ఇక అందరి వాడిని!
బీజేపీ వ్యక్తిని కాను: వెంకయ్య.. ప్రజాస్వామ్య బలోపేతానికి కృషి చేస్తా
► ఉప రాష్ట్రపతి ఎన్నిక కోసం నామినేషన్ దాఖలు
► వెంకయ్య పేరు ప్రతిపాదకుల్లో వైఎస్సార్‌సీపీ ఎంపీలు మేకపాటి, విజయసాయిరెడ్డి
సాక్షి, న్యూఢిల్లీ: ఉప రాష్ట్రపతి ఎన్నిక కోసం ఎన్డీఏ అభ్యర్థి ఎం. వెంకయ్య నాయుడు మంగళవారం నామినేషన్ వేశారు. రాజకీయ విభేదాలకు అతీతంగా అన్ని పార్టీలకు చేరువకావడానికి.. తాను ఇక బీజేపీకి చెందినవాణ్ని కానని, ఉపరాష్ట్రపతిగా ఎన్నికైతే దేశంలో ప్రజాస్వామిక వ్యవస్థలను బలోపేతం చేయడానికి కృషి చేస్తానని పేర్కొన్నారు. వెంకయ్య పార్లమెంట్ హౌస్‌లో రిటర్నింగ్ అధికారి, రాజ్యసభ సెక్రటరీ జనరల్ షంషేర్ షరీఫ్‌కు ఉప రాష్ట్రపతి ఎన్నిక కోసం నామినేషన్ పత్రాలు సమర్పించారు. ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ చీఫ్ అమిత్ షా, పార్టీ అగ్రనేత ఎల్.కె. అడ్వాణీ తదితరులు హాజరయ్యారు.
వెంకయ్య అభ్యర్థిత్వాన్ని ప్రతిపాదిస్తూ సంతకాలు చేసిన వారిలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు మేకపాటి రాజమోహన్ రెడ్డి, విజయసాయిరెడ్డి, టీఆర్‌ఎస్ ఎంపీ జితేందర్ రెడ్డి కూడా ఉన్నారు. మోదీ, పలువురు కేంద్ర మంత్రులు, ఎన్డీఏ భాగస్వామ్య పార్టీ ఎల్జేపీ నేత రాంవిలాస్ పాశ్వాన్ తదితరులు వెంకయ్య పేరును ప్రతిపాదించి బలపరచారు. కార్యక్రమానికి టీడీపీ, శివసేన, ఎల్జేపీలతోపాటు ఎన్డీఏయేతర అన్నాడీఎంకే, టీఆర్‌ఎస్ సభ్యులు కూడా హాజరయ్యారు. అంతకుముందు మోదీ, అమిత్‌షా, ఎన్డీఏ మిత్రపక్షాలు, వెంకయ్యకు మద్దతిస్తున్న పార్టీల నేతలు పార్లమెంట్ హౌస్ లైబ్రరీలో సమావేశమై పూర్తి మద్దతు ప్రకటించారు. ఆయన భారీ మెజారిటీతో గెలుస్తారని ధీమా వ్యక్తం చేశారు.
ఇది నాకు గౌరవం..
నామినేషన్ అనంతరం వెంకయ్య విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ.. ఎన్డీయే అభ్యర్థిత్వం తనకు గౌరవమని, ఎన్నికల్లో గెలిస్తే ఉప రాష్ట్రపతి పదవి గౌరవాన్ని మరింత పెంచుతానని పేర్కొన్నారు. మోదీ, అమిత్ షా, ఎన్డీఏ పార్టీలు, తనకు మద్దతిచ్చిన వైఎస్సార్ కాంగ్రెస్ తదితర పార్టీలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఉప రాష్ట్రపతి పదవిపై తనకు ఆసక్తిలేదని, మంత్రిగా కొనసాగాలని కోరుకుంటున్నట్లు వచ్చిన వార్తలను తోసిపుచ్చారు. ‘మోదీ నాయకత్వాన్ని బలోపేతం చేయాలనుకున్నాను. అంతేగాని, కొందరు చెబుతున్నట్లు మంత్రిగా కొనసాగాలనే ఉద్దేశం నాకు లేదు’ అని అన్నారు. ‘సర్వేపల్లి రాధాకృష్ణన్, జాకీర్ హుస్సేన్, ఎం. హిదయతుల్లా, ఆర్. వెంకట్రామన్, శంకర్‌దయాళ్ శర్మ, భైరాన్‌సింగ్ షెకావత్ వంటి గొప్ప వ్యక్తులు ఉప రాష్ట్రపతి పదవి చేపట్టారు.
ఈ పదవి విశిష్ట విధుల గురించి నాకు తెలుసు. నేను ఎన్నికైతే గత ఉప రాష్ట్రపతులు స్థిరపరచిన సంప్రదాయాలను, ప్రమాణాలను కాపాడతానని ప్రజలకు హామీ ఇస్తున్నాను.. ఆ పదవికి న్యాయం చేయగలను..’ అని అన్నారు. రాజ్యాంగ బాధ్యతలున్న ఉప రాష్ట్రపతి పదవికి, నాలుగు దశాబ్దాలుగా ప్రజలతో ముడివేసుకున్న తన ప్రజా జీవితానికి మధ్య ఉన్న తేడాలు తెలుసునని పేర్కొన్నారు. భారతదేశ సౌందర్యం దాని శక్తి, పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థల్లో ఉందన్న వెంకయ్య ఆ వ్యవస్థలను బలోపేతం చేయడానికి కృషి చేస్తానన్నారు. ఎన్నికల్లో ఓటేసే లోక్‌సభ, రాజ్యసభ ఎంపీలందరూ పార్లమెంట్ సమావేశాల కోసం ఢిల్లీలోనే ఉన్నారు కనుక తాను ప్రచారం చేయనని చెప్పారు.
బీజేపీ అమ్మలాంటిది: తన నేపథ్యాన్ని వివరిస్తూ.. చిన్నవయసులోనే తల్లిని కోల్పోయిన తనకు బీజేపీ తల్లి వంటిదని, పార్టీలోనే తల్లిని చూసుకున్నానని వెంకయ్య భావోద్వేగంతో పేర్కొన్నారు. ‘సామాన్య రైతు కుటుంబం నుంచి వచ్చిన నేను ప్రజల, పార్టీ అండతోనే ఈ స్థితికి చేరుకున్నాను. అయితే ఇకపై ఎంతమాత్రం బీజేపీకి చెందినవాడిని కాను.. ఏ పార్టీకి చెందినవాడిని కాను’ అని అన్నారు. 40 ఏళ్ల అనుబంధమున్న పార్టీని వీడటం చాలా బాధాకరమన్నారు.
పార్టీకి, మంత్రిపదవికి రాజీనామా..
సోమవారం రాత్రి ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపికయ్యాక వెంకయ్య కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేశారు. బీజేపీకి కూడా ఆయన రాజీనామా చేసినట్లు సన్నిహిత వర్గాలు చెప్పాయి. పార్టీ నుంచి తనంతట తాను వైదొలిగానని వెంకయ్య కూడా చెప్పారు. తాను రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతానని, ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటేస్తానన్నారు. ఎన్డీఏకు మెజారిటీ ఉండటంతోపాటు ఇతర పార్టీలు మద్దతిస్తుండటంతో ఆ యన సులువుగా విజయం సాధించే అవకాశముంది.
విధి మరోలా తలచింది..
‘2019 ఎన్నికల్లో మళ్లీ మోదీ విజయాన్ని చూసిన తర్వాత సంఘసేవలోకి అడుగుపెట్టాలని కోరుకున్నాను. అయితే విధి మరోలా తలచింది’ అని వెంకయ్య ఉప రాష్ట్రపతి అభ్యర్థిత్వాన్ని ప్రస్తావిస్తూ పేర్కొన్నారు. పార్టీలో చర్చ తర్వాత తీసుకున్న తుది నిర్ణయాన్ని అంగీకరించానన్నారు. దేశానికి అందిన గొప్పనాయకత్వాన్ని మనం బలోపేతం చేయాలని మోదీని ఉద్దేశిస్తూ అన్నారు. తర్వాత వెంకయ్య పార్లమెంట్ సెంట్రల్ హాలుకు వెళ్లి వివిధ పార్టీల ఎంపీలకు కృతజ్ఞతలు తెలిపారు. కొందరు ఆయనతో సెల్ఫీలు తీసుకున్నారు. నామినేషన్ సందర్భంగా వెంకయ్య కుటుంబ సభ్యులు కూడా పార్లమెంట్ హౌస్‌కు వచ్చారు. నామినేషన్‌కు ముందు ఆయన మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి, అడ్వాణీ, బీజేపీ సీనియర్ నేత మురళీ మనోహర్ జోషి తదితరులను కలుసుకుని ఆశీర్వాదాలు తీసుకున్నారు.