
ప్రదీప్ చిలుకూరి, సయీ మంజ్రేకర్, కల్యాణ్ రామ్, విజయశాంతి, ఎన్టీఆర్, సునీల్ బలుసు, అశోక్‌వర్ధన్ ముప్పా
‘‘ఈ వేదికపైన ఎన్నోసార్లు నేను, అన్న (కల్యాణ్ రామ్) నిల్చొని ఉన్నప్పుడు మా నాన్నగారు (హరికృష్ణ) రావడం, మాట్లాడటం జరిగింది. ఈరోజు విజయశాంతిగారు మాట్లాడుతుంటే మొదటిసారి వేదికపైన మా నాన్నగారు లేరనే లోటు తీరినట్టయింది. ఈ ప్రీ రిలీజ్ వేడుకలో నాన్నగారు ఉండుంటే ఎలా ఉంటుందో విజయశాంతిగారు మాట్లాడినప్పుడు నాకు ఆ లోటు భర్తీ అయిపోయింది’’ అని హీరో ఎన్టీఆర్ అన్నారు. కల్యాణ్ రామ్, సయీ మంజ్రేకర్ జంటగా విజయశాంతి కీలక పాత్రలో నటించిన చిత్రం ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’.
ప్రదీప్ చిలుకూరి దర్శకత్వం వహించారు. ముప్పా వెంకయ్య చౌదరి సమర్పణలో అశోక్‌వర్ధన్ ముప్పా, సునీల్ బలుసు నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 18న రిలీజ్ కానుంది. ఈ చిత్రం ట్రైలర్ లాంచ్, ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి ముఖ్య అతిథిగా హాజరైన ఎన్టీఆర్ మాట్లాడుతూ– ‘‘భారతదేశ చిత్ర పటంలో హీరోలతో సమానంగా నిల్చున్న ఏకైక మహిళ ఎవరన్నా ఉన్నారంటే అది విజయశాంతిగారు ఒక్కరే. ‘కర్తవ్యం, ప్రతిఘటన, మగరాయుడు’... ఇలా ఎన్నో సినిమాల్లో అద్భుతమైన పాత్రలు చేశారామె. ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’ని చూశాను.
విజయశాంతిగారు లేకపోతే ఈ చిత్రం లేదు. పృథ్వీ, సోహైల్ ఖాన్, ప్రదీప్ చిలుకూరి, సునీల్, అశోక్‌గార్లు... ఇలా ఎవరు లేకున్నా ఈ సినిమా లేదు. 18న ఈ మూవీ మీ ముందుకొస్తోంది. రాసిపెట్టుకోండి... ఆఖరుగా వచ్చే ఇరవై నిమిషాలు ప్రేక్షకుల కళ్లల్లో నీళ్లు తిరక్కపోతే... అంత అద్భుతంగా తీశారు ప్రదీప్‌గారు. సినిమా చూస్తున్న నాకు కూడా కన్నీళ్లు ఆపుకోవడం కుదరలేదు. ఆ ఆఖరి ఇరవై నిమిషాలు అలా రావడానికి ఒకే ఒక్క కారణం కల్యాణ్ అన్న మాత్రమే.
దర్శకుడి ఐడియాని ఆయన నమ్మారు. ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’ అన్న కెరీర్‌లో ఒక ప్రత్యేకమైన సినిమాగా నిలిచిపోతుందని నా నమ్మకం. మనసు పెట్టి, ప్రాణం పెట్టి నటించారు. బహుశా అది విజయశాంతిగారు కాకుండా వేరే వారు అయ్యుంటే ఆయన అంత అద్భుతంగా చేసేవారో కాదో నాకు తెలీదు. ఆమెను ఓ తల్లిగా నమ్మారు కాబట్టి అంత అద్భతంగా నటించారు. ప్రేక్షకులు, మా ఫ్యాన్స్ అందరూ ముందుగా ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’ని ఎంజాయ్ చేయండి. ఆ తర్వాత ఆగస్టు 14న రిలీజ్ అవుతున్న ‘వార్ 2’ (హృతిక్ రోషన్, ఎన్టీఆర్ నటించారు) కూడా మిమ్మల్ని అలరిస్తుంది. పక్కాగా ప్లాన్ చేసి ఈ ఏడాది మిమ్మల్ని అందర్నీ తప్పకుండా కలుస్తాను’’ అని చెప్పారు.
కల్యాణ్ రామ్ మాట్లాడుతూ– ‘‘మీరు చాలా సినిమాలు చూస్తారు. మేం కూడా చేస్తాం. సినిమా అయ్యాక పార్కింగ్‌కి వెళ్లి బైక్, కార్ స్టార్ట్ చేసుకోగానే సినిమాని మర్చిపోతాం. కానీ, చాలా అరుదుగా నటులుగా మాకు గానీ, ప్రేక్షకులుగా మీకు గానీ కొన్ని సినిమాలు
ఇంటికెళ్లేదాకా మనసుని హత్తుకుంటాయి. అలాంటి సినిమా మా ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’’ అన్నారు.
విజయశాంతి మాట్లాడుతూ– ‘‘ఎన్టీ రామారావుగారు ఓ డిక్షనరీ. ఆయనలో కొంత వచ్చినా ఎవరైనా గొప్ప నటీనటులు అయిపోతారు. ఆయన వద్ద నుంచి ఆశీర్వాదాలు తీసుకోవడం నా అదృష్టం. ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’ సెట్స్‌లో నేను అనుకున్నదానికంటే అద్భుతంగా, చాలా సౌకర్యంగా చూసుకున్నాడు కల్యాణ్ బాబు. ఈ సినిమాని అందరూ థియేటర్లో చూసి, సూపర్ హిట్ అని చెప్పాలి’’ అని అన్నారు. ఈ వేడుకలో కెమేరామేన్ రాంప్రసాద్, నటులు జోగినాయుడు, సందీప్, రచయిత శ్రీకాంత్ విస్సా, ్ర΄÷డక్షన్ డిజైనర్ బ్రహ్మ కడలి, రచయిత రఘురామ్ పాల్గొన్నారు.