
ఏకాభిప్రాయ సాధనకు కృషి
► రాష్ట్రపతి ఎన్నికలో ప్రతిపక్షాల సూచనలు గౌరవిస్తాం: వెంకయ్యనాయుడు
► నేడు సమావేశం కానున్న విపక్షాలు
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్రపతి ఎన్నిక విషయంలో ఏకాభిప్రాయ సాధన కోసం విపక్షాలతో సహా అన్ని రాజకీయ పార్టీలను సంప్రదిస్తామని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు తెలిపారు. ఈమేరకు ఏర్పాటైన కమిటీలో సభ్యుడైన కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్‌ఈశాన్య రాష్ట్రాల పర్యటనలో ఉన్నారని, ఆయన వచ్చిన తరువాత ఆర్థిక మంత్రిæ జైట్లీతో చర్చించి ముందుకు సాగుతామన్నారు.
‘మూడేళ్ల ఎన్డీఏ పాలనలో పట్టణాభివృద్ధి శాఖ పురోగతి’పై మంగళవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రపతి ఎన్నిక ఏకగ్రీవానికి ఇతర పార్టీలను సంప్రదించాల్సిన బాధ్యత అధికార పార్టీ అయిన తమపై ఉందని తెలిపారు. ఈ విషయంలో ప్రతిపక్షాల సూచనలను గౌరవిస్తామని పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 25న అమెరికా పర్యటనకు బయల్దేరడానికి ముందే పోటీలో నిలిపే అభ్యర్థిపై స్పష్టత తీసుకురావాలని బీజేపీ యోచిస్తోంది. మరోవైపు, ఇదే విషయంపై చర్చించడానికి బుధవారం ప్రతిపక్ష పార్టీలు సమావేశమవుతున్నాయి.