
న్యూఢిల్లీ: రాజ్యసభ సమావేశాల్లో చివరి రోజున సాధారణంగా సభ్యుల హాజరు శాతం తక్కువగా ఉంటున్నందున రాజకీయ పార్టీలు విప్‌లు జారీ చేయడం మంచిదేనని రాజ్యసభ చైర్మన్ ఎం.వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. సమావేశాలు జరిగినన్ని రోజులు కూడా రాజకీయ పక్షాలు ఇలాగే విప్‌లు జారీ చేస్తే సభ సభ్యులతో కళకళలాడుతుందన్నారు. అధికార బీజేపీ సహా, ఇతర పార్టీలు తమ సభ్యులకు మంగళవారం విప్‌లు జారీ చేయడంపై సభలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
బడ్జెట్‌పై చర్చ జరిగే సమయంలో సభలో సభ్యులు తక్కువగా ఉంటే ప్రజల్లో తప్పుడు సంకేతాలు వెళతాయన్నారు. ఎంతో కీలకమైన బడ్జెట్‌పై పార్లమెంట్ సభ్యులకు ఆసక్తి లేదని భావించే ప్రమాదముందన్నారు. ఆఖరి రోజున రాజ్యసభలో బడ్జెట్‌పై చర్చ జరిగింది. జనవరి 31వ తేదీన ప్రారంభమైన పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మంగళవారంతో మొదటి విడత ముగిశాయి. తిరిగి మార్చి 2వ తేదీన మొదలై ఏప్రిల్ 2వ తేదీ వరకు జరగనున్నాయి. మంగళవారం సమావేశానికి సభ్యులంతా హాజరుకావాలంటూ అధికార బీజేపీ విప్ జారీ చేయడంతో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోనుందంటూ ఊహాగానాలు వెలువడ్డాయి.