సాక్షి, ముంబై: లోకల్ రైలు టికెట్ కౌంటర్ల వద్ద పొడుగాటి క్యూల నుంచి ప్రయాణికులకు త్వరలో ఉపశమనం లభించనుంది. అందుకు సెంట్రల్ రైల్వే పరిపాలన విభాగం ‘క్యాష్ అండ్ కాయిన్ అపరేటెడ్- ఆటోమేటిక్ టికెట్ వెండింగ్ మెషిన్’ (సీసీవో-ఏటీవీఎం)కొత్త యంత్రాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రస్తుతం ఈ యంత్రాన్ని ఛత్రపతి శివాజీ టర్మినస్ (సీఎస్టీ) స్టేషన్‌లో ప్రయోగాత్మకంగా ఏర్పాటుచేశారు. ప్రయాణికుల నుంచి విశేష స్పందన రావడంతో లోకల్ రైల్వేస్టేషన్ల పరిధిలో ఇలాంటి 117 యంత్రాలను ఏర్పాటు చేయాలని సెంట్రల్ రైల్వే సంకల్పించింది.
ఈ యంత్రంలో టికెటుకు సరిపడ నోట్లు, చిల్లర నాణేలు వేస్తే చాలు టికెటు జారీ అవుతుంది. అదేవిధంగా ఈ యంత్రం స్మార్ట్ కార్డు ద్వారా టికెట్ కొనుగోలు చేయడం, ఇదే స్మార్ట్ కార్డులో డబ్బులు బ్యాలెన్స్ చేసుకోవడం లాంటి పనులు కూడా చేస్తుంది. టికెట్ బుకింగ్ కౌంటర్ల వద్ద పొడుగాటి క్యూలను తగ్గించేందుకు రైల్వే అనేక ప్రయత్నాలు చేసింది. అందులో భాగంగా ప్రస్తుతం అన్ని లోకల్ రైల్వే స్టేషన్లలో కూపన్ వెలిడేటింగ్ మెషిన్ (సీవీఎం), ఆటోమేటిక్ టికెట్ వెండింగ్ మెషిన్ (ఏటీవీఎం) యంత్రాలు అందుబాటులో ఉన్నాయి. త్వరలో సీవీఎం యంత్రాలను తొలగించాలనే ప్రయత్నంలో ఉంది. దీని స్థానంలో ఆధునిక కొత్త యంత్రాన్ని అందుబాటులోకి తేవాలని నిర్ణయించింది. యంత్రంపై సూచించిన ప్రకారం ఆపరేట్ చేయాలి.
తర్వాత టికెటుకు సరిపడా డబ్బులు అందులో వేస్తే చాలు టికెటు బయటకు వచ్చేస్తుంది. దీనివల్ల చిల్లర నాణేల విషయంపై టికెట్ కౌంటర్ల వద్ద క్లర్క్‌లతో జరిగే గొడవలు తగ్గిపోతాయి. కొత్తగా అందుబాటులోకి వచ్చే ఈ యంత్రాలు సీఎస్టీతోపాటు ముందుగా దాదర్, కల్యాణ్, లోక్‌మాన్య తిలక్ (కుర్లా) టర్మినస్, ఠాణే ఆ తర్వాత భాయ్‌కళ, కుర్లా, ఘాట్కోపర్, డోంబివలి, ములుండ్, వడాల రోడ్, వాషి, మాన్‌ఖుర్ద్, పన్వేల్, బేలాపూర్ తదితర స్టేషన్లలో అమర్చనున్నారు. సీఎస్టీలో ఏర్పాటు చేసిన యంత్రం ఎలా వినియోగించాలో అందరికీ తెలియదు. దీంతో అక్కడ ఒక సిబ్బందిని నియమించినట్లు సెంట్రల్ రైల్వే పీఆర్వో అతుల్ రాణే చెప్పారు.
లోకల్ సేవలో ‘సీసీవో-ఏటీవీఎం’లు
Published Fri, Mar 14 2014 10:22 PM | Last Updated on Sat, Sep 2 2017 4:42 AM
Advertisement