rest room
-
రెస్ట్ రూంలోనూ సీసీటీవీ కెమెరాలా.. హవ్వా!
నిఘా పేరిట ఉద్యోగుల బాత్రూంలలో కూడా సీసీటీవీ కెమెరాలు బిగించి వారికి స్వేచ్ఛ లేకుండా చేస్తున్నారని ఓ కంపెనీపై మద్రాస్ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. వెంటనే దానిని తొలగించాలని ఆదేశించింది. చెన్నైలోని రాప్టకాస్ బ్రెట్ అండ్ కంపెనీ లిమిటెడ్ కంపెనీ తమ కార్మికుల బాత్ రూంలలో కూడా 2013 అక్టోబర్ 15న సీసీటీవీ కెమెరాలను ఏర్పాటుచేసింది. అయితే వాటిని తొలగించాలని, తమ వ్యక్తిగత స్వేచ్ఛకు భంగకరంగా ఉందని కార్మికులు చెప్పినా వినకపోవడంతో ఆ కంపెనీకి చెందిన కార్మిక యూనియన్ తొలుత కార్మికశాఖ డిప్యూటీ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. సదరు కమిషనర్ ఆదేశించినా వారు వాటిని తొలగించకపోవడంతో యూనియన్ హైకోర్టును ఆశ్రయించింది. దీనిని విచారణకు చేపట్టిన జస్టిస్ సీఎస్ కర్నాన్ ధర్మాసనం ఆ కంపెనీకి మొట్టికాయలు వేసింది. అలాంటి ప్రదేశాలు కార్మికుల ప్రత్యేకమైనవని, నిఘా పేరిట అలా చేయడం మంచి పద్దతి కాదని చెప్పింది. పారిశ్రామిక వివాదాల చట్టం ప్రకారం అలా చేయడం సంస్థ తప్పేనని పేర్కొంది. అలాగే యాజమాన్యం కార్మికులు పరస్పరం సహకారంతో ముందుగా సాగాలని సూచించింది. -
రెస్టు రూమ్‌కెళ్లినా రాజకీయమేనా!
అధికార పక్షానికి ప్రతిపక్ష నేత జగన్ చురకలు మనస్సాక్షిని ప్రశ్నించుకోవాలంటూ హితవు సాక్షి, హైదరాబాద్: ‘శాసనసభలో ఎంత దారుణమైన పరిస్థితి ఉంది. రెస్టు రూమ్‌కు వెళ్లినా రాజకీయం చేస్తారా?’ అని విపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికార పక్షాన్ని నిలదీశారు. రాజధానిపై గురువారం అసెంబ్లీలో సీఎంచంద్రబాబు సుదీర్ఘ ప్రకటన చేసిన తర్వాత, విపక్ష సభ్యుడు రాజేంద్రనాథ్‌రెడ్డి ప్రభుత్వాన్ని తూర్పారబడుతూ మాట్లాడారు. అనంతరం బీజేపీ సభ్యుడు సత్యనారాయణకు స్పీకర్ అవకాశం ఇచ్చారు. ఈ సమయంలో జగన్ లేచి బయటకు వెళ్లారు. వెంటనే మంత్రి యనమల రామకృష్ణుడు జోక్యం చేసుకొని.. ‘ముఖ్యమైన అంశం మీద చర్చ జరుగుతోంది. విపక్ష నేత సభలో లేరు. మళ్లీ వస్తారో లేదో తెలియదు. హడావుడి చేయించి జారుకున్నారు. చర్చించకుండా ఇంటికి జారుకోవడం విపక్ష నేతల లక్షణం కాదు. జగన్ చల్లగా ఇంటికి జారుకున్నారు’ వంటి వ్యాఖ్యలు చేశారు. దీనిపై వైఎస్సార్సీపీ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేయగా.. సత్యనారాయణ తన ప్రసంగాన్ని కొనసాగించారు. నాలుగైదు నిమిషాల తర్వాత జగన్ తిరిగి తన స్థానానికి వచ్చి కూర్చున్నారు. యనమల వ్యాఖ్యలను పార్టీ సభ్యులు ఆయనకు చెప్పారు. స్పందించిన జగన్.. ‘రెస్టురూమ్‌కు వెళ్లినా రాజకీయం చేస్తారా? ఎంత దారుణమైన పరిస్థితి సభలో ఉంది. ఎంత అప్రజాస్వామికం. ముందుగా చర్చించకుండానే ముఖ్యమంత్రి రాజధానిపై సభలో ప్రకటన చేశారు. రెండున్నర గంటలు మాట్లాడారు. అధికార పక్ష సభ్యులు ఏ స్థాయికి దిగజారిపోతున్నారు? మీ మనస్సాక్షిని ప్రశ్నించుకోండి’ అంటూ చురకలు వేశారు. ఇరుకున పడిన యనమల నీళ్లు నములుతూ.. తన వ్యాఖ్యలకు స్పందించి విపక్ష నేత వెనక్కి వచ్చినందుకు ధన్యవాదాలంటూ కవర్ చేసే ప్రయత్నం చేశారు. -
కాదేదీ చోరీకి అనర్హం
విశ్రాంతి గదిలో సామగ్రితో ఉడాయిస్తున్న ప్రయాణికులు - మహిళా ప్రయాణికులు విశ్రమిస్తున్న చోటే చోరీలు అధికం - పాలుపోని అధికారులు - ఇతరుల తప్పులకు తాము బలవుతున్నామంటూ ఆవేదన సాక్షి, ముంబై: పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు కలిగిన ఛత్రపతి శివాజీ టెర్మినస్ (సీఎస్టీ)లోని విశ్రాంతి గదిలోనూ దొంగతనాలు జోరుగా జరుగుతున్నాయి. ఇందులో ప్రయాణికుల కోసం అందుబాటులో ఉంచిన సామగ్రి తరచూ చోరీకి గురవుతున్నాయి. దీనిని గత ఏడాది ఏప్రిల్‌లో అప్పటి రైల్వే శాఖ మంత్రి పవన్ కుమార్ బన్సల్ ప్రారంభించారు. ఇక్కడ ప్రయాణికుల కోసం తువ్వాళ్లు, సబ్బులను అందుబాటులో ఉంచుతున్నారు. అయితే ఇవి కూడా చోరీకి గురవుతున్నాయి. ఇందులో 12 గంటల పాటు ఉన్న వారి వద్ద నుంచి రూ.150, 24 గంటల పాటు ఉన్నవారి వద్ద నుంచి రూ.250 వసూలు చేస్తారు. ఇక్కడ 78 పడకలను ప్రయాణికుల కోసం అందుబాటులో ఉంచారు. ఇందులో 58 పడకలు పురుషుల కోసం, మిగతావాటిని మహిళల కోసం ఉంచారు. అయితే గత కొన్ని రోజులుగా ఇందులోని బల్బులు, ఇతర చిన్న చిన్న పరికరాలు చోరీకి గురవుతున్నాయి. విచిత్రమేమిటంటే మహిళల విశ్రాంతి గదిలోనే ఎక్కువ చోరీలు జరుగుతున్నట్టు అధికారులు గుర్తించారు. చోరీల విషయమై భద్రతా సిబ్బంది అనేక పర్యాయాలు అధికారులకు ఫిర్యాదు చేశారని అధికారులు తెలిపారు. ప్రయాణికులు గది విడిచి వెళుతున్న సమయంలో దుప్పట్లు కూడా తీసుకెళ్తున్నట్లు గమనించిన సిబ్బంది తమ దృష్టికి తీసుకొచ్చినట్లు పేర్కొన్నారు. ఈ గదిని ప్రారంభించిన నాటినుంచి ఇప్పటివరకు సామగ్రి చోరీకి గురవుతూనే ఉందని వారు పేర్కొన్నారు. ఇందులోకి వచ్చే ప్రతి ప్రయాణికుడి సామగ్రిని తనిఖీ చేయాలంటూ ఇటీవల సంబంధిత అధికారులు సిబ్బందికి సూచించారు. అయితే రోజూ వందల సంఖ్యలో ప్రయాణికులు వస్తుంటారని, అందువల్ల తనిఖీ సాధ్యం కావడం లేదని సిబ్బంది పేర్కొంటున్నారు. ఈ ఏడాది ఇప్పటిదాకా దాదాపు 20 దుప్పట్లు చోరీకి గురైనట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో చేసేదేమీలేక అధికారులు చవకైన సామగ్రిని ప్రయాణికులకు అందుబాటులో ఉంచుతున్నారు. ఎవరో చోరీలకు పాల్పడుతున్నారని, అయితే అందుకు తాము బాధ్యత వహించాల్సి వస్తోందంటూ అధికారులు విచారం వ్యక్తం చేస్తున్నారు.