
సదావర్తి భూములపై సీబీఐ విచారణ జరపాలి: ఆర్కే
సాక్షి, హైదరాబాద్ : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు చిత్తశుద్ధి ఉంటే సదావర్తి సత్రం భూముల కుంభకోణంపై సీబీఐ విచారణకు ఆదేశించాలని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి డిమాండ్ చేశారు. ఆయన గురువారం పార్టీ కేంద్ర కార్యాలయంలో మాట్లాడారు. పేద బ్రాహ్మణుల వేద విద్య కోసం సదావర్తి భూములను రాజా వాసిరెడ్డి వారసులు రాసిచ్చారన్నారు. అవి బ్రాహ్మణ భూములు అని, ప్రభుత్వ భూములు కాదని ఎమ్మెల్యే ఆర్కే వ్యాఖ్యానించారు.
పేద బ్రాహ్మణుల ఆస్తిని తక్కువ ధరకు చంద్రబాబు, లోకేశ్ దక్కించుకున్నారని రాష్ట్ర ప్రజలు తెలుసుకున్నారన్నారు. ఈ విషయాన్ని ప్రజలు గమనించడంతో ఇప్పుడు వైఎస్‌ఆర్ సీపీ అడ్డుకుంటుందని టీడీపీ నేతలు తమపై నిందలు వేస్తున్నారని ఆయన మండిపడ్డారు. సదావర్తి భూములను కాపాడేందుకే తాము కోర్టును ఆశ్రయించామని ఎమ్మెల్యే ఆర్కే తెలిపారు. సుప్రీంకోర్టు మొట్టికాయలు వేయడంతో ప్రభుత్వం వేలం పాట నిర్వహించిందన్నారు.
అయితే రెండవ విడత నిర్వహించిన బహిరంగ వేలంలో అత్యధిక బిడ్డర్‌గా నిలిచిన వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరు నియోజకవర్గం టీడీపీ ఇన్‌చార్జ్, మాజీ ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి ప్రధాన అనుచరుడు బద్వేలు శ్రీనివాసులురెడ్డి గడువులోగా డబ్బులు చెల్లించని విషయం తెలిసిందే. అంతేకాకుండా కేసులు, పిటిషన్లు అంటూ వైఎస్‌ఆర్ సీపీ బెదిరిస్తోందంటూ శ్రీనివాసులురెడ్డితో ముఖ్యమంత్రి... పత్రికాముఖంగా అబద్ధాలు చెప్పించారని ఎమ్మెల్యే ఆర్కే అన్నారు.
వేలంపాటలో సదావర్తి భూములను దక్కించుకున్న ఆయనను తాము అభినందించి, స్వాగతించామన్న విషయాన్ని గుర్తు చేశారు. ఇక వేలంపాటపై మంత్రి మాణిక్యాలరావు, దేవాదాయా శాఖ కమిషనర్ చెప్పే మాటలకు పొంతన లేదన్నారు. సదావర్తి భూములను అప్పనంగా కొట్టేయాలన్నది చంద్రబాబు ప్లాన్ అని ఆర్కే ఆరోపించారు.
సదావర్తి భూముల కేసు విచారణ వాయిదా
సదావర్తి భూములపై దాఖలైన కేసు విచారణను హైకోర్టు వాయిదా వేసింది. ఈ వేలంలో అత్యధిక ధరకు కోట్ చేసిన వ్యక్తి ముందుకు రావట్లేదని పిటిషనర్ న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు. ఈ భూములపై శుక్రవారం సుప్రీం కోర్టులో విచారణ ఉందని ప్రభుత్వ న్యాయవాది తెలిపారు. దీంతో హైకోర్టు ఈ కేసు విచారణను వచ్చేనెల 3వ తేదీకి వాయిదా వేసింది