Bawana
-
ఢిల్లీలో ఘోర అగ్ని ప్రమాదం
న్యూఢిల్లీ: ఢిల్లీలో ఘోర అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. వాయువ్య ఢిల్లీలోని బవానా ఇండస్ట్రీ ఏరియాలోని ఓ ప్యాక్టరీలో గురువారం తెల్లవారుజామున మంటలు చెలరేగాయి. దీంతో ఆ ప్రాంతమంతా దట్టమైన పొగలు అలుముకున్నాయి. ఘటన స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది 22 ఫైరింజన్ల సహాయంతో మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
ఆ టీవీ చానెల్‌కు మరో షాక్!
న్యూఢిల్లీ: అసత్యాలతో కూడిన విద్వేషపూరిత కథనాన్ని ప్రత్యక్ష ప్రసారం చేశారంటూ ఓ ప్రఖ్యాత టీవీ చానెల్‌కు నోటీసులు జారీ అయ్యాయి. దేశరాజధాని ఢిల్లీలోని బవానా పారిశ్రామిక ప్రాంతంలో నివసిస్తోన్న భారతీయులను.. రోహింగ్యాలు, బంగ్లాదేశీలుగా పేర్కొంటూ ఆ చానెల్ ఒక కథనాన్ని ప్రత్యక్ష ప్రసారం చేసింది. దానిపై ఢిల్లీ మైనారిటీస్ కమిషన్(డీఎంసీ) ఆగ్రహం వ్యక్తం చేసింది. భారతీయుల జాతీయతను కించపరిచేలా సాగిన కథనంపై తక్షణమే క్షమాపణలు చెప్పాల్సిందిగా చానెల్‌కు నోటీసులు ఇచ్చింది. ఆది నుంచీ వివాదాలే: నోయిడా కేంద్రంగా 2007 నుంచి పనిచేస్తోన్న హిందీ న్యూస్ చానెల్ ‘సుదర్శన్ న్యూస్’... ఆది నుంచీ వివాదాలకు కేంద్రంగా ఉంటూవస్తోంది. మొన్న మే11న బవానా ప్రాంత వాసులపై ఆ చానెల్ చేసిన ప్రోగ్రామ్‌లో స్థానికులను విదేశీయులుగా పేర్కొంది. ఇరువర్గాల మధ్య మతవిద్వేషాలను రెచ్చగొట్టేలా టీవీ ప్రసారాలు చేశారన్న ఆరోపణలపై సుదర్శన్ న్యూస్ ఎండీ, ఎడిటర్ ఇన్ చీఫ్ సురేశ్ చౌహంకేను గతేడాది సంభల్(ఉత్తరప్రదేశ్) పోలీసులు అరెస్టు చేశారు. అంతకుముందే అతనిపై అత్యాచారం, హత్యాయత్నం కేసులున్నాయి. తన చానెల్లోనే పనిచేసిన ఉద్యోగినిపై చౌహంకే అత్యాచారయత్నం చేశాడని 2016లో నోయిడా పోలీసులు కేసు నమోదుచేశారు. ప్రస్తుతం ఆయన బెయిల్‌పై ఉన్నారు. జూన్ 12లోగా స్పందించకుంటే..: ఢిల్లీలో చేపట్టిన వివిధ అభివృద్ధి ప్రాజెక్టుల్లో నిర్వాసితులుగా మారిన చాలా మందికి ప్రభుత్వమే బవానా ప్రాంతంలో పునరావాసం కల్పించిందని, అలాంటివారిని విదేశీయులుగా పేర్కొనడం గర్హనీయమని డీఎంసీ చైర్మన్ జాఫరుల్ ఇస్లామ్ ఖాన్ అన్నారు. అనుచిత ప్రసారాలపై సుదర్శన్ న్యూస్ జూన్ 12లోగా స్పందించి, క్షమాపణలు చెప్పడంతోపాటు సంబంధిత వీడియోలను తొలగించాలని, లేకుంటే తీవ్రచర్యలు తప్పవని ఆయన పేర్కొన్నారు. చానెల్ ప్రసారాలపై దర్యాప్తు చేయాల్సిందిగా ఢిల్లీ నార్త్‌జోన్ పోలీసులను కూడా ఆదేశించినట్లు ఖాన్ తెలిపారు. -
బవానా-గుర్గావ్ మధ్య మోనోరైల్
న్యూఢిల్లీ: ఉత్తర ఢిల్లీలోని బవానా నుంచి గుర్గావ వరకు మోనో రైలు సేవలను ప్రారంభించాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. యాభై కిలోమీటర్ల మోనోమార్గం సాధ్యాసాధ్యాలపై అధ్యయనం జరిపేందుకు సహాయసహకారాలు అందించాల్సిందిగా జపాన్ను కోరింది. ఈ విషయమై జపాన్ భూ, మౌలికవసతులు, రవాణామంత్రి అకిహిరో ఓహ్తాతో కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రి వెంకయ్యనాయుడు సమావేశమయ్యారు. ఓహ్తా నేతృత్వంలోని 20 మంది సభ్యుల జపాన్ బృందం దేశంలో పర్యటిస్తోంది. దేశంలోని నగర ప్రణాళికలు, విధానాల రూపకల్పన, విదేశీ ప్రాజెక్టులు, వాటి ప్రణాళికల, రోడ్లు, రైల్వేల పనితీరుపై ఈ బృందం అధ్యయనం జరుపుతుంది. ప్రత్యేకించి దేశంలో బహుళ ప్రయోజనాల రవాణా వ్యవస్థను ప్రవేశపెట్టే విషయమై అధ్యయనం చేయనుంది. మెట్రో, మోనో, లైట్‌రైల్ రవాణా సేవలను దేశంలోని పట్టణ ప్రాంతాల్లో అందించేందుకు ఎటువంటి చర్యలు తీసుకోవాల్సిన అవసరముందనే విషయమై జపాన్ బృందం పరిశీలిస్తుంది. పట్టణాభివృద్ధిపై భారత్‌తో కలిసి పనిచేసేందుకు జపాన్ ఇప్పటికే సుముఖత వ్యక్తం చేసిన నేపథ్యంలో ఓహ్తా నేతృత్వంలోని బృందం ఇక్కడ పర్యటిస్తోంది. దీంతో ఈ బృందంతో సమావేశమైన కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు ఢిల్లీ-గుర్గావ్ మధ్య రవాణా వ్యవస్థను మరింత సరళతరం చేసే అవకాశాలపై చర్చించారు. మోనోరైలు ప్రతిపాదనలు ఎప్పటినుంచో ఉన్నందున ఈ విషయాన్ని జపాన్ బృందం దృష్టికి తీసుకొచ్చారు. అయితే బవానా నుంచి గుర్గావ్ వరకు 50 కిలోమీటర్ల దూరముంటుంది. ఇంతటి సుదీర్ఘమైన మార్గంలో మోనోరైలు ఏర్పాటు చేయడం సాధ్యమవుతుందా? లేదా? అనే విషయమై అధ్యయనం జరపాల్సిందిగా వెంకయ్య కోరారు. అందుకు జపాన్ బృందం కూడా సానుకూలత వ్యక్తం చేసింది. అధ్యయనం పూర్తయితే ప్రతిపాదనలు సిద్ధం చేసి, అన్నిరకాల అనుమతులు పొంది, చకచకా పనులు ప్రారంభించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ఈ సేవలు అందుబాటులోకి వస్తే ఉత్తర ఢిల్లీ నుంచి గుర్గావ్ మధ్య రాకపోకలు సాగించేవారి ప్రయాణం సుఖవంతమవడమే కాకుండా సమయం కూడా కలిసొస్తుందని చెబుతున్నారు. ప్రస్తుతం ఈ రెండు ప్రాంతాల మధ్య బస్సు సేవలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి.