కాదేదీ చోరీకి అనర్హం
విశ్రాంతి గదిలో సామగ్రితో ఉడాయిస్తున్న ప్రయాణికులు
- మహిళా ప్రయాణికులు విశ్రమిస్తున్న చోటే చోరీలు అధికం
- పాలుపోని అధికారులు
- ఇతరుల తప్పులకు తాము బలవుతున్నామంటూ ఆవేదన
సాక్షి, ముంబై: పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు కలిగిన ఛత్రపతి శివాజీ టెర్మినస్ (సీఎస్టీ)లోని విశ్రాంతి గదిలోనూ దొంగతనాలు జోరుగా జరుగుతున్నాయి. ఇందులో ప్రయాణికుల కోసం అందుబాటులో ఉంచిన సామగ్రి తరచూ చోరీకి గురవుతున్నాయి. దీనిని గత ఏడాది ఏప్రిల్‌లో అప్పటి రైల్వే శాఖ మంత్రి పవన్ కుమార్ బన్సల్ ప్రారంభించారు. ఇక్కడ ప్రయాణికుల కోసం తువ్వాళ్లు, సబ్బులను అందుబాటులో ఉంచుతున్నారు. అయితే ఇవి కూడా చోరీకి గురవుతున్నాయి.
ఇందులో 12 గంటల పాటు ఉన్న వారి వద్ద నుంచి రూ.150, 24 గంటల పాటు ఉన్నవారి వద్ద నుంచి రూ.250 వసూలు చేస్తారు. ఇక్కడ 78 పడకలను ప్రయాణికుల కోసం అందుబాటులో ఉంచారు. ఇందులో 58 పడకలు పురుషుల కోసం, మిగతావాటిని మహిళల కోసం ఉంచారు. అయితే గత కొన్ని రోజులుగా ఇందులోని బల్బులు, ఇతర చిన్న చిన్న పరికరాలు చోరీకి గురవుతున్నాయి. విచిత్రమేమిటంటే మహిళల విశ్రాంతి గదిలోనే ఎక్కువ చోరీలు జరుగుతున్నట్టు అధికారులు గుర్తించారు.
చోరీల విషయమై భద్రతా సిబ్బంది అనేక పర్యాయాలు అధికారులకు ఫిర్యాదు చేశారని అధికారులు తెలిపారు. ప్రయాణికులు గది విడిచి వెళుతున్న సమయంలో దుప్పట్లు కూడా తీసుకెళ్తున్నట్లు గమనించిన సిబ్బంది తమ దృష్టికి తీసుకొచ్చినట్లు పేర్కొన్నారు. ఈ గదిని ప్రారంభించిన నాటినుంచి ఇప్పటివరకు సామగ్రి చోరీకి గురవుతూనే ఉందని వారు పేర్కొన్నారు.
ఇందులోకి వచ్చే ప్రతి ప్రయాణికుడి సామగ్రిని తనిఖీ చేయాలంటూ ఇటీవల సంబంధిత అధికారులు సిబ్బందికి సూచించారు. అయితే రోజూ వందల సంఖ్యలో ప్రయాణికులు వస్తుంటారని, అందువల్ల తనిఖీ సాధ్యం కావడం లేదని సిబ్బంది పేర్కొంటున్నారు. ఈ ఏడాది ఇప్పటిదాకా దాదాపు 20 దుప్పట్లు చోరీకి గురైనట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో చేసేదేమీలేక అధికారులు చవకైన సామగ్రిని ప్రయాణికులకు అందుబాటులో ఉంచుతున్నారు. ఎవరో చోరీలకు పాల్పడుతున్నారని, అయితే అందుకు తాము బాధ్యత వహించాల్సి వస్తోందంటూ అధికారులు విచారం వ్యక్తం చేస్తున్నారు.