అక్కడ మరో తెలుగువాడు!
డేట్‌లైన్ హైదరాబాద్
వెంకయ్యనాయుడు ఉప రాష్ట్రపతి అయితే ఆంధ్రప్రదేశ్ వ్యవహారాలు చక్కదిద్దడానికి బీజేపీలో ఏ రామ్‌మాధవ్ లాంటి వారో తెర మీదకు వస్తారు. మొత్తానికి వెంకయ్యనాయుడు ఉప రాష్ట్రపతి కావడం వల్ల ఆంధ్రప్రదేశ్ బీజేపీలో, తెలుగుదేశం ప్రభుత్వంతో ఆ పార్టీ సంబంధాలలో పెనుమార్పులు రావచ్చునన్నది పరిశీలకుల అంచనా. రాజకీయాలు ఎట్లా ఉన్నా ఒక తెలుగువాడు ముప్పవరపు వెంకయ్యనాయుడు ఉప రాష్ట్రపతి కాబోతున్నందుకు అభినందనలు తెలుపుదాం.
ఉప రాష్ట్రపతి పదవి స్వీకరించడానికి ఎట్టకేలకు ముప్పవరపు వెంకయ్యనాయుడు అంగీకరించారు. నూతన రాష్ట్రపతిగా ఉత్తరాది వారైన రామ్‌నాథ్ కోవింద్ పేరు ఖరారు కాగానే ఉప రాష్ట్రపతి పదవి తప్పని సరిగా దక్షిణాది వారికే దక్కుతుందని అందరూ భావించారు. దక్షిణాది నుంచి రెండు మూడు పేర్లు ప్రచారంలోకి వచ్చినా, చివరికి ఆ పదవి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నెల్లూరు జిల్లాకు చెందిన నాయుడు గారిని వరించింది. భారతదేశంలోని రెండవ అత్యున్నత రాజ్యాంగ పదవి ఉప రాష్ట్రపతి. ఆ పదవిని అధిష్టించే అవకాశం కొద్దిమందికే లభిస్తుంది.
సముచిత స్థానం
చాలాకాలానికి, అంటే డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ తరువాత ఉప రాష్ట్రపతి పదవి లభించిన మొదటి తెలుగువారు వెంకయ్యనాయుడుగారు. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ ఉమ్మడి మద్రాస్ రాష్ట్రానికి చెందిన తెలుగువారు. ఆయన రెండు పర్యాయాలు ఉప రాష్ట్రపతిగా బాధ్యతలు నిర్వహించి, ఆ తరువాత రాష్ట్రపతి కూడా అయ్యారు. దేశంలోని అత్యున్నతమైన రాష్ట్రపతి పదవిని అలంకరించిన తెలుగు ప్రముఖులు మరో ఇద్దరు ఉన్నారు. వారు వరాహగిరి వెంకట గిరి (వీవీ గిరి) నీలం సంజీవరెడ్డి. కాగా మరో తెలుగు ప్రముఖుడు పీవీ నరసింహారావు ప్రధాన మంత్రి పదవిని అలంకరించారు. మరి కొద్దిమంది దక్షిణాదివారు గతంలో ఉపరాష్ట్రపతి బాధ్యతలు నిర్వర్తించినా ప్రస్తుతం తెలుగువారయిన వెంకయ్యనాయుడును ఆ పదవికి బీజేపీ నాయకత్వం ఎంపిక చేయడం గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నది.
ఇది వెంకయ్యనాయుడికి పదోన్నతి అనుకోవాలా, క్రియాశీల రాజకీయాల నుంచి దూరం పెట్టడం కోసం ఆయనకు ఈ పదవి ఇస్తున్నారా అన్నదే ఆ చర్చ సారాంశం. ఉప రాష్ట్రపతి పదవి పట్ల తనకు ఆసక్తి లేదని వెంకయ్యనాయుడు అనేకమార్లు స్పష్టం చేశారు. చివరి నిమిషంలో కూడా ఆయన అదే చెప్పారు. తాను ఉషాపతినే తప్ప ఉప రాష్ట్రపతిని కాబోనని చమత్కరించారు (వెంకయ్యనాయుడు గారి శ్రీమతి పేరు ఉష) కూడా. అయినా ఆయన పార్టీ పార్లమెంటరీ బోర్డు నిర్ణయాన్ని అంగీకరించక తప్పలేదు. బీజేపీలో ఎంతో అనుభవజ్ఞుడు కూడా అయిన వెంకయ్యను ఈ పదవి వరించడం మామూలుగా చూస్తే ఆయన్ను బీజేపీ, దాని మిత్ర పక్షాలు భాగస్వాములుగా ఉన్న ఎన్డీఏ సముచిత రీతిన గౌరవించినట్టే భావించాలి.
విద్యార్థి యువజన విభాగాలు మొదలుకొని పార్టీ జాతీయ అధ్యక్షుడి దాకా అనేక పదవుల్లో పార్టీకి సేవలు అందించిన వెంకయ్యనాయుడు ఆ పార్టీలోని చాలామంది కన్నా సీనియర్ నాయకుడు. ఇప్పుడు ఆయనను ఉప రాష్ట్రపతి పదవికి ఎంపిక చేసిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా కూడా రాజకీయానుభవంలో వెంకయ్యనాయుడి కన్నా చాలా జూనియర్లు. అంతెందుకు, రేపు నూతన రాష్ట్రపతి బాధ్యతలు చేపట్టబోతున్న రామ్‌నాథ్ కోవింద్æ కూడా రాజకీయానుభవంలో, పార్లమెంటరీ వ్యవహారాల అనుభవంలో వెంకయ్యనాయుడు కన్నా జూనియర్. బీజేపీ అగ్రనాయకులు అటల్ బిహారీ వాజపేయి, లాల్ కృష్ణ అద్వాణిలతో కలసి పనిచేసిన అనుభవం ఆయనది. అద్వాణికి అత్యంత సన్నిహితుడిగా ప్రసిద్ధుడు. బీజేపీ రాజకీయాల్లో ట్రబుల్ షూటర్‌గా కూడా ఆయనకు పేరుంది.
ప్రతిభావంతుడు వెంకయ్య
వెంకయ్యనాయుడు రెండు పర్యాయాలు తన సొంత జిల్లా నుంచి శాసనసభకు ఎన్నికయ్యారు. ఆ తరువాత ఎప్పుడూ ఆయన సొంత రాష్ట్రం నుంచి చట్టసభలకు ప్రాతినిధ్యం వహించలేదు. మూడు పర్యాయాలు కర్ణాటక రాష్ట్రం నుంచి, తాజాగా రాజస్తాన్ నుంచి ఆయన రాజ్యసభకు ప్రాతినిధ్యం వహించారు. ఆంధ్రప్రదేశ్ వాస్తవ్యుడు కావడం, దీర్ఘకాలం కర్ణాటక నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఉండటం, తమిళనాడు ఇన్‌చార్జ్‌గా సంక్లిష్ట సమయాల్లో బీజేపీ తరఫున వ్యవహారం చెయ్యడం వంటి అంశాలతో పార్టీ ఆయనను మొత్తం దక్షిణాది ప్రతినిధిగా కూడా పరిగణించడానికి అవకాశం ఇస్తున్నది. సుదీర్ఘకాలంగా ఆయన సేవలు అందిస్తున్న రాజ్యసభకు ఇప్పుడు ఆయనే ఉప రాష్ట్రపతి హోదాలో అధ్యక్షుడిగా వ్యవహరించబోవటం ఒక విశిష్ట అనుభవం. పెద్దల సభ ప్రాధాన్యం ప్రత్యేకమైనది. ఆ సభ నిర్వహించడానికి కావాల్సిన హుందాతనం, అనుభవం, చాకచక్యం, వాక్చాతుర్యం అన్నీ వెంకయ్యనాయుడులో సంపూర్ణంగా ఉన్నాయనడంలో సందేహం లేదు.
ఊపిరాడని స్థితిలో ఏపీ బీజేపీ
ఎందుకో మరి, ఆయన గానీ, ఆయన అనుయాయులూ, మిత్రులు గానీ ఈ పదవి పట్ల అంత సుముఖంగా లేరనిపిస్తుంది. వెంకయ్యనాయుడును ఉప రాష్ట్రపతి పదవికి అభ్యర్థిగా ఎంపిక చేసే విషయంలో ఆ పార్టీ నాయకత్వం ముఖ్యంగా మోదీ, షా ద్వయం బయటికి ఏ కారణాలు చూపుతున్నా అసలు ఆలోచన ఆయనను క్రియాశీలక రాజకీయాల నుంచి దూరంగా ఉంచడానికే అన్నది స్పష్టం. దక్షిణాదిలో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో , మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో మోదీ, అమిత్ షాలు అమలు చేయాలనుకుంటున్న రాజకీయ వ్యూహంలో భాగంగానే వెంకయ్యనాయుడును క్రియాశీలక రాజకీయాల నుంచి తప్పించినట్టు తెలుస్తున్నది. ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీ నాయకత్వం కింది స్థాయి నుంచి పై స్థాయి వరకూ ఒక రకమయిన ఊపిరాడని స్థితిలో ఉన్నది. ఎన్డీఏ భాగస్వామి అయిన తెలుగుదేశం ప్రభుత్వం చేస్తున్న నిర్వాకాలను బహిరంగంగా విమర్శించే స్థితి లేకపోవడానికి వెంకయ్యనాయుడు తెలుగుదేశం పట్ల, దాని అధినేత చంద్రబాబునాయుడు పట్ల అనుసరిస్తున్న సానుకూల వైఖరే కారణమని ఆంధ్రా బీజేపీ నాయకులు అప్పుడప్పుడు మాట్లాడుతున్నారు.
ఇదే విషయం పార్టీ జాతీయ అధ్యక్షుడి దృష్టికి కూడా పలుమార్లు తీసుకువెళ్లినట్టు వార్తలు వచ్చాయి. ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీ స్వతంత్రంగా ఎదగకుండా చెయ్యడం ద్వారా తెలుగుదేశానికి లాభం చెయ్యాలనే ప్రయత్నం జరుగుతున్నదనీ, అందులో భాగంగానే గడువు పూర్తయి ఎంతోకాలం అయినా ఆ రాష్ట్ర బీజేపీకి నూతన అధ్యక్షుడి నియామకం జరగలేదన్న విమర్శ ఉంది. ఉప రాష్ట్రపతి పదవికి వెంకయ్యనాయుడు అభ్యర్థిత్వం ఖరారయిందని వార్తా వెలువడగానే ఆంధ్రప్రదేశ్ బీజేపీకి అధ్యక్షులు కాబోతున్నారంటూ రెండు మూడు పేర్లు అప్పుడే ప్రచారంలోకి వచ్చేశాయి.
మారనున్న ఏపీ రాజకీయ చిత్రం
ఉప రాష్ట్రపతి ఎన్నిక అనంతరం బీజేపీ అధిష్టానం దృష్టి సారించబోయే దక్షిణాదిలో ప్రాధాన్యం ఆంధ్రప్రదేశ్‌కేనని మోదీ, షా సన్నిహితులు ఇప్పటికే చెబుతున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం, బీజేపీల మధ్య రోజురోజుకూ దూరం పెరుగుతున్నది. ఎన్డీఏ రాజకీయాల్లో ఎంతో ముఖ్యుడని చెపుతున్న ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికీ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీకీ మధ్య అఘాతం ఏర్పడిందనీ, దాదాపు సంవత్సరం పైగా చంద్రబాబుకు ప్రధానమంత్రి అపాయింట్‌మెంట్ కూడా దొరకనంత పరిస్థితి ఉందనీ చెబుతున్నారు. నిజానికి వెంకయ్యనాయుడు క్రియాశీలక రాజకీయాలకు దూరం కావడం ఆయనకంటే చంద్రబాబునాయుడుకే ఎక్కువ ఇబ్బంది కలిగించే విషయం.
యునైటెడ్ ఫ్రంట్ కాలంలో కానీ, ఆ తరువాత వాజపేయి హయాంలో కానీ నడిచినట్టుగా మోదీ హయాంలో చంద్రబాబునాయుడి హవా ఢిల్లీలో నడవడం లేదు. ఎన్డీఏలో భాగంగా కేంద్ర క్యాబినెట్‌లో ఉన్న ఇద్దరు మంత్రులలో అశోక్ గజపతిరాజు పెద్దగా రాసుకు పూసుకు తిరిగే వ్యక్తి కాదు. ఆయనది అంతా పెద్దమనిషి తరహా. మరో కేంద్రమంత్రి సుజనా చౌదరి రాజకీయాలకు కొత్త, ఫక్తు వ్యాపారి. ఈ పరిస్థితుల్లో కేంద్రంలో కొండంత అండగా ఉన్న మిత్రుడు వెంకయ్యనాయుడు ఉపరాష్ట్రపతి అయితే ఇక తమ అవసరాలకు కేంద్రం తలుపులు ఎవరు తెరవాలి అన్న, అనుసంధానం ఎవరు చెయ్యాలి అన్న ఆందోళన చంద్రబాబు నాయుడిది. వెంకయ్యనాయుడు ఉప రాష్ట్రపతి అభ్యర్థి కావడాన్ని చంద్రబాబునాయుడు బయటికి అయితే హర్షించారు, ఆహ్వానించారు కానీ, రేపటి నుంచి కేంద్రంలో ఏం జరుగుతుందో కనీసం సమాచారం తెలిపే వాళ్లు కూడా లేకుండా పోయారన్న ఆందోళన ఆయనది. ఎన్డీఏ కన్వీనర్, భాగస్వామి పక్షపు ముఖ్యమంత్రి, అందునా తెలుగు రాష్ట్రాధినేత అయినా చంద్రబాబుకు వెంకయ్యనాయుడు నామినేషన్ కార్యక్రమంలో పాల్గొనమంటూ పిలుపు రాలేదంటేనే అర్ధం అవుతున్నది రేపటి సినిమా.
వెంకయ్యనాయుడు ఉపరాష్ట్రపతి అయితే ఆంధ్రప్రదేశ్ వ్యవహారాలు చక్కదిద్దడానికి బీజేపీలో ఏ రామ్‌మాధవ్ లాంటి వారో తెర మీదకు వస్తారు. మొత్తానికి వెంకయ్యనాయుడు ఉప రాష్ట్రపతి కావడం వల్ల ఆంధ్రప్రదేశ్ బీజేపీలో, తెలుగుదేశం ప్రభుత్వంతో ఆ పార్టీ సంబంధాలలో పెనుమార్పులు రావచ్చునన్నది పరిశీలకుల అంచనా. రాజకీయాలు ఎట్లా ఉన్నా ఒక తెలుగువాడు ముప్పవరపు వెంకయ్యనాయుడు ఉప రాష్ట్రపతి కాబోతున్నందుకు అభినందనలు తెలుపుదాం.
datelinehyderabad@gmail.com
దేవులపల్లి అమర్