సాక్షి, విజయవాడ: టీడీపీ హయాంలో విజయవాడలోని కనకదుర్గ గుడితోపాటు మరో ఆరు దేవాలయాల్లో పారిశుధ్య పనుల కాంట్రాక్టును అత్యధిక ధరలకు దక్కించుకున్న సంస్థ దీన్ని మరి కొన్నేళ్లు పొడిగించుకునేందుకు ముమ్మరంగా ప్రయత్నాలు సాగిస్తోంది. ఈ సంస్థకు టెండర్ కొనసాగించడం దేవస్థానానికి భారంగా మారుతుందని సిబ్బంది పేర్కొంటున్నారు.
లోకేష్ బంధువు సంస్ధ....
మాజీ మంత్రి నారా లోకేష్‌కు బంధువైన తిరుపతికి చెందిన భాస్కరనాయుడు ఆధ్వర్యంలోని పద్మావతి హాస్పిటాలిటీస్ అండ్ ఫెసిలిటీస్ మేనేజ్‌మెంట్ సర్వీసెస్ పలు దేవాలయాల్లో పారిశుధ్య పనులను నిర్వహిస్తోంది. గతంలో టీటీడీలో స్వీపింగ్, క్లీనింగ్ కాంట్రాక్టు పనులను దక్కించుకున్న ఈ సంస్థ తీరు వివాదాస్పదం కావడంతో పక్కనపెట్టారు. అయితే టీడీపీ పెద్దల ఒత్తిడితో రాష్ట్రంలోని ప్రధాన దేవాలయాలైన ద్వారకా తిరుమల, అన్నవరం, సింహాచలం, శ్రీశైలం, శ్రీకాళహస్తి, పెనుగంచిప్రోలు తిరుపతమ్మ దేవాలయం తదితర చోట్ల స్వీపింగ్, క్లీనింగ్ పనులను ఇదే సంస్థకు కట్టబెట్టారు. ఎలాంటి టెండర్లు లేకుండానే అప్పటి దేవాదాయ శాఖ కమిషనర్ మూడేళ్ల పాటు ఈ పనులను కాంట్రాక్టుపై అప్పగించడం గమనార్హం. 2018లో మరో ఏడాది పాటు దీన్ని పొడిగించారు. ఈ ఏడాది ఆగస్టుతో కాంట్రాక్టు గడువు ముగియనుంది.
దేవస్థానంపై అదనపు భారం...
2015 వరకు దుర్గగుడిలో పారిశుద్ధ్య పనులకు స్థానికంగా దేవస్థానం అధికారులే టెండర్ పిలిచి అర్హత కలిగిన సంస్థకు అప్పగించేవారు. సిబ్బందిని కాంట్రాక్టు పద్ధతిలో నియమించి స్వీపింగ్, క్లీనింగ్ మెటీరియల్‌ను దేవస్థానమే కొనుగోలు చేసి నిర్వహణ బాధ్యతలు పర్యవేక్షించింది. ఇందుకోసం నెలకు రూ.25 లక్షల వరకు దేవస్థానానికి ఖర్చు అయ్యేది. టీడీపీ పాలనలో లోకేష్ సిఫారసుతో పద్మావతి సంస్థకు నెలకు రూ. 33 లక్షల చొప్పున కాంట్రాక్టుపై ఇచ్చారు. దీంతో దుర్గగుడి దేవస్థానంపై ఏడాదికి అదనంగా రూ.96 లక్షల వరకు భారం పడింది. గత నాలుగేళ్లుగా ఈ కాంట్రాక్టు కొనసాగింది. అయితే పారిశుధ్య పనులను నిర్ణీత ప్రమాణాల మేరకు నిర్వహించడంలో కాంట్రాక్టు సంస్థ విఫలమైంది. మరోవైపు పద్మావతి సంస్థలో పనిచేసే సిబ్బందికి సకాలంలో జీతాలు కూడా చెల్లించడం లేదు.
‘పద్మావతి’ పైరవీలు
మరో మూడేళ్లు తమనే కొనసాగించాలని పద్మావతి సంస్థ ప్రతినిధులు దేవదాయశాఖ ఉన్నతాధికారుల వద్ద పైరవీలు చేస్తున్నట్లు తెలిసింది. వీలైనంత త్వరగా టెండర్ ఖరారు చేయించుకునే ప్రయత్నాల్లో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. దుర్గగుడి టెండర్ ఖరారు అయితే మిగిలిన దేవాలయాల్లో కూడా పొడిగించుకోవచ్చని భావిస్తున్నారు. అయితే ఈ సంస్థను పక్కన పెట్టి ఈ టెండర్లు ద్వారా తక్కువ రేటుకు పారిశుధ్య పనులు నిర్వహించే సంస్థకు పనులు అప్పగించాలని పలువురు అధికారులు సూచిస్తున్నారు.
గుడులను ‘ఊడ్చే’ గుత్తేదార్!
Published Tue, Jun 4 2019 5:04 AM | Last Updated on Tue, Jun 4 2019 5:04 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment