
విశ్లేషణ
డోనాల్డ్ ట్రంప్ రాజకీయాలు, వ్యక్తిత్వం, విధానాలు, వీటన్నిటితో కూడిన గందర గోళం పట్ల అమెరికన్లు ఎలా స్పందిస్తారు అనేది 2024 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో అతి పెద్ద చిక్కుప్రశ్న. ట్రంప్ పతనం నుంచి ఉత్థానం చెందారు. అలాగని ఆయన ప్రజాదరణకు తీవ్రమైన పరిమి తులున్నాయి. ప్రధానంగా 4 అంశాల్లో ట్రంప్ వైఖరిని పరిశీలించాలి.
1. ట్రంప్ నిలకడతనం: కొద్ది నెలల కాలంలోనే ఆయన రెండుసార్లు మరణానికి చేరువగా వెళ్లివచ్చారు. ప్రజారంగంలో బలంగా ఉండటానికి అవసరమైన స్పష్టమైన భౌతిక ధైర్యం ఆయనకు ఉంది. 2015లో ఆయన అభ్యర్థిత్వాన్ని ప్రకటించి నప్పటినుంచీ రాజకీయ ప్రత్యర్థులు, అమెరికా రాజకీయ పండి తులు కనీసం ఎనిమిది సార్లు ట్రంప్ రాజకీయ సంస్మరణను ఖాయం చేసేశారు. రిపబ్లికన్ అభ్యర్థిగా ట్రంప్ 2016లో గెలు స్తారని ఎవరూ అనుకోలేదు. హిల్లరీ క్లింటన్‌ను అధ్యక్ష రేసులో ఓడించగలరని అసలు అనుకోలేదు. ఆయన అభ్యర్థిత్వానికి రష్యా మద్దతు విషయంలో సాగిన దర్యాప్తు నుండి బయట పడతారనీ ఎవరూ అనుకోలేదు. కోవిడ్ మహమ్మారిపై ఆయన అశాస్త్రీయ నిర్వహణను అమెరికన్లు క్షమిస్తారని కొద్దిమందే భావించారు.
2020 ఎన్నికల ఫలితాల చట్టబద్ధతను అంగీకరించడానికి నిరాకరించిన తర్వాత, యునైటెడ్ స్టేట్స్ కాపిటల్‌పై దాడికి ఒక గుంపును పంపిన తర్వాత కూడా ట్రంప్ ఆధిపత్యం చలాయించే ఆటగాడిగా ఉంటారని ఎవరూ భావించలేదు. రిపబ్లికన్లు సెనే ట్‌ను కోల్పోయిన తర్వాత, 2022 మధ్యంతర ఎన్నికలలో హౌస్‌ను గెలవ లేకపోయిన తర్వాత అందరూ ట్రంప్ పనయిపోయిందని వ్యాఖ్యా నించారు. పైగా ఆయన నేరారోపణ కేసుల నుండి బయట పడతారని ఎవరూ నమ్మలేదు. కానీ ట్రంప్ ప్రతిసారీ విమర్శకుల అంచనాలను తారుమారు చేశారు. మరింత ప్రజాదరణ పొందారు. రిపబ్లికన్ పార్టీని నియంత్రిస్తున్నారు.
2. ట్రంప్ ప్రజాదరణకు పరిమితులు: 2016 నవంబర్‌లో ఆయన అధ్యక్షుడిగా గెలిచిన తర్వాత, ఆయన నాయకత్వంలో పాల్గొన్న అన్ని ఎన్నికలనూ రిపబ్లికన్ పార్టీ ఓడిపోయింది. ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు రిపబ్లికన్లు హౌజ్‌ను కోల్పోయిన 2018 మధ్యంతర ఎన్నికలు ఇందులో ఉన్నాయి. 2021 జనవరిలో జార్జియా సెనేట్ ఎన్నికల్లో ఓటమి కూడా ఇందులో భాగం. అంతెందుకు, ట్రంప్ స్వయంగా ఓడిపోయిన 2020 అధ్యక్ష ఎన్నికలు కూడా దీంట్లో ఉన్నాయి. ఆయన ఆధ్వర్యంలో రిపబ్లికన్ పార్టీ స్థిరంగా ఓడిపోయింది. విస్తృతమైన ఓటర్లలో దాని ఆకర్షణ తగ్గింది.
3. ట్రంప్ ఎన్నికల ప్రచారంలో జాత్యహంకారం: ‘మేక్ అమె రికా గ్రేట్ ఎగైన్’ అని ట్రంప్ చేసే ప్రచారం ‘మేక్ అమెరికా వైట్ ఎగైన్’ అని స్పష్టమైపోయింది. ఆయన వ్యాఖ్యానాలు పక్షపాతాన్ని, ద్వేషాన్ని, భయాన్ని కలిగించేలా ఉన్నాయి. ఒహయో పట్టణంలోని అక్రమ హైతియన్ వలసదారులు పెంపుడు జంతువులను తింటు న్నారని ట్రంప్, జేడీ వాన్ ్స (రిపబ్లికన్ ఉపాధ్యక్ష అభ్యర్థి) నిరా ధారమైన వ్యాఖ్యలు చేశారు. నిజానికి పట్టణంలోని వలసదారులు ఎవరూ చట్టవిరుద్ధంగా ఉండటం లేదు.
వాళ్లెవరూ పెంపుడు జంతువులను తినడమూ లేదు. ఇక ట్రంప్ గట్టి మద్దతుదారు, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ లారా లూమర్ 9/11 స్మారక స్థూపం వద్దకు ట్రంప్‌తో పాటు విమానంలో వెళ్లి, డెమోక్రాట్ల అధ్యక్ష అభ్యర్థి కమలా హారిస్ భారతీయ మూలాలపై జాత్యహంకార దాడిని ప్రారంభించారు. ట్రంప్ స్వయంగా హారిస్‌పై జాత్య హంకార వ్యాఖ్యలను ప్రయోగించారు. ట్రంప్ గెలుపును వేడుకగా జరుపుకొనే భారత మితవాద శక్తులు దీనిని గుర్తుంచుకోవాలి.
4. ట్రంప్ విదేశాంగ విధానం: డెమొక్రాట్లు, పాత రిపబ్లికన్లకంటే కూడా సంకుచిత భావన కలిగిన అమెరికా గురించి ట్రంప్ మాట్లాడుతున్నారు. నిజానికి, ట్రంప్ తన మొదటి హయాంలో ‘అబ్రహం ఒప్పందాల’కు మధ్యవర్తిత్వం వహించారు. చైనాకు వ్యతిరేకంగా అమెరికా వైఖరిని పెంచారు. ఇరాన్ కు వ్యతిరేకంగా కార్యకలాపాలను ఆమోదించారు. ఉత్తర కొరియాతో చర్చలు జరిపారు.
ఇవన్నీ ఆయన ప్రపంచవ్యాప్త వ్యవహారాలు జరపగలరని సూచించాయి. కానీ అంతర్జాతీయ వ్యవస్థలో ప్రబలమైన ప్లేయ ర్‌గా ఉన్న అమెరికా ఆర్థిక, సైనిక బాధ్యతలను ట్రంప్ అసహ్యించుకుంటారు. దానితో వచ్చే ప్రయోజనాలను ఆయన చూడలేరు లేదా ఈ ప్రయోజనాలు లేవని నటిస్తారు. ప్రపంచీకరణ వల్ల, ప్రపంచంలో అమెరికా పాత్ర వల్ల అమెరికన్లు ఉద్యోగాలు కోల్పో యారనీ, అసమానతలు పెరిగాయనీ వాదిస్తారు.
ట్రంప్‌కు జనాదరణ ఉందనేది నిజం. అదే సమయంలో ఆయన ఆధిపత్యం కొనసాగడం లేదన్నదీ నిజమే. ఎన్నికల ఫలితా లను కచ్చితంగా అంచనా వేయడం ఎందుకు కష్టమో దీన్నిబట్టి అర్థమవుతోంది. గుర్తింపు ఆధారిత రాజకీయాలను ఆయన మిత వాదం నుండి స్వీకరించారు. పాత వామపక్షీయుల ఉదారవాద ఆర్థిక శాస్త్రం, విదేశాంగ విధాన విమర్శలనూ స్వీకరించారు.
ట్రంప్‌ను సైద్ధాంతికంగా ఒక వర్గంలోకి చేర్చడం ఎందుకు కష్టమో ఇది వివరిస్తుంది. అమెరికన్లు ఆయన వ్యక్తిత్వాన్ని, విధాన మిశ్ర మాన్ని, దానితో వచ్చే గందరగోళాన్ని ఇష్టపడతారా లేదా అనేది 2024 ఎన్నికలకు సంబంధించిన ప్రధాన ప్రశ్నగా మిగిలిపోయింది.
ప్రశాంత్ ఝా
వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్
(‘ది హిందుస్థాన్ టైమ్స్’ సౌజన్యంతో)