సాక్షి, ముంబై: లోకల్ రైల్వే పరిధిలోని స్టేషన్లకు ప్రభుత్వం పంపిణీ చేస్తానన్న అంబులెన్సుల సంఖ్యపై అధికారులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. లోకల్ పరిధిలో 120 స్టేషన్లుండగా కేవలం 46 అంబులెన్సులను పంపిణీ చేయడానికి ప్రభుత్వం సంసిద్ధత వ్యక్తం చేసింది. అయితే ఇవి ఏ మాత్రం చాలవని అధికారులు చెబుతున్నారు.
రైలు ప్రమాదాల్లో గాయపడిన ప్రయాణికులను సత్వరం ఆస్పత్రికి తరలించేందుకు అవసరమైన అంబులెన్స్‌లు సమకూర్చడానికి ప్రభుత్వం సిద్ధమైంది. ప్రభుత్వం ‘ఎమర్జెన్సీ మెడికల్ సర్వీస్’ (ఈఎంఎస్) పథకం కింద రాష్ట్ర వ్యాప్తంగా 937 అంబులెన్స్‌లు అందుబాటులోకి రానున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వం, ఆరోగ్య శాఖ, బాంబే విక్టోరియా గాంధీ సంయుక్తంగా అంబులెన్స్ సేవలు అందించనున్నాయి. ఇందులో సెంట్రల్ రైల్వేలోని ఛత్రపతి శివాజీ టెర్మినస్ (సీఎస్టీ) నుంచి ములుండ్ వరకు 18, పశ్చిమ ైరె ల్వేలోని చర్చిగేట్ నుంచి విరార్ వరకు 28 అంబులెన్స్‌లు అందుబాటులోకి వస్తాయి.
కాని ఠాణే నుంచి కల్యాణ్, కర్జత్, కసార, ఖోపోలి, అదేవిధంగా హార్బర్ మార్గంలో సీఎస్టీ నుంచి పన్వేల్, ట్రాన్స్ హార్బర్ మార్గంలో ఠాణే నుంచి పన్వేల్ వరకు ఒక్క అంబులెన్స్ కూడా ప్రకటించకపోవడంతో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఈ ప్రాంతాల్లో రైలు ప్రమాదాలకు గురైన వారిని ఆస్పత్రికి తరలించే విషయం ప్రశ్నార్థకంగా మారింది. రోజూ ఏదో ఒక స్టేషన్‌లో పట్టాలు దాటుతూ ప్రమాదానికి గురికావడం, నడుస్తున్న రైలు నుంచి కింద పడి, ఓవర్ హెడ్ వైరుకు అంటుకోవడం లేదా ప్లాట్‌ఫారం-రైలు మధ్యలో ఇరుక్కుని తీవ్రంగా గాయపడుతున్న సంఘటనలు ఇక్కడ జరుగుతుంటాయి. రోజూ సరాసరి ఐదుగురు చనిపోవడం, పదుల సంఖ్యలో గాయపడడం లాంటి సంఘటనలు చోటుచేసుకుంటాయి.
ప్రమాదానికి గురైన వారిని సత్వరం ఆస్పత్రికి తీసుకెళ్తే మృతుల సంఖ్య తగ్గే అవకాశం ఉంది. అందుకు స్టేషన్ బయట అంబులెన్స్ అందుబాటులో ఉండాలి. కాని నగరం, శివారు ప్రాంతాల్లోని రెండు, మూడు ప్రధాన స్టేషన్లు మినహా మరే ఇతర స్టేషన్లలో అంబులెన్స్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండటం లేదు. దీంతో రైల్వే పోలీసులు గత్యంతరం లేక ఆటో, ట్యాక్సీ లేదా ప్రైవేటు వాహనాల ద్వారా ప్రమాద బాధితులను ఆస్పత్రులకు తరలిస్తున్నారు.
అయితే ప్రైవేటు వాహనాలను మాట్లాడి తీసుకొచ్చే వరకూ ఏ మాత్రం జాప్యం జరిగిన విలువైన ప్రాణాలు గాలిలో కలిసిపోయే అవకాశం ఉంటుంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతీ స్టేషన్ బయట అంబులెన్స్ అందుబాటులో ఉంచాలని ప్రభుత్వం సంకల్పించింది. కాని లోకల్ రైల్వే పరిధిలో సుమారు 120 స్టేషన్లు ఉన్నాయి. అయితే ప్రభుత్వం మాత్రం కేవలం 46 అంబులెన్స్‌లు మాత్రమే అందజేసేందుకు సిద్ధంగా ఉంది. కాని ఇవి ఏ మూలకు సరిపోతాయని రైల్వే అధికారులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.