సాక్షి, బెంగళూరు : రాష్ట్రంలో మత ఘర్షణలు జరగడానికి అవకాశం ఉందని కేంద్ర గూఢచార సంస్థలు అప్రమత్తం చేయడంతో సర్వత్రా నిఘా పెంచామని హోం శాఖ మంత్రి కేజే. జార్జ్ తెలిపారు. విధాన సౌధలో తనను కలిసిన మీడియా ప్రతినిధులతో శుక్రవారం ఆయన మాట్లాడారు. ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్ నగర్‌లో మత ఘర్షణలు చెలరేగిన నేపథ్యంతో పాటు రాష్ట్రంలో గణేష్ ఉత్సవాలు జరుగుతున్న తరుణంలో కొంత మంది విద్రోహులు సున్నితమైన ప్రాంతాల్లో ప్రజలను రెచ్చ గొడుతున్నారనే సమాచారం ఉందన్నారు. మత ఘర్షణలకు ఆస్కారమున్న సున్నిత ప్రాంతాలను ఇప్పటికే గుర్తించామని ఆయన తెలిపారు.
ప్రజా రవాణా వ్యవస్థకు పెద్ద పీట
నగరంలో రోజు రోజుకు పెరుగుతున్న వాహనాల సంఖ్య వల్ల కాలుష్యం పెరిగి పోతోందని మంత్రి తెలిపారు. దీనిని నివారించడానికి ప్రజా రవాణా వ్యవస్థను విస్తృతం చేయదలిచామన్నారు. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య చైనా పర్యటన నుంచి వచ్చిన వెంటనే ‘మోనో రైలు’ పనులకు శ్రీకారం చుడతామన్నారు. మెట్రో రైలుకు ఫీడర్ ఛానల్‌గా మోనో రైలు పని చేస్తుందని చెప్పారు. దీని వల్ల నగర పౌరుల సొంత వాహనాల వినియోగం తగ్గుతుందని అభిప్రాయపడ్డారు. నగరంలో ట్రాఫిక్ రద్దీని నివారించడానికి వివిధ ప్రభుత్వ శాఖలు కొన్ని ప్రతిపాదనలు రూపొందించాయన్నారు. వీటి అమలు, ఫలితాల కోసం 45 రోజుల సమయాన్ని విధించుకున్నామని తెలిపారు. అనంతరం మరో సారి సమీక్షించి లోపాలుంటే సరిదిద్దుకుంటామని ఆయన చెప్పారు.
నిఘా పెంచాం
Published Sat, Sep 14 2013 1:45 AM | Last Updated on Fri, Sep 1 2017 10:41 PM
Advertisement