగా మారుతోంది. ఈ రెండు స్టేషన్ల వద్ద ప్రయాణికులు రాకపోకలు సాగించేందుకు నిర్మించిన భూగర్భ మార్గం (సబ్ వే) లో విద్యుద్దీపాలు సరిగా వెలగడం లేదు. వీటి పరిస్థితి కూడా అధ్వానంగా తయారైంది. వీటన్నింటికి మరమ్మతులు చేపట్టాల’ని నిర్ణయం తీసుకున్నట్లు బీఎంసీ అదనపు కమిషనర్ ఎస్.వి.ఆర్.శ్రీనివాస్ చెప్పారు. కుర్లా స్టేషన్ రూపురేఖలు మార్చే అంశాన్ని కూడా పరిశీలిస్తున్నామని ఆయన అన్నారు. అధ్యయనం పనులు చేపట్టి తుది నిర్ణయం తీసుకుంటామన్నారు. ఈ పనులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఎలాంటి ఆర్థిక సాయం కోరడం లేదని శ్రీనివాస్ స్పష్టం చేశారు. పనులు ప్రారంభించే ముందు ప్రత్యేకంగా ఒక సలహాదారుల కమిటీ నియమిస్తామని పేర్కొన్నారు. నగరంలో అతి పురాతన, నిత్యం రద్దీగా ఉండే స్టేషన్లలో సీఎస్టీ, చర్చిగేట్ స్టేషన్లు మొదటి క్రమంలో ఉన్నాయి. ఆ తర్వాత దాదర్, పరేల్, కుర్లా, బాంద్రా, అంధేరి, ఎల్ఫిన్స్టన్ రోడ్ తదితర స్టేషన్లు వస్తాయి. కాని ఈ స్టేషన్లకు హెరిటేజ్ హోదా లేకపోవడంతో రూపురేఖలు మార్చడానికి బీఎంసీ అంతగా ప్రాధాన్యత ఇవ్వడం లేదని తెలుస్తోంది.