కన్నీళ్లు ఆగలేదు కన్నతల్లి లాంటి పార్టీని వీడుతుంటే...
ఆత్మీయ కన్నతల్లి లాంటి అనుబంధం లో వెంకయ్య ఉద్వేగం
♦ నాతోపాటు ప్రధాని కూడా కంటతడి పెట్టారు
♦ బీజేపీలో వాజ్‌పేయి, అడ్వాణీల తర్వాత నేనే సీనియర్‌ని
♦ ఎన్టీఆర్ మంత్రి పదవి ఇస్తానన్నా సిద్ధాంతాలకే కట్టుబడ్డా
♦ సమయం లభిస్తే రాజకీయ అనుభవాలపై పుస్తకం రాస్తా
సాక్షి, హైదరాబాద్: ‘‘ఊహ తెలిసినప్పటి నుంచి కన్నతల్లిలా ఆదరించిన పార్టీ(బీజేపీ)కి రాజీనామా చేస్తున్నప్పుడు కన్నీళ్లు ఆగలేదు. నాతోపాటు ప్రధాని మోదీ కూడా కంటతడి పెట్టుకున్నారు. పార్టీని వీడాలంటే బాధపడ్డానే తప్ప పదవులను వీడేందుకు కాదు’’ అని ఎన్డీఏ ఉప రాష్ట్రపతి అభ్యర్థి వెంకయ్య నాయుడు పేర్కొన్నారు. ఉప రాష్ట్రపతి పదవికి నామినేషన్ వేసిన నేపథ్యంలో శుక్రవారం బీజేపీ హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల శాఖల ఆధ్వర్యంలో నిర్వహించిన ఆత్మీయ అభినం దన కార్యక్రమంలో వెంకయ్య ఉద్వేగంగా మాట్లాడారు.
చిన్నతనంలోనే తల్లి చనిపోవడం తో ఊహ తెలిసినప్పటి నుంచి బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌లతో తనకు కన్నతల్లి లాంటి అనుబంధం ఏర్పడిందని గుర్తుచేసుకున్నారు. జీవితంలో తాను ఈ స్థాయికి రావడానికి తన తల్లి, ఆర్‌ఎస్‌ఎస్, బీజేపీ, ప్రజల ఆశీర్వాదం కారణమన్నారు. నిత్యం అందరినీ కలిసే అలవాటున్న తాను ఇకపై అలా కలవడం కుదరదని తెలియడం బాధిస్తోందన్నారు. బీజేపీలో చేరినప్పుడు అందులో ఎందుకు చేరుతున్నావని చాలా మంది మిత్రులు ప్రశ్నించారని.. కానీ ఇప్పుడు ప్రపంచంలో పెద్ద పార్టీ బీజేపీ అని వెంకయ్య పేర్కొన్నారు. 2019లో మోదీ మరోసారి ప్రధాని అయ్యేంతవరకు పనిచేసి ఆ తర్వాత రాజకీయాల నుంచి రిటైర్ కావాలను కున్నానని.. కానీ పార్టీ ఆదేశాల మేరకు ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా రంగంలో ఉన్నానన్నారు.
పదవులపై ఆశ లేదు...
పదవులపై తనకు ఏనాడూ ఆశలేదని వెంకయ్య పేర్కొన్నారు. కుటుంబానికి రాజకీయ చరిత్ర ఉన్న నాయకుల్లేరని, ఉప రాష్ట్రపతి పదవి దాకా అవకాశం ఇచ్చిన పార్టీ తనకు తల్లితో సమానమన్నారు. వాజ్‌పేయి ప్రధానిగా ఉన్న సమయంలో కేంద్ర మంత్రిగా పనిచేశానని, అప్పుడు కూడా మంత్రి పదవికి రాజీనామా చేయించి పార్టీ అధ్యక్ష బాధ్యతలను అప్పగించారని, ఇప్పుడు అదే రీతిలో రాజీనామా చేసి ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా ఉండాల్సి వచ్చిందని వెంకయ్య గుర్తుచేశారు. బీజేపీలోని సీనియర్లలో వాజ్‌పేయి, అడ్వాణీ తర్వాత సీనియర్‌ని తానేనని వెంకయ్య చెప్పారు. టీడీపీలోకి వస్తే మంత్రి పదవి ఇస్తానని ఎన్టీఆర్ 1984లో పేర్కొన్నా సిద్ధాంతాల కోసం కట్టుబడి సున్నితంగా తిరస్కరించానన్నారు.
కుమారుడి వ్యాపారంతో సంబంధం లేదు
తన కుమారుడి వ్యాపారం గురించి తనకు పెద్దగా తెలియదని, ఆ విషయం తాను ఎప్పుడూ పట్టించుకోలేదని వెంకయ్య చెప్పారు. తన కుమారుడికి చెందిన హర్షా టయోటాపై కొందరు ఆరోపణలు చేస్తుంటే ఏం జరిగిందో తెలుసుకున్నానని, పోలీసు శాఖకు వాహనాలు సమకూర్చేందుకు తెలంగాణ ప్రభుత్వం నేరుగా కంపెనీకే ఆర్డర్ ఇచ్చినట్లు తేలిందని వెంకయ్య వివరించారు.
రాజకీయాల జోలికి రావొద్దని కుమారుడికి చెప్పానని, అలాగే వ్యాపారాల జోలికి రానని కుమారుడికి చెప్పానన్నారు. సేవే మార్గంగా నడిచే స్వర్ణభారత్ ట్రస్ట్‌పై కాంగ్రెస్ నేతల ఆరోపణలు బాధాకరమన్నారు. అవగాహన లేమితోనే వారు ఆరోపణలు చేశారన్నారు. కార్యక్రమంలో కేంద్ర మంత్రి సుజనా చౌదరి, రెండు రాష్ట్రాల మంత్రులు కేటీఆర్, తుమ్మల, కామినేని శ్రీనివాస్, సీఎల్సీ నేత కె.జానారెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్, బీజేఎల్పీ నేత జి.కిషన్‌రెడ్డి, మేయర్ బొంతు రామ్మోహన్, సినీ ప్రముఖులు నాగార్జున, వెంకటేష్, కె. రాఘవేంద్రరావు, సురేష్, మురళీమోహన్ తదితరులు పాల్గొన్నారు.
ఉచిత వైద్య శిబిరాన్నిప్రారంభించిన వెంకయ్య
శంషాబాద్ రూరల్ (రాజేంద్రనగర్): స్వర్ణ భారత్ ట్రస్టుపై విపక్షాల ఆరోపణలు తగవని వెంకయ్య పేర్కొన్నారు. శంషాబాద్ మండలం ముచ్చింతల్ సమీపంలోని స్వర్ణ భారత్ ట్రస్టు ఆధ్వర్యంలో శుక్రవారం దివ్యాంగుల కోసం నిర్వహించిన ఉచిత వైద్య శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ స్వర్ణ భారత్ ట్రస్టు ఓ కుటుంబానిది కాదని.. తాను ట్రస్టుకు ప్రోత్సాహం అందించే వాడిని తప్ప అందులో కనీసం సభ్యుడిని కూడా కాదన్నారు. తన కుమార్తెతోపాటు కొందరు సభ్యులుగా ఏర్పడి ట్రస్టు ద్వారా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని చెప్పారు. కొందరు రాజకీయంగా అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని.. ట్రస్టుకు తానేమీ చేయలేదని అన్నారు. ఇక్కడ నిర్మించిన భవనాల పన్నును మినహాయించి సమాజ సేవకు వినియోగిం చేలా ప్రభుత్వం సహకరించిందన్నారు.
సీఎంలు ఏకతాటిపైకి వస్తే విభజన హామీలకు పరిష్కారం
రాజకీయాల్లో మరికొంత కాలం ఉంటే రాష్ట్రానికి కొంత న్యాయం జరిగేదని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారని వెంకయ్య తెలిపారు. రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కలసి ఒక అంగీకారంతో కేంద్రం దగ్గరకు వెళ్తే విభజన హామీలన్నీ పరిష్కారమవుతాయని సూచించారు. సమయం దొరికితే తన రాజకీయ అనుభవాలతో పుస్తకం రాస్తానని వెంకయ్య వెల్లడించారు.