Joy ride
-
ప్యాసింజర్ పేరుతో డ్రైవర్ జల్సా...!!
సాక్షి, ముంబై : ఆన్లైన్ క్యాబ్ అగ్రిగేటర్ ‘ఉబెర్’ లో క్యాబ్ బుక్ చేసుకున్న ఓ ప్రయాణికుడికి ఊహించని పరిణామం ఎదురైంది. క్యాబ్‌లో ఎక్కించుకోకుండానే తన పేరిట నగరమంతా డ్రైవర్ చక్కర్లు కొట్టడంతో కంగుతినడం అతడి వంతైంది. అసలేం జరిగిందంటే.. ముంబైకి చెందిన ప్రేషిత్ దియోరుఖర్ అనే వ్యక్తి జూలై 19న ఉబెర్ క్యాబ్ బుక్ చేసుకున్నాడు. తాను ఉన్న చోటుకి రావాల్సిందిగా సంబంధిత క్యాబ్ డ్రైవర్‌కు ఫోన్ చేసి చెప్పాడు. కానీ ఎంతసేపైనా అతను రాకపోవడంతో ప్రేషిత్ ఫోన్ చేశాడు. అయితే ఎంత ప్రయత్నించినా అతడు ఫోన్ ఎత్తకపోవడంతో విషయాన్ని గ్రహించిన ప్రేషిత్.. ట్విటర్ ద్వారా తన సమస్యను ఉబెర్ టీమ్‌కు తెలియజేశాడు. కానీ అటు నుంచి ఎటువంటి స్పందన రాకపోవడంతో తన పేరిట డ్రైవర్ ఎక్కడెక్కడ తిరుగుతున్నాడో లొకేషన్ షేర్ చేస్తూ వరుసగా ట్వీట్లు చేశాడు. ‘క్యాబ్‌లో శవం ఉంటే ఎలా..?’ ‘మలాద్ వెస్ట్ నుంచి నన్ను పికప్ చేసుకున్నాడు, ఇప్పుడతను ఉత్తర ముంబైకి చేరుకున్నాడు. ఒకవేళ ఆ క్యాబ్‌లో శవం ఉంటే ఎలా..? దాని వల్ల ఎవరికి సమస్య..? 857.43 రూపాయలు చెల్లించాలట. జల్సా అతడిది బిల్లు మాత్రం నాది’ అంటూ వరుసగా ట్వీట్లు చేయడంతో ఎట్టకేలకు ఉబెర్ టీమ్ స్పందించింది. ‘మీ డబ్బులు తిరిగి చెల్లిస్తాం. డ్రైవర్‌కు నోటీసు కూడా జారీ చేశాం’ అని సమాధానమిచ్చింది. నా సమయం వృధా చేసి కనీసం క్షమాపణలు కూడా చెప్పలేదంటూ ప్రేషిత్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. కాగా నిమిషాల్లోనే ప్రేషిత్ ట్వీట్లు వైరల్ కావడంతో మరికొంత మంది ప్రయాణికులు కూడా క్యాబ్ డ్రైవర్ల వల్ల తమకు ఎదురైన చేదు అనుభవాల్ని పంచుకున్నారు. @UberINSupport Hi, your 1-trip driver has started the trip without arriving at the location. His phone isn't reachable. What do I do? pic.twitter.com/L6tRT95gmI — Preshit Deorukhkar (@preshit) July 19, 2018 Pickup was in Malad West. Driver has now reached the edge of north Mumbai. I'm assuming he has to dump something in the khaadi. pic.twitter.com/pG3QmAo6lg — Preshit Deorukhkar (@preshit) July 19, 2018 Or he is dumping a dead body sealed in the car deep in the mangroves, me thinks. pic.twitter.com/SBokjKaLkK — Preshit Deorukhkar (@preshit) July 19, 2018 -
జాయ్‌లో జర్క్
ఆహ్లాదంగా సాగుతున్న ‘జాయ్ రైడ్’ జర్కిచ్చింది. పర్యాటకులకు గగనయాన ఆనందాన్ని పంచుతున్న తుంబి ఏవియేషన్ హెలికాప్టర్ గురువారం పడబోయి పైకి లేచింది. మధ్యాహ్నం 1.15 గంటలకు పర్యాటకులతో టేకాఫ్ తీసుకుంది. అంతలోనే తడబడి సాగర్ వైపు దూసుకెళ్లింది. దీంతో అక్కడ ఉన్నవారంతా ఆందోళన చెందారు. పైలెట్ చాకచక్యంగా వ్యవహరించడంతో భూమికి ఐదడుగుల ఎత్తులో కొద్దిసేపు గాల్లో నిలిచిపోయి.. తర్వాత పైకి ఎగిరింది. తిరిగొచ్చాక రైడ్‌ను రద్దుచేసి హెలికాప్టర్‌ను బేగంపేట ఎయిర్‌పోర్టుకు తరలించారు. రాంగోపాల్‌పేట్: పర్యాటకులకు హైదరాబాద్ నగరాన్ని చూపించేందుకు తుంబి ఏవియేషన్ ఏర్పాటు చేసిన జాయ్ రైడింగ్ హెలిక్యాప్టర్‌లో గురువారం మధ్యాహ్నం సాంకేతిక లోపం తలెత్తింది. పర్యాటకుల కోసం గురువారం నుంచి ఈనెల 15 వరకు జాయ్ రైడ్ తలపెట్టారు. తెలంగాణ పర్యాటక శాఖ ఆధ్వర్యంలో నెక్లెస్‌రోడ్‌లో ఏర్పాట్లు చేశారు. దీనిద్వారా హెలిక్యాప్టర్‌లో హైదరాబాద్ నగరం చూడవచ్చు. గురువారం ఉదయం 11 గంటలకు ఇది మొదలైంది. నాలుగుసార్లు పర్యాటకులను తీసుకు వెళ్లి వచ్చిన హెలిక్యాప్టర్.. మధ్యాహ్నం 1.15 సమయంలో టేకాఫ్ తీసుకుంది ఆ సమయంలో 10 అడుగుల మేరకు పైకి ఎగిరి వెంటనే కిందికి దిగింది. భూమికి ఐదు అడుగుల ఎత్తులోనే పైలెట్ కొద్దిసేపు గాలిలో నిలిపి ఉంచాడు. తర్వాత మళ్లీ పైకి ఎగిరిరింది. రైడ్ నూర్తై.. ప్రయాణికులను దించిన సిబ్బంది మరో ట్రిప్ కోసం పర్యాటకులు వేచి చూస్తున్నా వారికి డబ్బు తిరిగిచ్చేసి హెలిక్యాప్టర్‌ను బేగంపేట్ ఎయిర్‌పోర్టుకు తీసుకుతరలించారు. కాగా హెలిక్యాప్టర్‌లో ఎలాంటి సాంకేతిక సమస్య లేదని, శుక్రవారం జాయ్ రైడ్ ఉంటుందని తుంబి ఏవియేషన్ డైరెక్టర్ గోవింద్ నాయర్ తెలిపారు. -
నగరంలో హెలికాప్టర్ జాయ్ రైడ్
♦ నెక్లెస్ రోడ్లో కొత్తగా హెలీప్యాడ్ నిర్మిస్తున్న హెచ్ఎండీఏ ♦ జాయ్‌రైడ్ ప్రారంభించేందుకు టూరిజం శాఖ సన్నాహాలు సాక్షి, హైదరాబాద్: నగరంలో హెలికాప్టర్ జాయ్ రైడ్‌కు హుస్సేన్‌సాగర తీరం వేదిక కానుంది. నెక్లెస్‌రోడ్‌లోని జలవిహార్‌కు సమీపంలో హైదరాబాద్ మెట్రో డెవలప్మెంట్ అథారిటీ(హెచ్ఎండీఏ) కొత్తగా ఓ హెలీప్యాడ్‌ను రూపొందిస్తోంది. గతంలో ‘బీచ్ వాలీబాల్’ పోటీల కోసం కోర్టును నిర్మించిన స్థలంలో ఇప్పుడు హెలీప్యాడ్ సిద్ధమవుతోంది. సుమారు 30 మీటర్ల విస్తీర్ణంలో రూ.4 లక్షల వ్యయంతో ఈ హెలీప్యాడ్‌ను నిర్మిస్తున్నట్లు హెచ్ఎండీఏ కమిషనర్ టి.చిరంజీవులు తెలిపారు. నగరంలో ప్రయోగాత్మకంగా హెలికాప్టర్ జాయ్ రైడ్‌ను ప్రారంభించేందుకు టూరి జం శాఖ సన్నాహాలు చేస్తోందని, ఇందుకోసం హుస్సేన్‌సాగర్ తీరంలో 30 మీటర్ల విస్తీర్ణంలో హెలీప్యాడ్‌ను నిర్మించాలని హెచ్ఎండీఏను కోరిందని తెలిపారు. ఆ మేరకు నెక్లెస్‌రోడ్‌లో హెలీప్యాడ్‌ను రూపొందిస్తున్నామని, ఇది తాత్కాలికమే కనుక కాంక్రీట్‌తో కాకుండా మొరంతోనే బేస్మెంట్ను తీర్చిదిద్దుతున్నామని స్పష్టం చేశారు. నగరాన్ని సందర్శించే పర్యాటకులను దృష్టిలో పెట్టుకుని నెలరోజుల పాటు హెలికాప్టర్ జాయ్ రైడ్‌ను నిర్వహించాలని పర్యాటక శాఖ భావిస్తోందన్నారు. ఈ జాయ్ రైడ్‌ను వేసవిలో ప్రారంభించే అవకాశం ఉందని, హెలికాప్టర్ హైదరాబాద్ నగరం చుట్టూ ఓ రౌండ్ కొట్టి సాగర్ వద్ద ల్యాండ్ అవుతుందని వివరించారు. ఈ రైడ్ ఎంత సేపు ఉంటుంది? ఎంత చార్జీ వసూలు చేస్తారు? వంటివి పర్యాటక శాఖే నిర్ణయించి నిర్వహిస్తుందని తెలిపారు. హెలికాప్టర్ జాయ్ రైడ్‌కు ఏవియేషన్ క్లియరెన్స్, ఇతర అనుమతులన్నీ టూరిజం శాఖ తెచ్చుకుంటుందని తెలిపారు. హెలీప్యాడ్‌ను వారం రోజుల్లో పూర్తి చేసి టూరిజం శాఖకు అప్పగిస్తామన్నారు. -
మోనో రైలుకు భారీ స్పందన
సాక్షి, ముంబై: కొత్త ఒక వింత.. అనే నానుడిని ముంబైకర్లు నిజం చేస్తున్నారు. ఏ నిమిషాన మోనో రైలు ప్రారంభమైందో.. అప్పటినుంచి దానిలో ప్రయాణించడానికే ఉవ్విళ్లూరుతున్నారు. ఈ నేపథ్యంలో తెల్లవారకముందే మోనో రైల్వే స్టేషన్ చేరుకుంటున్నారు. మధ్యాహ్నం సేవలు నిలిపివేసిన తర్వాత కూడా అక్కడి నుంచి జనం కదలడం లేదు. స్థానికుల నుంచి ఈ స్పందన చూసి అధికారులే ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అయితే టికెట్ ధర కేవలం ఐదురూపాయలు మాత్రమే ఉండడంతో వారు కేవలం జాయ్ రైడ్ కోసమే మోనో రైలులో ప్రయాణిస్తున్నారా..? అనే అనుమానాలు వస్తున్నాయి. నియమ, నిబంధనల ప్రకారం ఉదయం నుంచి మధ్యాహ్నం 3.15 గంటల వరకు మాత్రమే మోనో రైలు నడపాలి. కానీ సోమవారం విపరీతమైన రద్దీ కావడంతో సాయంత్రం 4.30 గంటల వరకు నడపాల్సి వచ్చింది. ఇందులో మొత్తం 64 ట్రిప్పులు నడవగా సుమారు 19,600 మంది ప్రయాణికులు రాకపోకలు సాగించినట్లు జారీ అయిన టికెట్లను బట్టి తెలుస్తోందని ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ (ఎమ్మెమ్మార్డీయే) డెరైక్టర్ దిలీప్ కవట్కర్ చెప్పారు. వీరివల్ల ఎమ్మెమ్మార్డీయేకు రూ.రెండు లక్షల ఆదాయం వచ్చిందని ఆయన అన్నారు. ఇదిలా ఉండగా సుమారు తొమ్మిది కి.మీ. పొడవున్న చెంబూర్-వడాల మధ్య ఏడు ప్రముఖ స్టేషన్లు ఉన్నాయి. ఇక్కడ ఉదయం నుంచి క్యూలు కట్టారు. రద్దీని దృష్టిలో ఉంచుకుని అదనంగా భద్రత దళాలను మోహరించాల్సి వచ్చింది. కాని ఈ మార్గంలోని ఏ స్టేషన్లోనూ ప్రయాణికులకు తాగునీరు, టాయిలెట్లు, టీ, అల్పాహార స్టాళ్లు లాంటి కనీస సదుపాయాలు కల్పించకపోవడంతో ఇబ్బం దులు పడుతున్నారు. టాయిలెట్లు లేకపోవడంతో ముఖ్యంగా మహిళలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఇప్పటికే అక్కడ ఏర్పాటుచేసిన టికెట్ వెండింగ్ మెషిన్ (టీవీఎం)లు పాత రూపాయి నాణాలను స్వీకరించకపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. దీనికి తోడు కొన్ని స్టేషన్లలో రైలు దిగిన ప్రయాణికులు స్టేషన్ నుంచి బయట పడేందుకు డోర్లు తెరుచుకోవడం లేదు. దీంతో ఒక్కసారిగా తోపులాటలు జరుగుతున్నాయి. కొద్ది రోజులు పరిస్థితులు ఇలాగే ఉంటాయని, అయిదే ఏ ఉద్దేశంతో మోనో రైలు సేవలు ప్రారంభించామో ఆ లక్ష్యాన్ని చేరుకునేందుకు కొంత సమయం పడుతుందని దిలీప్ కవట్కర్ వివరించారు.