ఉపరాష్ట్రపతిగా తెలుగుతేజం
68 శాతం ఓట్లతో వెంకయ్య ఘన విజయం
► వెంకయ్యకు 516 ఓట్లు.. జీకే గాంధీకి 244 ఓట్లు
► రాజ్యసభ ఔన్నత్యాన్ని కాపాడతా: వెంకయ్య
► తెలుగు రాష్ట్రాల నుంచి 100 శాతం పోలింగ్
సాక్షి ప్రత్యేక ప్రతినిధి, న్యూఢిల్లీ: అనుకున్నట్లుగానే ఎన్డీయే అభ్యర్థి ముప్పవరపు వెంకయ్యనాయుడు (68) భారత ఉపరాష్ట్రపతిగా ఎన్నికయ్యారు. శనివారం జరిగిన ఎన్నికలో 516 ఓట్లతో (68 శాతం) ఘన విజయం సాధించారు. విపక్షాల అభ్యర్థిగా బరిలో దిగిన గోపాలకృష్ణ గాంధీకి 244 ఓట్లు దక్కాయి. 771 ఓట్లు పోలవగా 11 ఓట్లు చెల్లనివిగా తేలాయి. ప్రజాస్వామ్య విలువలు కాపాడటంలో, రాజ్యసభ ఔన్నత్యాన్ని పెంచటంలో చిత్తశుద్ధితో పనిచేస్తానని వెంకయ్య అన్నారు. ఫలితాలు వెలువడిన అనంతరం ప్రధాని మోదీ, బీజేపీ చీఫ్ అమిత్‌షాలు వెంకయ్య ఇంటికెళ్లి అభినందించారు. ఆగస్టు 11న వెంకయ్య ఉపరాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
వెంకయ్యకు 516/760
మొత్తం 785 ఓట్లకుగానూ 14 మంది ఓటింగ్‌లో పాల్గొనలేదు. 760 (98.1 శాతం పోలింగ్‌నమోదు)లో వెంకయ్యకు 516, జీకే గాంధీకి 244 ఓట్లు దక్కాయి. విజయానికి 381 ఓట్లు అవసరమవగా.. వెంకయ్య 516 ఓట్లు గెలుచుకున్నారని రిటర్నింగ్ అధికారి, రాజ్యసభ సెక్రటరీ జనరల్ షంషేర్ షరీఫ్ వెల్లడించారు. ఫలితాలు వెల్లడయ్యాక వెంకయ్యకు ఎన్నిక ధ్రువీకరణ పత్రాన్ని అందజేశారు.
అందరికీ ధన్యవాదాలు: వెంకయ్య
ఉపరాష్ట్రపతి ఎన్నికలో తన విజయానికి సహకరించిన పార్టీలకు వెంకయ్యధన్యవాదాలు తెలిపారు. శనివారం రాత్రి తన నివాసానికి వచ్చి శుభాకాంక్షలు తెలిపిన మోదీ సహా వివిధ పార్టీల నేతలనుద్దేశించి మాట్లాడారు. ‘చాలా సంతోషంగా ఉంది. నా విజయానికి మద్దతు తెలిపిన ప్రధాని మోదీకి, ఇతర పార్టీ ముఖ్య నేతలకు ధన్యవాదాలు.
ఉపరాష్ట్రపతి కార్యాలయం ద్వారా రాజ్యాంగ పరిరక్షణలో రాష్ట్రపతికి చేదోడువాదోడుగా ఉండటంతోపాటుగా ఎగువసభ ఔన్నత్యాన్ని, ప్రజాస్వామ్య విలువలను కాపాడతాను’ అని వెంకయ్య చెప్పారు. సాధారణ రైతు కుటుంబం నుంచి వచ్చిన తాను ఈ స్థాయికి ఎదగడం పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో ఉన్న గొప్పతనమన్నారు. దేశ రాజకీయాల్లో వ్యవసాయానికి సరైన గొంతుక లేదన్నారు. ప్రజాసమస్యల పరిష్కారంలో తన వంతు పాత్ర పోషిస్తానన్నారు.
ఓటింగ్ సరళి ఇలా..
శనివారం పార్లమెంటు హౌజ్‌లోని 63వ నెంబరు గదిలో ఉదయం 10 గంటలకు ప్రధాని మోదీ తొలి ఓటు వేశారు. బీజేపీ అగ్రనేతలు అడ్వాణీ, ఎంఎం జోషి, రాజ్‌నాథ్ సింగ్ ఓటింగ్‌లో పాల్గొన్నారు. రాజ్యసభ సభ్యుడిగా ఉన్న వెంకయ్య కూడా ఓటేశాక.. క్యూలో నిలుచున్న ఎంపీలతో మాట్లాడారు. విపక్ష అభ్యర్థి గోపాలకృష్ణ గాంధీ చాలాసేపు ఓటింగ్ హాల్లోనే ఉన్నారు.
ఓటింగ్ హాల్ బయట కాంగ్రెస్ చీఫ్ సోనియా, ఎంపీలు ఖర్గే, ఆజాద్, అహ్మద్ పటేల్, ఆనంద్ శర్మ, ఎంఏ ఖాన్‌లతో కలిసి సోనియా ఫొటోలు దిగారు. మధ్యాహ్నం ఒంటిగంట వరకే 90 శాతం పోలింగ్ పూర్తయింది. మాజీ ప్రధాని మన్మోహన్ ఒంటరిగానే వచ్చి ఓటేసి వెళ్లిపోయారు. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి అనంత్ కుమార్, సహాయ మంత్రులు ముక్తార్ అబ్బాస్ నఖ్వీ, ఎస్‌ఎస్ అహ్లువాలియాలు.. కేంద్ర మంత్రులు, ఎన్డీయే సీనియర్ నేతలతోపాటు విపక్షంలోని సీనియర్ నేతలకు స్వాగతం పలికారు.
చార్టెడ్ విమానంలో వచ్చిన దేవేందర్ గౌడ్
స్వల్ప అస్వస్థతతో ఆసుపత్రిలో చేరిన కేంద్ర మంత్రులు విజయ్ గోయల్, సన్వర్‌లాల్ జాట్ ఓటింగ్‌కు గైర్హాజరవగా.. టీడీపీ సభ్యుడు టి. దేవేందర్ గౌడ్ హైదరాబాద్ నుంచి చార్టెడ్ విమానంలో ఢిల్లీ చేరుకున్నారు. తెలుగువాడైన వెంకయ్యను గెలిపించేందుకు తెలుగు రాష్ట్రాల నుంచి ఒక్క ఎంపీ కూడా ఈ ఎన్నికకు గైర్హాజరుకాకపోవటం గమనార్హం. వెంకయ్య విజయంతో దేశంలోని తొలి మూడు అత్యున్నత పదవుల్లో (రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధాన మంత్రి) బీజేపీకి చెందినవారుండటం ఇదే తొలిసారి. వెంకయ్య విజయంతో ఆయన సొంతూరు నెల్లూరు జిల్లా చవటపాలెంలో సంబరాలు అంబరాన్నంటాయి.
క్రాస్ ఓటింగ్
ఉపరాష్ట్రపతి ఎన్నికలోనూ పలువురు ఎంపీలు వెంకయ్యకు అనుకూలంగా క్రాస్ ఓటింగ్‌కు పాల్పడినట్లు బీజేపీ వర్గాలు వెల్లడించాయి. బీజేపీ అంచనా ప్రకారం 495 మంది వెంకయ్యకు మద్దతు తెలుపుతారని ఆశించగా 516 ఓట్లు పోలయ్యాయి. గాంధీకి 244 ఓట్లు దక్కగా.. ఇద్దరి మధ్య ఓట్ల అంతరం 272 ఓట్లు. రాష్ట్రపతి ఎన్నికల్లో మీరాకుమార్‌కు 225 మంది ఎంపీలు మద్దతు తెలిపారు.
అయితే ఉపరాష్ట్రపతి ఎన్నికలో మాత్రం విపక్ష అభ్యర్థికి బీజేడీ (28 మంది) జేడీయూ (12మంది) పార్టీలు మద్దతు తెలిపాయి. ఈ లెక్కప్రకారం గాంధీకి కనీసం 40 ఓట్లు ఎక్కువ రావాలి. కానీ అప్పటితోపోలిస్తే 19 ఓట్లే ఎక్కువ రావటంతో విపక్షాల ఐక్యతపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్రపతి ఎన్నికతో పోలిస్తే బీజేపీకి కేవలం ఆరుగురు ఎంపీల సంఖ్య మాత్రమే తగ్గింది. కాగా ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో అత్యధిక పోలింగ్ నమోదవటం ఇదే తొలిసారి.
వెంకయ్యకు మిఠాయి తినిపించిన మోదీ
ఉపరాష్ట్రపతి ఎన్నికలో ఘన విజయం సాధించిన వెంకయ్య నాయుడుకు శుభాకాంక్షలు తెలిపేందుకు ప్రధాన మంత్రి నరేంద్రమోదీ, బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా శనివారం రాత్రి ఢిల్లీలోని వెంకయ్య నివాసానికి విచ్చేశారు. వెంకయ్యకు మోదీ మిఠాయి తినిపించి కండువా కప్పి పుష్పగుచ్ఛం ఇచ్చారు. పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి అనంతకుమార్, బీజేపీ సీనియర్ నేత అడ్వాణీ, కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత మేకపాటి రాజమోహన్ రెడ్డి తదితర రాజకీయ నాయకులు, వందలాది మంది అభిమానులు ఆయన ఇంటికి చేరుకుని శుభాకాంక్షలు చెప్పారు.
గవర్నర్, కేసీఆర్ అభినందనలు
సాక్షి, హైదరాబాద్: నూతన ఉప రాష్ట్రపతిగా ఎన్నికైన వెంకయ్యనాయుడుకు తెలుగు రాష్ట్రాల గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్, తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అభినందనలు తెలిపారు. తెలుగువారైన వెంకయ్యనాయుడు ఉప రాష్ట్రపతిగా ఎన్నికైనందుకు గవర్నర్ శుభాకాంక్షలు తెలిపారు. ఘన విజయం సాధించిన ఆయన ఉపరాష్ట్రపతి పదవికి మరింత వన్నె తెస్తారని కేసీఆర్ పేర్కొన్నారు.
ప్రముఖుల స్పందనలు
మది నిండుగా వెంకయ్య జ్ఞాపకాలు
ఉపరాష్ట్రపతిగా ఎన్నికైన వెంకయ్య నాయుడుకు అభినందనలు. ఆయన పదవీకాలం ఫలవంతంగా, స్ఫూర్తిదాయకంగా ఉండాలని కోరుకుంటున్నాను. దేశానికి ఆయన అంకితభావం, నిబద్ధతతో సేవ చేస్తారన్న నమ్మకం నాకు ఉంది. పార్టీలోనూ, ప్రభుత్వంలోనూ ఆయనతో కలిసి పనిచేసిన కాలంనాటి జ్ఞాపకాలతో నా మది నిండిపోయింది. వెంకయ్యతో అనుబంధాన్ని ఎప్పటికీ గుర్తుంచుకుంటాను.
–ప్రధాని నరేంద్ర మోదీ
ఉపరాష్ట్రపతిగా ఎన్నికై రాజ్యసభ చైర్మన్‌గా వ్యవహరించనున్న వెంకయ్యకు శుభాకాంక్షలు. ఈ పదవిలో ఆయనకు అంతా మంచే జరగాలని కోరుకుంటున్నా. –హమీద్ అన్సారీ, ప్రస్తుత ఉపరాష్ట్రపతి
ప్రభుత్వానికి వివేకంతో కూడిన సలహాలు ఇవ్వడంలో జ్ఞానసముద్రం లాంటి పెద్దల సభను నడిపించే ఉపరాష్ట్రపతి స్థానానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. రాజ్యసభను మరింత బలోపేతం చేయడంలో వెంకయ్యకు మా మద్దతు ఉంటుంది. –సోనియాగాంధీ, కాంగ్రెస్ అధ్యక్షురాలు
విజయం సాధించిన వెంకయ్యనాయుడుకు అభినందనలు. ఉపరాష్ట్రపతిగా ఆయనకు అంతా మంచే జరగాలని కాంక్షిస్తున్నా. అలాగే నాకు ఓట్లేసిన సభ్యులందరికీ ధన్యవాదాలు. నేను ఊహించినదానికన్నా ఎక్కువ ఓట్లే వచ్చాయి. భారత్‌లో ఉండే బహుళత్వం, లౌకికత్వం, భావప్రకటనా స్వేచ్ఛలకు నాకు వచ్చిన ఓట్లే రుజువులు. –గోపాలక్రిష్ణ గాంధీ, విపక్షాల ఉపరాష్ట్రపతి అభ్యర్థి
వెంకయ్య నాయుడుకు అభినందనలు. ఆయనకు మా పార్టీ పూర్తి మద్దతు ఇచ్చింది. రాజ్యసభ అధ్యక్షుడి స్థానంలో ఒక తెలుగు వ్యక్తి ఉండటం మనందరికీ గర్వకారణం. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, చట్టసభల్లో స్పీకర్ వంటి అత్యున్నత పదవులకు ఎన్నిక ఎప్పడూ ఏకగ్రీవం కావాలనేది మా పార్టీ అభిమతం. –వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు