
సాక్షి, న్యూఢిల్లీ: ఎన్టీఆర్ కాళ్లు మొక్కినవారే ఆయనకు వెన్నుపోటు పొడిచారని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు వ్యాఖ్యానించారు. అయితే ఇప్పుడు వారి పేర్లు చెప్పడం సరైంది కాదన్నారు. ఆదివారం ఢిల్లీలో జరిగిన ఆంధ్ర అసోసియేషన్ ఢిల్లీ జూబ్లీ వేడుకలు, అసోసియేషన్‌లో గోదావరి ఆడిటోరియం ఆవిష్కరణ కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి పాల్గొని ప్రసంగించారు. ఈ రోజుల్లో నిస్వార్థంగా సేవచేయడం కష్టమైన పనిగా మారిందని ఉపరాష్ట్రపతి అన్నారు. వ్యవస్థలను ధిక్కరించడం, చట్టాలను అతిక్రమించడం, చట్టంలోని లొసుగులు తెలుసుకొని సంస్థలను దుర్వినియోగం చేయడం కొన్నేళ్లుగా అందరికీ అలవాటుగా మారిందన్నారు.
అయితే ప్రస్తుతం వీటిని సరిదిద్దేందుకు జరుగుతున్న ప్రయత్నాలకు దేశంలో ఎదురవుతున్న సమస్యలు అందరికీ తెలిసినవేనని వ్యాఖ్యానించారు. తన జీవితంలో ఎవరి కాళ్లు మొక్కకుండా తన కష్టంతో ఈ రోజు ఈ స్థాయికి వచ్చినట్టు పేర్కొన్నారు. ఈ సందర్భంగా దివంగత నందమూరి తారకరామారావుతో జరిగిన ఒక ఘటనను వెంకయ్య గుర్తు చేసుకున్నారు. ఒక రోజు కొంతమంది వరుసగా ఎన్టీఆర్ కాళ్లు మొక్కడం చూసి ఇదేంటని ఆయన్ను ప్రశ్నించగా.. అది వాళ్ల ప్రేమ అని సమాధానమిచ్చారన్నారు. అది ప్రేమా? మరేదైనా? అన్నది ఆరునెలల్లో తెలుస్తుందని తాను అప్పుడు బదులిచ్చినట్టు వెంకయ్య చెప్పారు. సరిగ్గా ఆరు నెలల్లోనే ఎన్టీఆర్‌కు ఎవరైతే కాళ్లు మొక్కారో వారందరూ ఆయనకు వెన్నుపోటు పొడిచారని వెంకయ్య వివరించారు.
ఆంధ్ర అసోసియేషన్ పనితీరు అభినందనీయం..
ఢిల్లీలో మన సంస్కృతిని స్థానికంగా స్థిరపడిన తెలుగువారికి చేరువచేస్తూ, వారికి అవసరమైన సహాయ సహకారాలు అందించేందుకు కృషి చేస్తున్న ఆంధ్ర అసోసియేషన్ పనితీరు అభినందనీయమని వెంకయ్య అన్నారు. ఈ కార్యక్రమంలో సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్ కేవీ చౌదరి, అసోసియేషన్ అధ్యక్షుడు మణినాయుడు, ప్రధాన కార్యదర్శి కోటగిరి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment