గోపాలకృష్ణ గాంధీ నామినేషన్
హాజరైన మన్మోహన్, సోనియా, రాహుల్
న్యూఢిల్లీ: ఉప రాష్ట్రపతి ఎన్నిక కోసం విపక్షాల అభ్యర్థి గోపాలకృష్ణ గాంధీ మంగళవారం నామినేషన్ దాఖలు చేశారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, కాంగ్రెస్ అధ్యక్ష, ఉపాధ్యక్షులు సోనియా గాంధీ, రాహుల్ గాంధీల సమక్షంలో ఆయన పార్లమెంట్ హౌస్‌లో రిటర్నింగ్ అధికారికి పత్రాలు సమర్పించారు. శరద్ యాదవ్(జేడీయూ), సీతారాం ఏచూరి(సీపీఎం), డి.రాజా(సీపీఐ), తారిక్ అన్వర్, ప్రఫుల్ పటేల్(ఎన్సీపీ), ఫరూక్ అబ్దుల్లా(ఎన్‌సీ), కనిమొళి(డీఎంకే) కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా గాంధీ విలేకర్లతో మాట్లాడుతూ.. ముంబై పేలుళ్ల దోషి యాకూబ్ మెమన్‌ను ఉరిశిక్ష నుంచి కాపాడటానికి తాను చేసిన యత్నాలను సమర్థించుకున్నారు.
మరణశిక్ష తప్పు అని, అది మధ్యయుగాల నాటి శిక్ష అని వ్యాఖ్యానించారు. మరణశిక్షను వ్యతిరేకించి, దాన్ని రద్దు చేయాలని కోరుకున్న మహాత్మాగాంధీ, బాబాసాహేబ్ అంబేడ్కర్‌ల స్ఫూర్తితో ఆ పని చేశానని తెలిపారు. మెమన్ క్షమాభిక్ష పిటిషన్ తిరస్కరణపై పునరాలోచించాలని అప్పట్లో తాను రాష్ట్రపతికి పంపిన పిటిషన్‌పై శివసేన చేసిన తాజా విమర్శలపై గాంధీ స్పందించారు. ‘మెమన్ కేసులో వాస్తవాలను ప్రణబ్ ముఖర్జీ ముందుంచాలని అనుకున్నాను. గత రాష్ట్రపతులు కేఆర్ నారాయణన్, అబ్దుల్ కలాంలా ఆయన ఒక నిర్ణయం తీసుకోవాలని కోరుకున్నా.. శివసేన తన పని తాను చేసింది. మరణశిక్ష తప్పు అనేది నా విశ్వాసం.. ఒక సామాన్య, స్వతంత్ర పౌరుడిగా నా విశ్వాసాలను పాటించడం నా విధి’ అని పేర్కొన్నారు.
పాకిస్తాన్‌లో మరణశిక్ష ఎదుర్కొంటున్న కులభూషణ్ జాధవ్ కోసం కూడా ఇలాంటి పిటిషన్ పంపానని వెల్లడించారు. ప్రస్తుతం దేశాన్ని విడగొట్టే శక్తి క్రియాశీలంగా పనిచేస్తోందని వ్యాఖ్యనించారు. తాను ఏ పార్టీకీ కాకుండా ఈ దేశ సామాన్య పౌరుడికి ప్రాతినిధ్యం వహిస్తున్నానని, ప్రజలకు, రాజకీయాలకు మధ్య ఉన్న ఖాళీని భర్తీ చేయడానికి ప్రయత్నిస్తానని చెప్పారు. రాజకీయాలపై ప్రజలు కోల్పోయిన విశ్వాసం పునరుద్ధరణ కావాలని కోరుకుంటున్నానన్నారు. ఉప రాష్ట్రపతి ఎన్నికలో గెలుపోటములపై స్పందిస్తూ.. కొన్నిసార్లు అంకెలతో సబంధం లేని విశ్వాసాల కోసం ముందుకు రావాల్సి ఉంటుందన్నారు.
బీజేడీ మద్దతు..
భువనేశ్వర్: రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థి రామ్‌నాథ్ కోవింద్‌కు మద్దతు ప్రకటించిన బీజేడీ ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో మాత్రం విపక్ష అభ్యర్థి గోపాలకృష్ణ గాంధీకి మద్దతు తెలిపింది. ఈమేరకు పార్టీ నేత, ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ మంగళవారం వెల్లడించారు. గాంధీ తనకు పాతమిత్రుడని, తాను రాజకీయాల్లోకి రాకముందే తాము స్నేహితులమని నవీన్ 2012లో చెప్పారు.