
ఏకాభిప్రాయంతోనే బీసీ రిజర్వేషన్లు
ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు
సాక్షి, హైదరాబాద్: అన్ని పార్టీల ఏకాభిప్రాయంతోనే చట్ట సభల్లో బీసీలకు రిజర్వేషన్లు సాధ్యమని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. ఆదివారం టీడీపీ ఎమ్మెల్యే, బీసీ సంక్షేమ సంఘం నేత ఆర్.కృష్ణయ్య నేతృత్వంలో బీసీ సంక్షేమ సంఘ ప్రతినిధుల బృందం వెంకయ్యనాయుడును కలసి బీసీల సమస్యలపై వినతిపత్రం సమర్పించింది. ఈసందర్భంగా చట్ట సభల్లో బీసీలకు 50% రిజర్వేషన్లు కల్పించాలని ఆ సంఘం నేతలు డిమాండ్ చేశారు.
బీసీలకు కూడా అట్రాసిటీ యాక్టును తీసుకురావాలని, ఉద్యోగాల భర్తీలో క్రీమీలేయర్‌ను ఎత్తివేయాలని కోరారు. ఈ డిమాండ్లపై వెంకయ్యనాయుడు స్పందిస్తూ...జాతీయ బీసీ కమిషన్‌కు రాజ్యాంగబద్ధ హోదా ఇవ్వాలని నిర్ణయించిందని ఈమేరకు పార్లమెంటు సమావేశాల్లో బిల్లు పాసవుతుందన్నారు. చట్ట సభల్లో బీసీ రిజర్వేషన్లపై రాజకీయ పార్టీల నుంచి ఏకాభిప్రాయం కోసం త్వరలో కార్యాచరణ సిద్ధం చేస్తామని ఉపరాష్ట్రపతి హామీ ఇచ్చినట్లు బీసీ సంక్షేమ సంఘం ప్రతినిధులు తెలిపారు.