సాక్షి, ముంబై: కొత్త ఒక వింత.. అనే నానుడిని ముంబైకర్లు నిజం చేస్తున్నారు. ఏ నిమిషాన మోనో రైలు ప్రారంభమైందో.. అప్పటినుంచి దానిలో ప్రయాణించడానికే ఉవ్విళ్లూరుతున్నారు. ఈ నేపథ్యంలో తెల్లవారకముందే మోనో రైల్వే స్టేషన్ చేరుకుంటున్నారు. మధ్యాహ్నం సేవలు నిలిపివేసిన తర్వాత కూడా అక్కడి నుంచి జనం కదలడం లేదు. స్థానికుల నుంచి ఈ స్పందన చూసి అధికారులే ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అయితే టికెట్ ధర కేవలం ఐదురూపాయలు మాత్రమే ఉండడంతో వారు కేవలం జాయ్ రైడ్ కోసమే మోనో రైలులో ప్రయాణిస్తున్నారా..? అనే అనుమానాలు వస్తున్నాయి. నియమ, నిబంధనల ప్రకారం ఉదయం నుంచి మధ్యాహ్నం 3.15 గంటల వరకు మాత్రమే మోనో రైలు నడపాలి. కానీ సోమవారం విపరీతమైన రద్దీ కావడంతో సాయంత్రం 4.30 గంటల వరకు నడపాల్సి వచ్చింది.
ఇందులో మొత్తం 64 ట్రిప్పులు నడవగా సుమారు 19,600 మంది ప్రయాణికులు రాకపోకలు సాగించినట్లు జారీ అయిన టికెట్లను బట్టి తెలుస్తోందని ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ (ఎమ్మెమ్మార్డీయే) డెరైక్టర్ దిలీప్ కవట్కర్ చెప్పారు. వీరివల్ల ఎమ్మెమ్మార్డీయేకు రూ.రెండు లక్షల ఆదాయం వచ్చిందని ఆయన అన్నారు. ఇదిలా ఉండగా సుమారు తొమ్మిది కి.మీ. పొడవున్న చెంబూర్-వడాల మధ్య ఏడు ప్రముఖ స్టేషన్లు ఉన్నాయి. ఇక్కడ ఉదయం నుంచి క్యూలు కట్టారు. రద్దీని దృష్టిలో ఉంచుకుని అదనంగా భద్రత దళాలను మోహరించాల్సి వచ్చింది.
కాని ఈ మార్గంలోని ఏ స్టేషన్‌లోనూ ప్రయాణికులకు తాగునీరు, టాయిలెట్లు, టీ, అల్పాహార స్టాళ్లు లాంటి కనీస సదుపాయాలు కల్పించకపోవడంతో ఇబ్బం దులు పడుతున్నారు. టాయిలెట్లు లేకపోవడంతో ముఖ్యంగా మహిళలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఇప్పటికే అక్కడ ఏర్పాటుచేసిన టికెట్ వెండింగ్ మెషిన్ (టీవీఎం)లు పాత రూపాయి నాణాలను స్వీకరించకపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు.
దీనికి తోడు కొన్ని స్టేషన్లలో రైలు దిగిన ప్రయాణికులు స్టేషన్ నుంచి బయట పడేందుకు డోర్లు తెరుచుకోవడం లేదు. దీంతో ఒక్కసారిగా తోపులాటలు జరుగుతున్నాయి. కొద్ది రోజులు పరిస్థితులు ఇలాగే ఉంటాయని, అయిదే ఏ ఉద్దేశంతో మోనో రైలు సేవలు ప్రారంభించామో ఆ లక్ష్యాన్ని చేరుకునేందుకు కొంత సమయం పడుతుందని దిలీప్ కవట్కర్ వివరించారు.
మోనో రైలుకు భారీ స్పందన
Published Tue, Feb 4 2014 11:58 PM | Last Updated on Sat, Sep 2 2017 3:20 AM
Advertisement