
రాష్ట్ర సమస్యలపై ప్రత్యేక దృష్టి: వెంకయ్య
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్రంలో ఉన్న సమస్యలను గుర్తించి వాటిని ప్రత్యేక ప్రాతిపదికన కేంద్ర ప్రభుత్వం పరిష్కరిస్తుందని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. రాష్ట్రంలోని జాతీయ రహదారులు, విద్యుత్, గృహాలు, రామగుండం ఎరువుల తయారీ పరిశ్రమ పునఃప్రారంభం, నగరాల అభివృద్ధి తదితర అంశాలపై కేంద్రం ప్రత్యేక దృష్టి సారించిందన్నారు.
గుంటూరు సభలో ఏపీ ప్రత్యేక హోదా విషయంలో బీజేపీ, ప్రధాని మోదీలను ఉద్దేశించి రాహుల్ గాంధీ చేసిన విమర్శలపై స్పందిస్తూ... ఇచ్చిన హామీ మేరకు ఏపీకి బీజేపీ ప్రత్యేక హోదా ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నిస్తున్న కాంగ్రెస్.. విభజన చట్టంలో ఈ అంశాన్ని ఎందుకు చేర్చలేదని వెంకయ్య ప్రశ్నించారు. చట్టంలో పొందుపరిచిన అంశాలను పదేళ్లలో అమలు చేయాలని ఉన్నా.. బీజేపీ మాత్రం పలు హామీలను మూడేళ్లలోనే నెరవేర్చిందని, మిగిలిన వాటిని నిర్ణీత కాలవ్యవధిలో పరిష్కరిస్తామని అన్నారు.