ప్రజారోగ్యం సవాళ్లను అధిగమించాలి | The challenges of public health should be overcome | Sakshi
Sakshi News home page

ప్రజారోగ్యం సవాళ్లను అధిగమించాలి

Published Sat, Dec 15 2018 3:08 AM | Last Updated on Sat, Dec 15 2018 3:08 AM

The challenges of public health should be overcome - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ప్రజారోగ్యం విషయంలో దేశం ఎదుర్కొంటున్న మూడు ప్రధాన సవాళ్లను అధిగమించాలంటే వ్యవసాయ, పోషకాహార శాస్త్రవేత్తలు, విధాన రూపకర్తలు కలిసికట్టుగా పనిచేయాలని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సూచించారు. దేశం ఆర్థికంగా ఎదుగుతోన్న ఈ తరుణంలోనూ కొంతమంది పోషకాహార లోపాలు, సూక్ష్మ పోషకాల లేమి, ఊబకాయం వంటి అధిక పోషణ సమస్యలు కలిగి ఉండటం బాధాకరమన్నారు. జాతీయ పోషకాహార సంస్థ (ఎన్‌ఐఎన్‌) శతజయంతి ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం ఏర్పాటు చేసిన అంతర్జాతీయ సదస్సు ముగింపు వేడుకల్లో ఆయన మాట్లాడుతూ.. దేశ ప్రజల ఆరోగ్య పరిరక్షణలో ఎన్‌ఐఎన్‌ విశేష సేవలు అందించిందన్నారు. జనాభా పెరుగుదల, మారుతు న్న జీవనశైలుల నేపథ్యంలో అందరికీ పౌష్టికాహారం అందుబాటులో ఉండేలా ప్రయత్నాలు ముమ్మరం చేయాలన్నారు. ఇందుకోసం వ్యవసాయ శాస్త్రవేత్తలు వరి సాగు స్థానంలో ఇతర పోషకాలు అందించే పంటలపై పరిశోధనలు ఎక్కువ చేయాలన్నారు. జీవనశైలి మార్పుల వల్ల వస్తున్న ఆరోగ్య సమస్యలపై ప్రజలకు అవగాహన కల్పించాలని కోరారు. 

ఉచిత రుణమాఫీపై అభ్యతరం.. 
రైతులను ఆదుకునే పేరుతో కొన్ని ప్రభుత్వాలు ఉచిత రుణమాఫీలు ప్రకటిస్తుండటంపై ఉపరాష్ట్రపతి అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇలాంటి ఉచిత పథకాలు రైతులకు తాత్కాలిక ఉపశమనం కలిగించినా శాశ్వత పరిష్కారం మాత్రం కాదని తెలిపారు. సుస్థిర అభివృద్ధి కోసం దీర్ఘకాల పరిష్కారాలు అవసరమని, మరీ ముఖ్యంగా ఆహార రంగంలో ఈ అవసరం ఎక్కువగా ఉందన్నారు. ఆరోగ్యకరమైన భోజనంలో ఎలాంటి ఆహారం ఉండాలన్న అంశంపై ఎన్‌ఐఎన్‌ సిద్ధం చేసిన సమాచారాన్ని ఉపరాష్ట్రపతి విడుదల చేశారు. కార్యక్రమంలో భారత వైద్య పరిశోధన సమాఖ్య డైరెక్టర్‌ జనరల్‌ డాక్టర్‌ బలరాం భార్గవ, ఎన్‌ఐఎన్‌ డైరెక్టర్‌ హేమలత పాల్గొన్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement