పోస్టర్లు అతికించే స్థాయి నుంచి...
న్యూఢిల్లీ: నలభై ఏళ్ల సుదీర్ఘ రాజకీయ అనుభవం.. కమల దళంపై మొక్కవోని విశ్వాసం.. తెలుగు, హిందీ, ఇంగ్లిష్‌లలో చమత్కారాలతో సాగే అనర్గళ సంభాషణ.. వెరసి 68 ఏళ్ల వెంకయ్యనాయుడు. సామాన్య రైతు కుటుంబం నుంచి వచ్చిన ఆయన అంచెలంచెలుగా ఎదిగి ఉపరాష్ట్రపతి పదవికి ఎన్నికయ్యారు. వెంకయ్య ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లా చవటపాలెంలో 1949 జూలై 1న జన్మించారు. తల్లిదండ్రులు రమణమ్మ, రంగయ్య నాయుడు.
వెంకయ్య నెల్లూరు, విశాఖపట్నంలలో పాఠశాల, కాలేజీ విద్య పూర్తి చేశారు. బీఏ, ఎల్‌ఎల్‌బీ పట్టాలు పుచ్చుకున్న ఆయన విద్యార్థి దశ నుంచే రాజకీయాల్లో పాల్గొన్నారు. ఆరెస్సెస్, జన సంఘ్, ఏబీవీపీల్లో పనిచేశారు. 1972 నాటి జైఆంధ్ర ఉద్యమంలో పాల్గొన్నారు.ఎమర్జెన్సీకాలంలో జైలు జీవితం అనుభవించారు. బీజేపీ కార్యకర్తగా అగ్రనేతలు వాజ్‌పేయి, అడ్వాణీల పోస్టర్లు అతికిస్తూ, ఆటోలో మైకు పట్టుకుని ప్రచారం చేశారు. తర్వాత పార్టీలో రాష్ట్ర, జాతీయ స్థాయిల్లో కీలక పదవులు చేపట్టి దక్షిణ భారతంలో కాషాయ దళానికి పెద్ద దిక్కయ్యారు.
చట్టసభల్లో, ఉన్నత పదవుల్లో..
వెంకయ్య 1978లో ఉదయగిరి నుంచి జనతా పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి తొలిసారి ఎమ్మెల్యే అయ్యారు. 1983లో అదే స్థానం నుంచి బీజేపీ తరఫున పోటీ చేసి రెండోసారి గెలిచారు. 1998, 2004, 2010ల్లో వరుసగా మూడుసార్లు కర్ణాటక నుంచి రాజ్యసభకు ఎన్నికైన ఆయన 2016లో రాజస్థాన్ నుంచి రాజ్యసభలో అడుగుపెట్టారు. వాజ్‌పేయి ప్రభుత్వంలో గ్రామీణాభివృద్ధి, మోదీ ప్రభుత్వంలో పట్టణాభివృద్ధి, పార్లమెంటరీ వ్యవహారాలు, సమాచారప్రసారాలు తదితర మంత్రిత్వ శాఖలు నిర్వహించారు. 2002–2004 మధ్య బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా పనిచేసిన వెంకయ్య 2004 సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ ఓటమి తర్వాత ఆ పదవి నుంచి తప్పుకున్నారు. ఒకప్పుడు అడ్వాణీ వర్గంలో ఉన్న ఆయన 2014 సార్వత్రిక ఎన్నికల సమయంలో పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థిగా మోదీవైపు మొగ్గుచూపారు.
ఆయన పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిగా ఉన్నప్పుడే చరిత్రాత్మక రియల్ ఎస్టేట్ బిల్లు ఆమోదం పొందింది. జీఎస్టీ బిల్లులో పురోగతి కనిపించింది. వాజ్‌పేయి హయాంలో ప్రారంభమైన ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజనతోపాటు ఇటీవలి స్మార్ట్ సిటీల పథకం, స్వచ్ఛ భారత్, అందరికీ ఇళ్లు తదితర పథకాలు అమల్లో వెంకయ్య కీలక పాత్ర పోషించారు. 1971లో ఉషను వివాహమాడిన వెంకయ్యకు కుమారుడు హర్షవర్ధన్, కుమార్తె దీపా వెంకట్ ఉన్నారు. 516 ఓట్లు సాధించిన వెంకయ్యనాయుడు 1974 తర్వాత ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో అత్యధిక మెజారిటీ సాధించిన మూడో విజేతగా రికార్డులకెక్కారు. 1992లో జరిగిన ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో కేఆర్ నారాయణన్ చెల్లుబాటైన 701 ఓట్లకు గాను 700 ఓట్లు సాధించారు. ప్రత్యర్థి కాకా జోగీందర్ సింగ్ అలియాస్ ‘ధర్తీపకడ్’కు ఒక ఓటు వచ్చింది. దేశంలో 300 ఎన్నికల్లో పోటీ చేసిన ఓడిన రికార్డు ధర్తీపకడ్ పేరుతోనే ఉండటం మరో విశేషం.