దసరా ఉత్సవాల సందర్భంగా విజయవాడ కనకదుర్గమ్మకు ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు తీసుకెళ్తున్న సీఎం వైఎస్ జగన్
ఇంద్రకీలాద్రి (విజయవాడ పశ్చిమ): ఇంద్రకీలాద్రిపై వెలసిన దుర్గమ్మ వారికి దసరా ఉత్సవాల సందర్భంగా బుధవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం తరఫున పట్టు వ్రస్తాలు సమరి్పంచారు. సంప్రదాయ పంచకట్టు వస్త్ర ధారణలో ఆలయానికి చేరుకున్న సీఎం జగన్‌కు అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఆలయ ప్రాంగణంలోని గాలిగోపురం వద్ద సీఎం తలకు స్థానాచార్య విష్ణుభట్ల శివప్రసాద్ శర్మ పరివట్టం చుట్టారు. పట్టు వ్రస్తాలున్న పళ్లెంను తలపై పెట్టుకుని అమ్మవారి సన్నిధికి చేరుకున్న సీఎం.. వాటిని సమర్పించి, ప్రత్యేక పూజలు జరిపించుకున్నారు. అనంతరం ఆలయ అర్చకులు ఆశీర్వచనం చేసి, ప్రసాదాలు అందజేశారు. పాలక మండలి, అధికారులు దేవస్థానం తరఫున అమ్మవారి చిత్రపటం అందజేశారు. శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం 2021 నూతన సంవత్సర క్యాలండర్‌ను సీఎం ఆవిష్కరించారు. అంతకు ముందు ఘాట్ రోడ్డు మార్గంలో ఆలయం వద్దకు చేరుకున్న సీఎం జగన్‌కు దేవదాయ శాఖ కార్యదర్శి ఎం.గిరిజాశంకర్, ప్రత్యేక కమిషనర్ పి.అర్జునరావు, పాలక మండలి చైర్మన్ పైలా సోమినాయుడు, ఈవో సురేష్ బాబు తదితరులు ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో మంత్రి కొడాలి నాని, రాజ్యసభ సభ్యులు మోపిదేవి, ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, వల్లభనేని వంశీ, జోగి రమేష్, కొలుసు పార్థసారథి, వసంత వెంకట కృష్ణప్రసాద్ పాల్గొన్నారు. కాగా, అమ్మవారి జన్మ నక్షత్రమైన మూలా నక్షత్రంలో భాగంగా సరస్వతీదేవిగా అలంకరింపబడిన దుర్గమ్మను సీఎం వైఎస్ జగన్ దర్శించుకున్నారు.
ఆ నిధులతో మెరుగైన సౌకర్యాల కల్పన
► విజయవాడ కనకదుర్గ ఆలయాన్ని రూ.70 కోట్ల ప్రభుత్వ నిధులతో అభివృద్ధి చేయటానికి సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆమోదం తెలిపారని ఆలయ చైర్మన్ పైలా సోమినాయుడు చెప్పారు. బుధవారం సీఎం జగన్ అమ్మవారి దర్శనానంతరం చైర్మన్ మీడియాతో మాట్లాడారు.
► ఆలయ ప్రాంగణంలో అభివృద్ధి పనులకు సంబంధించి మాస్టర్ ప్లాన్‌లో రూపొందించిన పలు అంశాలను సీఎం దృష్టికి తీసుకెళ్లగా వెంటనే ఆమోదం తెలిపారన్నారు.
► కొండ చరియలను పటిష్ట పరచడం, నిత్యాన్నదానం వంటశాల, ప్రసాదాల తయారీ భవనం, కేశఖండనశాల భవనం, సోలార్ విద్యుత్ ఏర్పాటు తదితర నిర్మాణాలకు ఈ నిధులను వెచ్చిస్తామని తెలిపారు.
► ఆలయ అభివృద్ధికి, అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులకు మెరుగైన సదుపాయాల కల్పనకు ముఖ్యమంత్రి తక్షణం స్పందించి ఆమోదం తెలపడం పట్ల దేవస్థానం పాలకవర్గం కృతజ్ఞతలు తెలుపుతోందన్నారు. నిధుల కేటాయింపునకు సంబంధించిన ఆదేశాలు అధికారికంగా వెలువడనున్నాయని చెప్పారు.
ఇదే తొలిసారి
► రాష్ట్ర చరిత్రలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా సీఎం జగన్ దుర్గ గుడి అభివృద్ధికి రూ.70 కోట్లు మంజూరు చేయడం పట్ల దేవదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు ధన్యవాదాలు తెలియజేశారు. దేవాలయాల అభివృద్ధి పట్ల సీఎం జగన్‌మోహన్‌రెడ్డి చిత్తశుద్ధికి ఇది నిదర్శనమని పేర్కొన్నారు. ఈ మేరకు మంత్రి కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది.
► దుర్గగుడి అభివృద్ధికి ప్రభుత్వం నుంచి నిధులు కేటాయించడం ఇదే తొలిసారి. గత ప్రభుత్వాలు భక్తులు సమరి్పంచిన కానుకలతోనే ఆలయ అభివృద్ధి పనులు చేయించేవి. అమ్మవారి ఆలయ ఫిక్స్‌డ్ డిపాజిట్లు డ్రా చేసి నిర్మాణాలు చేశారే తప్ప ఇప్పటి వరకు ప్రభుత్వ నిధులు వెచ్చించలేదు. సీఎం నిర్ణయం పట్ల భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment