
మంగళగిరి: గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గంలోని దుగ్గిరాల మండలంలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో టీడీపీ పోటీ చేస్తుందని ప్రకటించడంతోనే తండ్రీ కొడుకులు చంద్రబాబు, లోకేశ్ మధ్య ఉన్న విభేదాలు బహిర్గతమయ్యాయని ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) విమర్శించారు. మంగళగిరిలోని ఐబీఎన్ భవన్ ప్రెస్‌క్లబ్‌లో శనివారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రమంతా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను బహిష్కరించామని చంద్రబాబు ప్రకటిస్తే.. లోకేశ్ ఇన్‌చార్జిగా ఉన్న మంగళగిరి నియోజకవర్గంలోని దుగ్గిరాలలో ఆయన ఆదేశాలతోనే పోటీ చేస్తున్నామని ప్రకటించారని విమర్శించారు.
పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ సాధించిన అఖండ విజయాన్ని చూసి దిమ్మదిరిగిన చంద్రబాబు.. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో మరింత ఘోర ఓటమి తప్పదని భయపడి ఎన్నికలను బహిష్కరించారన్నారు. అసలు ఆయనను ప్రజలు ఎన్నడో బహిష్కరించారని తెలిపారు. ఎన్నికల్లో ఓటమితో పాటు, వయసురీత్యా చంద్రబాబుకు మతి భ్రమించిందని, ఇకపై రాజకీయాలకు స్వస్తి పలికి, మనవడితో ఆడుకోవడం ఉత్తమమని హితవు పలికారు. దుగ్గిరాల పసుపు మార్కెట్‌లో వ్యాపారులంతా లోకేశ్ సామాజిక వర్గం వారు కావడంతో, వారి డబ్బులతో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలలో గెలవాలని భావిస్తున్నారని విమర్శించారు. టీడీపీ ఎన్ని ప్రలోభాలకు గురిచేసినా.. ప్రజలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టడం ఖాయమని ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ధీమా వ్యక్తం చేశారు.