ఫైల్ ఫోటో
సాక్షి ప్రతినిధి, విజయవాడ: శరన్నవరాత్రి మహోత్సవాల్లో మూలానక్షత్రం సందర్భంగా మంగళవారం విజయవాడ కనకదుర్గమ్మకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలను, పసుపు, కుంకుమలను సమర్పించనున్నారు. సోమవారం ఉదయం దేవదాయశాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్ అమ్మవారిని దర్శించుకుని, సీఎం పర్యటన ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం సీఎం పర్యటన ఏర్పాట్లను కలెక్టర్ జె.నివాస్, మేయర్ రాయన భాగ్యలక్ష్మి, నగర పోలీస్ కమిషనర్ బత్తిన శ్రీనివాసులు, ఆలయ చైర్మన్ పైలా సోమినాయుడు, ఈవో భ్రమరాంబ పరిశీలించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు ఇంద్రకీలాద్రికి చేరుకుంటారని చెప్పారు. అంతరాలయంలో అమ్మవారిని దర్శించుకుని పట్టువస్త్రాలు సమర్పిస్తారన్నారు. అనంతరం వేదపండితులు ఆయన్ని ఆశీర్వదిస్తారని తెలిపారు. పోలీస్ కమిషనర్ శ్రీనివాసులు మాట్లాడుతూ మూలానక్షత్రం సందర్భంగా అమ్మవారి దర్శనానికి ఎక్కువమంది భక్తులు వచ్చే అవకాశం ఉందని, అందుకు అనుగుణంగా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.
ఆగ్మెంటెడ్ రియాల్టీ షోను ప్రారంభించనున్న ముఖ్యమంత్రి
అమ్మవారి చరిత్రను తెలిపే ఆగ్మెంటెడ్ రియాల్టీ షోను ముఖ్యమంత్రి జగన్ మంగళవారం ప్రారంభించనున్నారు. దుర్గగుడి అధికారులు సరికొత్త టెక్నాలజీతో ఇంద్రకీలాద్రిపై ఘాట్‌రోడ్డు, చినరాజగోపురం, మల్లేశ్వరస్వామి దేవస్థానాల వద్ద చరిత్ర చెప్పే క్యూఆర్ కోడ్ ఉన్న బోర్డులు ఏర్పాటు చేశారు. ‘కనకదుర్గ ఏఆర్’ అనే యాప్ డౌన్‌లోడ్ చేసి బోర్డుపై కోడ్ స్కాన్ చేస్తే అమ్మవారి చరిత్ర, ఆడియా, వీడియో ద్వారా విని, చూసే అవకాశం ఉందని ఆలయ ఈఈ భాస్కర్ తెలిపారు. సినిమా మాదిరి బొమ్మలు, మ్యూజిక్ ప్రత్యేకంగా ఉంటాయన్నారు. ఇది చిన్న పిల్లలకు వినోదాత్మకంగా కూడా ఉంటుందని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment