రథం మీంచి గుళ్లోకి...
ఉపరాష్ట్రపతిగా దీక్ష ఇచ్చి మూల కూచోపెట్టడం ప్రధాని మాస్టర్ టచ్ అంటున్నారు విశ్లేషకులు. బీజేపీ క్యాడర్ సంబరాలు చేసుకుంటోంది. ఇట్లాంటప్పుడు పండంటి గృహస్తుకి బలవంతంగా సన్యాసాశ్రమం ఇప్పిస్తున్నట్టు ఉంటుంది.
ఆయన మంచి మాటకారి. 1973 ప్రాంతాల్లో విశాఖలో విద్యార్థి నాయకుడిగా ఉన్నప్పుడే వెంకయ్యనాయుడు మొనగాడని పేరు తెచ్చుకున్నారు. వ్యంగ్యాస్త్రాలు విసురుతూ సందర్భానికి తగిన పిట్టకథలు వినిపిస్తూ కుర్రకారుని ఆకట్టుకునేవారు. ఇతని దగ్గర పలుకుంది. రాజకీయాల్లోకి వెళ్లి షైనవుతాడని ఆ రోజుల్లో అనుభవజ్ఞులు అనుకునేవారు. పైగా చదివింది లా కాబట్టి, తర్కంతో పాటు వాదనాపటిమ కూడా అబ్బింది. దేశంలో ‘సంపూర్ణ విప్లవం’ సాధించాలంటూ కొత్త నినాదంతో రంగంలోకి దిగిన జయప్రకాశ్ నారాయణ్ ఉద్యమానికి ప్రభావితులైనారు. ఎమర్జన్సీ వచ్చింది. సంపూర్ణ విప్లవం జైలుకి వెళ్లింది. వెంకయ్య కాలం విలువ తెలిసినవారు. నెల్లూరు నేలపైన, గాలిలోన జాతీయతా స్పృహ ఉంది.
వెంకయ్య సమకాలీన రాజకీయ చరిత్రను బాగా స్టడీ చేశారు. ఆకళింపు చేసుకున్నారు. అందుకే ఆయన రాజ కీయ ప్రత్యర్థులను మాటకి మాట వడ్డించి అవలీలగా నెగ్గుకు రాగలిగేవారు. నమ్మిన సిద్ధాంతాల వెంట ఉండాలని నమ్మారు. పార్టీలు మారలేదు. చురుగ్గా ఉన్నాడని వాజపేయి అభిమానించారు. అజాతశత్రువుగా పేరు తెచ్చుకున్నారు. అనేక కీలకమైన దౌత్యాలకు దూతగా వ్యవహరించారు. వెంకయ్య రంగంలోకి దిగితే అవతలివాడు ఎంతటి ‘టఫ్‌నట్’ అయినా మెత్తపడాల్సిందే.
ఇది నిన్న మొన్నటి జీఎస్‌టీ దౌత్యం దాకా నిజం. అందుకే మోదీ కూడా అక్కున చేర్చుకున్నారు. అసలు ఆ రోజుల్లో వెంకయ్య అద్వాణీ మనిషి. ఓసారి అద్వాణీని ‘లోహ్‌పురుష్’గా అభివర్ణిస్తే దాన్ని వాజపేయి పట్టేశారు. ‘ఆప్‌కా లోహ్‌పురుష్’అంటూ అప్పుడప్పుడు వెంకయ్యని ఇబ్బంది పెడుతుండేవారు. అధికార వాచస్పతిగా బాధ్యతలను చక్కగా నిర్వహించి సత్ఫలితాలు రాబట్టారు. పార్లమెంటరీ వ్యవహారాల్లోనూ అన్‌పార్లమెంటరీ వ్యవహారాల్లోనూ మోదీకి అండగా నిలిచారు. ఎప్పుడూ ఆయన మీడియా మిత్రుడే. ఏమీ పట్టనట్టు ఉంటూనే, ఈగ వాలితే అది తెర అయినా పేపరైనా చింపి పోగులు పెట్టేవారు.
తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ గుంటపూలు పూయడానికి వెంకయ్య కృషి ఉందనే అపప్రథ ఉంది. మోదీకి ఈ సంగతి తెలిసినా సరైన సమయం కోసం వేచివున్నాడంటారు. ఉన్నట్టుండి రథంలో ఊరేగుతున్నవాణ్ణి గర్భగుళ్లో కూచోబెట్టిన చందమైంది. ఉపరాష్ట్రపతిగా దీక్ష ఇచ్చి మూల కూచోపెట్టడం ప్రధాని మాస్టర్ టచ్ అంటున్నారు విశ్లేషకులు. బీజేపీ క్యాడర్ సంబరాలు చేసుకుంటోంది. ఇట్లాంటప్పుడు పండంటి గృహస్తుకి బలవంతంగా సన్యాసాశ్రమం ఇప్పిస్తున్నట్టు ఉంటుంది. యజ్ఞోపవీతం నించి మొలతాడు దాకా తీయిస్తారు. కామక్రోధ లోభ మోహ మదమాత్సర్యాలకు స్వస్తి పలుకుతానని చెప్పిస్తారు. ఇప్పుడు వెంకయ్యని పార్టీ భుజకీర్తులు, ఆఖరికి ప్రాథమిక సభ్యత్వంతో సహా వదిలిం పచేస్తుంటే సన్యాస క్రతువే గుర్తొస్తోంది. పాంకోళ్లు , కాషాయం, దండం, కమండలం... అంతా కొత్తకొత్తగా ఉంటుంది. తలలు బోడులైన తలపులు బోడులా? చూద్దాం! శుభాకాంక్షలతో. (వ్యాసకర్త ప్రముఖ కథకుడు)
శ్రీరమణ