న్యూఢిల్లీ: ఉత్తర ఢిల్లీలోని బవానా నుంచి గుర్గావ వరకు మోనో రైలు సేవలను ప్రారంభించాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. యాభై కిలోమీటర్ల మోనోమార్గం సాధ్యాసాధ్యాలపై అధ్యయనం జరిపేందుకు సహాయసహకారాలు అందించాల్సిందిగా జపాన్‌ను కోరింది. ఈ విషయమై జపాన్ భూ, మౌలికవసతులు, రవాణామంత్రి అకిహిరో ఓహ్‌తాతో కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రి వెంకయ్యనాయుడు సమావేశమయ్యారు. ఓహ్‌తా నేతృత్వంలోని 20 మంది సభ్యుల జపాన్ బృందం దేశంలో పర్యటిస్తోంది. దేశంలోని నగర ప్రణాళికలు, విధానాల రూపకల్పన, విదేశీ ప్రాజెక్టులు, వాటి ప్రణాళికల, రోడ్లు, రైల్వేల పనితీరుపై ఈ బృందం అధ్యయనం జరుపుతుంది. ప్రత్యేకించి దేశంలో బహుళ ప్రయోజనాల రవాణా వ్యవస్థను ప్రవేశపెట్టే విషయమై అధ్యయనం చేయనుంది.
మెట్రో, మోనో, లైట్‌రైల్ రవాణా సేవలను దేశంలోని పట్టణ ప్రాంతాల్లో అందించేందుకు ఎటువంటి చర్యలు తీసుకోవాల్సిన అవసరముందనే విషయమై జపాన్ బృందం పరిశీలిస్తుంది. పట్టణాభివృద్ధిపై భారత్‌తో కలిసి పనిచేసేందుకు జపాన్ ఇప్పటికే సుముఖత వ్యక్తం చేసిన నేపథ్యంలో ఓహ్‌తా నేతృత్వంలోని బృందం ఇక్కడ పర్యటిస్తోంది. దీంతో ఈ బృందంతో సమావేశమైన కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు ఢిల్లీ-గుర్గావ్ మధ్య రవాణా వ్యవస్థను మరింత సరళతరం చేసే అవకాశాలపై చర్చించారు. మోనోరైలు ప్రతిపాదనలు ఎప్పటినుంచో ఉన్నందున ఈ విషయాన్ని జపాన్ బృందం దృష్టికి తీసుకొచ్చారు. అయితే బవానా నుంచి గుర్గావ్ వరకు 50 కిలోమీటర్ల దూరముంటుంది.
ఇంతటి సుదీర్ఘమైన మార్గంలో మోనోరైలు ఏర్పాటు చేయడం సాధ్యమవుతుందా? లేదా? అనే విషయమై అధ్యయనం జరపాల్సిందిగా వెంకయ్య కోరారు. అందుకు జపాన్ బృందం కూడా సానుకూలత వ్యక్తం చేసింది. అధ్యయనం పూర్తయితే ప్రతిపాదనలు సిద్ధం చేసి, అన్నిరకాల అనుమతులు పొంది, చకచకా పనులు ప్రారంభించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ఈ సేవలు అందుబాటులోకి వస్తే ఉత్తర ఢిల్లీ నుంచి గుర్గావ్ మధ్య రాకపోకలు సాగించేవారి ప్రయాణం సుఖవంతమవడమే కాకుండా సమయం కూడా కలిసొస్తుందని చెబుతున్నారు. ప్రస్తుతం ఈ రెండు ప్రాంతాల మధ్య బస్సు సేవలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి.
బవానా-గుర్గావ్ మధ్య మోనోరైల్
Published Tue, Sep 23 2014 10:40 PM | Last Updated on Thu, Sep 27 2018 2:34 PM
Advertisement