రాష్ట్రాభివృద్ధిని మరువను: వెంకయ్య
- బీజేపీని వీడేటప్పుడు అమ్మను పోగొట్టుకున్నంత బాధ కలిగింది
- నెల్లూరులో వెంకయ్యకు ఆత్మీయ అభినందన పౌర సన్మానం
నెల్లూరు(సెంట్రల్): ఉపరాష్ట్రపతి పదవికి తనను అభ్యర్థిగా ప్రకటించిన తరువాత బీజేపీకి రాజీనామా చేయడానికి మనసు అంగీకరించలేదని వెంకయ్యనాయుడు చెప్పారు. పార్టీ తనకు ఎన్నో అవకాశాలు కల్పించిందని, దాంతో అంచెలంచెలుగా ఎదిగానని పేర్కొన్నారు. ఉపరాష్ట్రపతిగా ఎన్నికైన వెంకయ్య నాయుడికి సోమవారం నెల్లూరులో అఖిలపక్షం ఆధ్వర్యంలో ఆత్మీయ అభినందన పౌర సన్మానం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీజేపీకి రాజీనామా చేయాల్సిన సమయంలో తానెంతో బాధపడ్డానన్నారు. అమ్మలాంటి పార్టీని వీడుతున్నప్పుడు అమ్మను పోగొట్టుకున్నంత బాధ కలిగిందంటూ ఉద్వేగంతో కంటతడి పెట్టారు. ఉపరాష్ట్రపతి పదవిలో ఉన్నా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని మరువబోనని స్పష్టం చేశారు.
విభజన వల్ల ఏపీకి అన్యాయం జరిగిందని భావించడం వల్లే రూ.2.36 లక్షల కోట్ల ప్యాకేజీని కేంద్రం నుంచి మంజూరు చేయించానని తెలిపారు. రాజ్యసభ చైర్మన్‌గా ఎగువ సభ ప్రతిష్టను పెంచేందుకు కృషి చేస్తానని వివరించారు. సభా సంప్రదాయాలు.. విలువలను కాపాడతానని, ప్రజల ఆకాంక్షలు, ఆశలకు అనుగుణంగా పనిచేస్తానని వెల్లడించారు. కేంద్ర మంత్రి పదవి నుంచి తప్పుకునేందుకు తాను జంకుతున్నానని మీడియాలో కొందరు వ్యాఖ్యానించారని, ఉప రాష్ట్రపతి పదవి ఏమీ తక్కువ కాదని, ఎన్నో బాధ్యతలు ఉంటాయని వెంకయ్య వ్యాఖ్యానించారు. నెల్లూరు జిల్లాలోని ఉదయగిరి నుంచి రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన వెంకయ్య దేశానికి మరిన్ని కీర్తి ప్రతిష్టలు తెస్తారని నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి అన్నారు.