‘సాక్షాత్తూ దేవుడి భూముల్లోనే కుంభకోణం’
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో జరుగుతోన్న భూ దోపిడీలకు చెన్నైలో జరిగిన సదావర్తి భూముల వేలమే నిదర్శనమని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. చంద్రబాబు సర్కార్ దేవుడి భూములను సైతం కొల్లగొడుతోందని ఆయన విమర్శించారు.
వైవీ సుబ్బారెడ్డి మంగళవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ‘సాక్షాత్తూ దేవుడు భూముల్లోనే కుంభకోణం జరిగింది. చంద్రబాబు చేసిన భూ కుంభకోణాల్లో సదావర్తి భూముల వ్యవహారం ఓ మచ్చతునక. సదావర్తి భూముల అడ్డగోలు వేలానికి చంద్రబాబుదే బాధ్యత. రాష్ట్ర ప్రభుత్వానికి మూడు రెట్లు లాభం వచ్చేలా వేలం జరిగింది. అన్ని భూ దోపిడీలపై సమగ్ర విచారణ జరపాలి.
ఇప్పుడు సాక్షాత్తూ అమరేశ్వరుడి భూములకే ఎసరు పెట్టారు. భూముల దోపిడీ జరిగిందానికి నిన్న జరిగిన వేలమే నిదర్శనం. ఎస్సీ, మైనార్టీ పేదల భూములను ప్రభుత్వం లాక్కుంది. ప్రజలు, దేవుడి ఆస్తులను ప్రభుత్వం మింగేస్తోంది. టీడీపీ పాలనలో కొనసాగుతున్న భూ కుంభకోణాలను ప్రజలు గుర్తించాలి. ఇప్పటివరకు జరిగిన భూ దోపిడీలపై సమగ్ర విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. భూ బాధితులందరికీ వైఎస్‌ఆర్ సీపీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.