భారతదేశంలోని రద్దీగల రైల్వేస్టేషన్లలో ఇది ఒకటి. దీనిని ఇప్పుడు ఛత్రపతి శివాజీ టెర్మినస్ అంటున్నారు. వాడుకలో ‘సి.ఎస్.టీ’ లేదా ‘బాంబే వీ.టీ’. ప్రధానంగా సెంట్రల్ రైల్వేకు సేవలు అందిస్తోంది. ‘ముంబై సబర్బన్ రైల్వే’ కేంద్రంగా కూడా వినియోగంలో ఉంది. 1878లో కన్సల్టింగ్ ఆర్కిటెక్ట్ ‘ఫ్రెడరిక్ విలియం స్టీవ్స్ ఈ స్టేషన్ డిజైన్‌ను రూపొందించి, 16.14 లక్షల రూపాయల వ్యయంతో 1888 కల్లా ఈ నిర్మాణాన్ని పూర్తి చేశారు. ఏడాది ముందే 1887 జూన్ 20 న టెర్మినస్ ప్రారంభం అయింది.
విక్టోరియా రాణి గౌరవార్థం ‘విక్టోరియా టెర్మినస్‘ అని పేరు పెట్టారు. 1996లో శివసేన డిమాండ్ మేరకు ప్రభుత్వం ‘ఛత్రపతి శివాజీ టెర్మినస్’గా పేరు మార్చింది. 2004 జూలై 2 న యునెస్కో ఈ స్టేషన్‌ను ప్రపంచ వారసత్వ నిర్మాణాల జాబితాలో చేర్చింది. ఈ నిర్మాణం ‘విక్టోరియన్ గోథిక్’ లేదా ‘వెనీషియన్ గోథిక్’ శైలిలో ఉంటుంది. ప్రపంచంలోని 19 వ శతాబ్దపు నిర్మాణాలకు విక్టోరియా టెర్మినస్‌ను ఆదర్శంగా చూపుతుంటారు. (ఫొటో : 1910 లో విక్టోరియా టెర్మినస్)
Comments
Please login to add a commentAdd a comment