నిఘా పేరిట ఉద్యోగుల బాత్రూంలలో కూడా సీసీటీవీ కెమెరాలు బిగించి వారికి స్వేచ్ఛ లేకుండా చేస్తున్నారని ఓ కంపెనీపై మద్రాస్ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. వెంటనే దానిని తొలగించాలని ఆదేశించింది. చెన్నైలోని రాప్టకాస్ బ్రెట్ అండ్ కంపెనీ లిమిటెడ్ కంపెనీ తమ కార్మికుల బాత్ రూంలలో కూడా 2013 అక్టోబర్ 15న సీసీటీవీ కెమెరాలను ఏర్పాటుచేసింది. అయితే వాటిని తొలగించాలని, తమ వ్యక్తిగత స్వేచ్ఛకు భంగకరంగా ఉందని కార్మికులు చెప్పినా వినకపోవడంతో ఆ కంపెనీకి చెందిన కార్మిక యూనియన్ తొలుత కార్మికశాఖ డిప్యూటీ కమిషనర్కు ఫిర్యాదు చేశారు.
సదరు కమిషనర్ ఆదేశించినా వారు వాటిని తొలగించకపోవడంతో యూనియన్ హైకోర్టును ఆశ్రయించింది. దీనిని విచారణకు చేపట్టిన జస్టిస్ సీఎస్ కర్నాన్ ధర్మాసనం ఆ కంపెనీకి మొట్టికాయలు వేసింది. అలాంటి ప్రదేశాలు కార్మికుల ప్రత్యేకమైనవని, నిఘా పేరిట అలా చేయడం మంచి పద్దతి కాదని చెప్పింది. పారిశ్రామిక వివాదాల చట్టం ప్రకారం అలా చేయడం సంస్థ తప్పేనని పేర్కొంది. అలాగే యాజమాన్యం కార్మికులు పరస్పరం సహకారంతో ముందుగా సాగాలని సూచించింది.
రెస్ట్ రూంలోనూ సీసీటీవీ కెమెరాలా.. హవ్వా!
Published Thu, Feb 19 2015 8:23 PM | Last Updated on Mon, Oct 8 2018 3:56 PM
Advertisement