
గుడులు కూల్చి.. మాన్యాలు మింగుతూ
ఆపై ముఖ్యమంత్రి ఎదురుదాడి
♦ సదావర్తి కుంభకోణంలో అడ్డంగా దొరికిపోయినా బెదిరింపులు
♦ సాక్ష్యాలతో సహా బైటపెట్టడమే ‘సాక్షి’ నేరమట..
♦ పత్రికలకు, పబ్లిషర్లకు నోటీసులిస్తామని హెచ్చరిక
సాక్షి ప్రత్యేక ప్రతినిధి: ఎంతవారికైనా దైవభీతి ఉంటుంది. దేవుడికి అన్యాయం కాదు కదా కనీసం అపచారం కూడా చేయడానికి భయపడతారు. కానీ విచ్చలవిడి అవినీతిలో విశ్వరూపం చూపిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు అలాంటి పట్టింపులేవీ లేనట్లు కనిపిస్తోంది. ఒకవైపు గుడులను కూల్చివేయిస్తున్నారు. కృష్ణాపుష్కరాల పేరుతో ఆలయాల విధ్వంసం జరిపించారు. అన్నివైపుల నుంచి ఆగ్రహావేశాలు వ్యక్తం కావడంతో కాస్త ఉపశమించారు. అదే సమయంలో గుడి మాన్యాలను కొల్లగొడుతున్నారు. వెయ్యికోట్ల విలువైన సదావర్తి సత్రం భూములను తమ్ముళ్లతో కలసి హాంఫట్ స్వాహా చేసేశారు. రూ.1,084 కోట్ల విలువైన 83 ఎకరాల సత్రం భూములను రూ.22 కోట్ల కారుచౌక రేటుకు కొట్టేశారు.
ఈ కుంభకోణాన్ని ససాక్ష్యంగా ‘సాక్షి’ బైటపెట్టింది. వైఎస్సార్సీపీ, కాంగ్రెస్, సీపీఐ నిజనిర్ధారణ బృందాలు ఆ ప్రాంతాలలో పర్యటించి తప్పు జరిగినట్లు నిర్ధారించాయి. ఎకరా భూమి విలువ రూ.6 కోట్లు పలుకుతున్నట్లు సాక్షాత్తూ దేవాదాయశాఖ జాయింట్ కమిషనర్ నివేదించినా ప్రభుత్వం పట్టించుకోకుండా పప్పుబెల్లాలకు వేలం వేసేసినట్లు సాక్ష్యాధారాలతో సహా బైటపడింది. రూ. 1,058 కోట్ల మేర ప్రజాధనాన్ని పథకం ప్రకారం లూటీ చేసేసిన సంగతి ప్రపంచానికి తెలిసిపోయింది. ఇంత జరిగినా ముఖ్యమంత్రి వైఖరిలో వీసమెత్తు మార్పు లేదు. తప్పు చేసినందుకు తలదించుకోవలసింది పోయి దానిని బైటపెట్టినవారిపై బెదిరింపులకు దిగుతున్నారు. ఇప్పటికే అనేకరకాలుగా ‘సాక్షి’పై కక్షసాధింపు సాగుతోంది. సదావర్తి వ్యవహారంలో లీగల్ నోటీసులూ అందుతున్నాయి. ఎన్నో నిర్బంధాలను తట్టుకున్న ‘సాక్షి’కి ఇవేవీ కొత్త కాదు. ప్రజల పక్షాన వాస్తవాలను వెల్లడించడం, తప్పు జరిగితే నిలదీయడం వంటివి కొనసాగిస్తూనే ఉంటుంది. సదావర్తి భూముల విషయంలో ప్రభుత్వం నిబంధనల మేరకు నడుచుకోలేదని, ‘బాబు’లంతా పథకం ప్రకారం భూములు కొల్లగొట్టారని బైటపెట్టడం అందులో భాగమే... ముఖ్యమంత్రి బెదిరింపుల నేపథ్యంలో సదావర్తి కుంభకోణం జరిగిన తీరును.. అందులో జవాబులేని ప్రశ్నలను పరిశీలిద్దాం...
ఇదీ కుంభకోణం..
అమరావతిలోని అమరేశ్వరాలయానికి చెందిన ‘శ్రీ సదావర్తి సత్రం’ భూములు కబ్జాకు గురవుతున్నాయని గుంటూరు జిల్లా పెదకూరపాడు ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్ ముఖ్యమంత్రి కార్యాలయానికి లేఖరాయడం, ఆ భూమిని విక్రయించాలని ప్రతిపాదించడం, దానికి సీఎం కార్యాలయం ఆగమేఘాలపై అనుమతించడం అంతా పథకం ప్రకారం జరిగింది. ఆ వెంటనే కాపు కార్పొరేషన్ చైర్మన్ చలమలశెట్టి రామానుజయ కుటుంబసభ్యులు, మరో ఆరుగురు కలిసి ఆ భూములను వేలంలో కొనుగోలు చేశారు. చెన్నై సమీపంలోని తాలంబూరు ప్రాంతంలో ప్రభుత్వ ధరల ప్రకారమే ఎకరా భూమి రూ.6 కోట్లు ఉంది.
అక్కడ ప్రైవేట్ రియల్‌ఎస్టేట్ సంస్థలు వేసిన వెంచర్లలో 200 చదరపు గజాల ఇంటిస్థలం రూ. 55 లక్షలు పలుకుతోంది. అంటే బహిరంగ మార్కెట్‌లో సదావర్తి భూముల ధర ఎకరా రూ. 13 కోట్లు వరకు ఉంటుంది. అయితే సత్రం ఈవో ఎకరా కేవలం రూ.50 లక్షల చొప్పున అమ్మకానికి ప్రతిపాదించారు. దేవాదాయ శాఖ అధికారులు వెంటనే ఆమోదం తెలిపారు. ఆ తర్వాత ఆ ధరను మరింత తగ్గించారు. ఎకరా రూ.27 లక్షల చొప్పున 83.11 ఎకరాలను రూ. 22.44 కోట్లకు కట్టబెట్టారు. అంటే రూ. 1,080.43 కోట్లు విలువ చేసే భూమిని కేవలం రూ. 22.44 కోట్లకు కట్టబెట్టేశారన్నమాట. సర్కారు ఖజానాకు రూ. 1,058 కోట్లు నష్టం చేకూర్చారన్నమాట.
ఈ ప్రశ్నలకు బదులేది?
► సదావర్తి భూములు ఎకరం రూ.6 కోట్లు విలువ చేస్తాయని తన పరిశీలనలో తేలిందని, భూముల అమ్మకంపై నిర్ణయం తీసుకునే ముందు ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకోవాలని దేవాదాయ శాఖ జాయింట్ కమిషనర్ భ్రమరాంబ నివేదించారా లేదా? ఆ లేఖను ఎందుకు పరిగణనలోకి తీసుకోలేదు?
► సదావర్తి భూముల సమీపంలో సత్యభామ యూనివర్సిటీ, హిందుస్థాన్ యూనివర్సిటీ, టీసీఎస్ సహా పలు ఐటీ సంస్థలు, స్టార్ హోటళ్లు, భారీ అపార్ట్‌మెంట్లు, రిసార్టులు, గేటెడ్‌కమ్యూనిటీలు ఉన్న మాట వాస్తవం కాదా?అలాంటపుడు అవి విలువైన భూములని ప్రభుత్వానికి ఎందుకు అనిపించలేదు?
► సదావర్తి భూములు ఆక్రమణలో లేవని, ఆ భూముల చుట్టూ చక్కగా కంచె వేసి ఉన్నదని ప్రతిపక్ష పార్టీలైన వైఎస్సార్సీపీ, కాంగ్రెస్, సీపీఐ నిజనిర్ధారణ బృందాల పరిశీలనలో తేలిన మాట వాస్తవం కాదా?
► అసలు ఎక్కడైనా ప్రభుత్వ భూములు ఆక్రమణకు గురైతే చట్టపరమైన చర్యలు తీసుకుంటారా? లేక పప్పు బెల్లాలకు విక్రయించేస్తారా?
► ప్రభుత్వ భూమి కబ్జా అవుతుంటే బాధ్యత గలిగిన ఓ ఎమ్మెల్యే ఆ భూమిని రక్షించాలని ప్రభుత్వాన్ని అభ్యర్థిం చాలి. ఎవరైనా చేసేదదే. కానీ కొమ్మాలపాటి శ్రీధర్ మా త్రం అమ్మేయాలని ప్రభుత్వానికి సూచించడంలోని మతలబేమిటి? ఆయన సూచనకు సీఎం కార్యాలయం వెంటనే స్పందించడం, నెల తిరక్కుండానే దేవాదాయశాఖకు ఉత్తర్వులిచ్చేయడం వెనక గూడుపుఠాణీ జరగలేదంటారా?
► భూముల వాస్తవ ధర ఎంత ఉందో తెలిసినా సదావర్తి భూములను చౌకగా విక్రయించడానికి అనుమతి ఇచ్చినట్లు రాష్ర్టప్రభుత్వం తరఫున దేవాదాయ శాఖ మంత్రి పి.మాణిక్యాలరావు వివరణ ఇవ్వలేదా? సదావర్తి సత్రం భూముల ప్రభుత్వ రిజిస్ట్రేషన్ విలువ చదరపు అడుగుకు రూ. 1,700 చొప్పున ఎకరాకు రూ. 6 కోట్ల వరకు ధర ఉన్నట్లు ప్రభుత్వానికి తెలుసని దేవాదాయ శాఖ మంత్రి ఇచ్చిన వివరణ పరిశీలిస్తే ఇందులో కుంభకోణం జరిగినట్లు అర్ధం కావడం లేదా?
► ఆక్రమణలో ఉన్నాయి కాబట్టి వేలంలో ఎకరా రూ.50 లక్షలు బేసిక్ ధరగా నిర్ణయించినట్లు చెబుతున్న ప్రభుత్వం వేలం పాట సమయంలో అప్పటికప్పుడు ఎకరం ధరను రూ. 27 లక్షలకు ఎందుకు తగ్గించి అమ్మాల్సి వచ్చింది?
► విజయవాడ దుర్గగుడి వద్ద ఈ ఏడాది చెప్పుల షాపు నిర్వహణకు ప్రభుత్వం వేలం నిర్వహించింది. గతేడాది కన్నా రూ. 2 లక్షలు తక్కువకు పాట వచ్చిందని ఆ వేలాన్ని రెండుసార్లు వాయిదా వేసింది. 3వసారి వేలం నిర్వహించి అనుమతి తెలిపింది. అలాంటిది రూ. 1,084 కోట్ల విలువైన భూముల వేలంలో రాష్ర్టప్రభుత్వం ఎందుకు జాగ్రత్తలు తీసుకోలేదు?
► రాష్ర్టంలో ఏ గుడి అధీనంలోని దుకాణాన్నైనా అద్దెకు ఇవ్వాలంటే దేవాదాయ శాఖ ఈ - టెండర్ విధానాన్ని అమలు చేస్తోంది. సదావర్తి భూముల విక్రయానికి మాత్రం ఈ టెండర్‌ను పిలవకుండా బహిరంగ వేలం నిర్వహించింది. ఈ బహిరంగ వేలం గురించి కూడా అధికార పార్టీ నేతలు మినహా ఇతరులెవరికీ తెలియకుండా జాగ్రత్త పడడం వెనక మతలబేమిటి?
► సదావర్తి భూముల వ్యవహారంలో సమగ్ర సమాచారాన్ని తెప్పించుకున్న దేవాదాయశాఖ ముఖ్య కార్యదర్శి జేఎస్వీ ప్రసాద్ దానికి తన అభిప్రాయాన్ని జతపరిచి ముఖ్యమంత్రి కార్యాలయానికి పంపారు. సదావర్తి భూముల వేలం వ్యవహారంలో కనీస నిబంధనలు కూడా పాటించలేదని, ఆ వేలం ను రద్దు చేయాలని ప్రసాద్ సూచించినట్లు సమాచారం. వాస్తవ పరిస్థితికి అద్దం పడుతున్న ఆ నివేదికపై నిర్ణయం తీసుకోకుండా ముఖ్యమంత్రి జాప్యం చేయడం వెనక ఉన్న మర్మమేమిటి?