సాక్షి, ముంబై: లోకల్ రైళ్ల టికెట్లను మొబైల్ ఫోన్‌లో కొనుగోలు చేసేందుకు మార్గం సుగమమైంది. మే లేదా జూన్ నుంచి దీన్ని అమలుచేసే అవకాశాలున్నాయని రైల్వే అధికార వర్గాలు తెలిపాయి. సెంట్రల్, హార్బర్, పశ్చిమ రైల్వే మార్గాల ద్వారా ప్రతిరోజూ దాదాపు 75 లక్షల మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తారు. ఏ స్టేషన్‌లో చూసినా టికెట్ కౌంటర్ల వద్ద పొడుగాటి క్యూలు ఉంటాయి. అయితే వీటివల్ల ప్రయాణికుల విలువైన సమయం వృథా అవుతోందని భావించిన రైల్వే అధికారులు కూపన్ వేలిడేటింగ్ మెషీన్ (సీవీఎం), ఆటోమేటిక్ టికెట్ వెండింగ్ మెషీన్ (ఏటీవీఎం)లు అందుబాటులో ఉంచారు.
కాని అనేక సందర్భాలలో అవి పనిచేయడంలేదు. దీంతో రైల్వే అధికారులు ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి సారించారు. నేటి ఆధునిక కాలంలో సాధారణంగా మొబైల్ ఫోన్లు అందరి వద్దా ఉంటున్నాయి. త్వరలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి రానుంది. దీంతో ఎలాంటి ఇబ్బందులు లేకుండా దారిలో వెళుతుండగానే తమవద్ద ఉన్న మొబైల్ ఫోన్ ద్వారా లోకల్ రైలు టికెట్లు కొనుగోలు చేయవచ్చు. ఛత్రపతి శివాజీ టెర్మినస్ (సీఎస్టీ)లోని ప్రధాన కార్యాలయంలో జరిగిన సమావేశంలో ప్రయాణికులకు సేవలందించే విషయంపై చర్చ జరిగింది.
అందులో మొబైల్ ఫోన్‌లో టికెట్ల సేవలు ప్రారంభించాలని రైల్వే అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఈ సమావేశంలో ఇరు రైల్వేల జనరల్ మేనేజర్లు హేమంత్ కుమార్, సునీల్‌కుమార్ సూద్, రీజినల్ రైల్వే జనరల్ మేనేజర్లు ముఖేష్ నిగం, శైలేంద్రకుమార్, ప్రజా సంబంధాల అధికారి శరత్ చంద్రాయన్ తదితరులు పాల్గొన్నారు.
మొబైల్‌తో ‘లోకల్’ టికెట్
Published Sat, Feb 1 2014 5:51 AM | Last Updated on Wed, Jul 10 2019 8:02 PM
Advertisement
Advertisement